తనను గాయపరుచడమే కాకుండా..తను వేటాడిన ఆహారమైన అడవి పందిని దొంగిలించిన వేటగాడిని అముర్ పులి(సైబీరియా మంచు పులి) పక్కా స్కెచ్ తో వేటాడి చంపిన ఘటన వన్యప్రాణుల వేట చరిత్రలోనే హైలెట్ గా నిలిచిపోయింది. అముర్ పులి వేటగాడిపై తీర్చుకున్న ప్రతికారం కథనం నెటిజన్లలో వన్యప్రాణుల, ముఖ్యంగా పులుల వేట విధానంపై తీవ్ర ఆసక్తిని రేపింది. రష్యాలోని ఫార్ ఈస్ట్ అడవుల్లో ప్రిమోరీ ప్రాంతంలో 1997లో జరిగిన ఈ ఘటన అడవి జంతువులు, ముఖ్యంగా పులులు తమపై దాడి చేసిన వారిని వదలవని, ప్రతీకారం తీర్చుకునే మేధస్సు, సహనం వాటికి ఉంటాయని నిరూపించేందుకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది.
వివరాల్లోకి వెళితే వ్లాదిమిర్ మార్కోవ్ అనే ఒక రష్యన్ వేటగాడు రష్యా ఫార్ ఈస్ట్ అడవిలో ఓ మంచుపులి అముర్ పై తుపాకి కాల్పులు జరిపి గాయపరిచాడు. అంతటితో ఆగకుండా ఆ పులి అప్పుడే చంపిన అడవి పంది మాంసాన్ని దాని నుంచి దొంగిలించి తీసుకెళ్లాడు. గాయపడిన ఆ పులి భయపడి అక్కడి నుంచి వెళ్లిపోతుందని మార్కోవ్ భావించాడు. అయితే వేటగాడి చేతిలో దెబ్బతిన్న ఆ బెబ్బులి.. అతని ఆలోచనకు భిన్నంగా ప్రతీకారంతో రగిలిపోయింది. తనను గాయపరుచడంతో పాటు తన నోటికాడి ఆహారాన్ని ఎత్తుకెళ్లిన మార్కోవ్ ను వేటాడాలనుకుని నిర్ణయించుకుంది.
11కిలోమీటర్ల ప్రయాణం..ఒకే చోట 48గంటల నిరీక్షణ
మార్కోవ్‌ను ఆ పులి సైబీరియా మంచులో సుమారు 11 కిలోమీటర్ల (7 మైళ్ళు) దూరం వరకు అటవీ ప్రాంతంలో వాసనను పసిగడుతూ ట్రాక్ చేసింది. మార్కోవ్ ఉండే చిన్న వేట శిబిరం (క్యాబిన్) వద్దకు చేరుకుంది. అది మార్కోవ్ కోసం కేవలం బయట వేచి ఉండకుండా..అతడి క్యాబిన్ లోకి ప్రవేశించి, మార్కోవ్ వాసన ఉన్న ప్రతి ఒక్క వస్తువును, అతని పరుపు, పడక వస్త్రాలు, అతని సామాన్లను ఒక్కొక్కటిగా పద్ధతిగా నాశనం చేసింది. ఆ తర్వాతా పథకం మేరకు మార్కోవ్ రాక కోసం క్యాబిన్ ప్రవేశ ద్వారం వద్ద మాటువేసింది. అతను వచ్చే వరకు దాదాపు 48 గంటల పాటు మాటు వేసింది. మార్కోవ్ అక్కడకు రాగానే, పులి అతనిపై దాడి చేసి చంపింది. అతని మృతదేహాన్ని కూడా పాక్షికంగా తినేసి తన కసి తీర్చుకుంది. మార్కోవ్‌ను చంపిన తర్వాత కూడా, ఆ పులి తన ఆక్రోశాన్ని తగ్గించుకోలేదు. స్థానికంగా ఉన్న రోడ్డు కార్మికుల క్యాబిన్‌లను ధ్వంసం చేసింది. చివరికి అటవీ అధికారులు, శాస్త్రవేత్తలు (యూరి ట్రష్ వంటి వారు) నరరూప రాక్షసిగా మారిన ఆ గాయపడిన పులిని గుర్తించి, ప్రజలకు ప్రమాదకరంగా మారడంతో దానిని చంపవలసి వచ్చింది.
ఏకాగ్రత, ఓపిక..లక్ష్యంతో మార్కోవ్ ను చంపేసిన పులి
సున్నా డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలలో, 500 పౌండ్ల బరువున్న ఆ అగ్రశ్రేణి భారీ అముర్ పులి 48 గంటల వరకు మార్కోవ్ కోసం ఓపికగా.. ఏకాగ్రతతో నిరీక్షించి మరీ.. అతడిని చంపాలన్న తన లక్ష్యాన్ని నేరవేర్చుకోవడాన్ని తెలుసుకున్న పరిశోధకులు అశ్చర్యం వ్యక్తం చేశారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన వన్యప్రాణి పరిశోధకులు ఇది యాదృచ్ఛికంగా జరిగిన వేట దాడి కాదని నిర్ధారించారు.ఆ పులికి ఆకలిగా లేదు. దానికి ఎటువంటి ముప్పు లేదు. తాను ఎవరి కోసం ఎదురుచూస్తుందో దానికి కచ్చితంగా తెలుసు. మార్కోవ్ చివరకు తన క్యాబిన్ కి తిరిగి వచ్చినప్పుడు, అతనికి బతికే అవకాశం ఏమాత్రం లేదని పరిశోధకులు నిర్ధారించారు. ఈ దర్యాప్తుకు నాయకత్వం వహించిన వేట నిరోధక అధికారి యూరి ట్రష్..ఈ ఘటనకు సంబంధించిన సాక్ష్యాలను అధ్యయనం చేయడానికి సంవత్సరాల పాటు శ్రమించడం విశేషం. చివరకు అముర్ పులి మార్కోవ్ ను వేటాడటం ఆవేశంతో చేసిన చర్య కాదని..పక్కా లక్ష్యంగా చేసిన దాడి అని అసాధారణమైన సత్యాన్ని వెల్లడించారు. ఆ పులి తన లక్ష్యాన్ని చాలా కాలం పాటు తనలో నిలుపుకుని మరీ వేటాడిందని నిర్థారించారు.
వన్యప్రాణుల వేట చరిత్రలో అరుదైన ఘటన
సాధారణంగా ఒక పులి ఉద్దేశపూర్వకంగా ఒక నిర్దిష్ట మనిషిని వేటాడినట్లుగా వన్యప్రాణుల చరిత్రలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అందులోనూ అముర్ పులులు సాధారణంగా మనుషులకు పూర్తిగా దూరంగా ఉంటాయి. కానీ మార్కోవ్ దానిని గాయపరిచి, దాని ఆహారాన్ని దొంగిలించి దానికి అన్యాయం చేయడంతో..అది దాని స్వంత న్యాయాన్ని అమలు చేసిందని పరిశోధకుడు ట్రష్ తెలిపారు. ఈ కథ మొత్తాన్ని కెనడియన్ జర్నలిస్ట్ జాన్ వైలాంట్ తన ‘ది టైగర్: ఎ ట్రూ స్టోరీ ఆఫ్ వెంజెన్స్ అండ్ సర్వైవల్’ అనే పుస్తకంలో నమోదు చేశారు. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యంత అసాధారణమైన వన్యప్రాణి కథనాలలో ఒకటిగా చరిత్రలో నిలిచిపోవడం ఆసక్తికరం.
వేటలో చేసిన తప్పులతోనే మార్కోవ్ బలి
అముర్ పులిని సైబీరియన్ పులి అని కూడా పిలుస్తారు. భూమిపై అత్యంత అంతరించిపోతున్న పెద్ద పిల్లి జాతులలో ఒకటి. అత్యంత కనిష్ట స్థాయిలో అడవిలో 30 నుంచి 50 వరకు మాత్రమే ఈ పులులు మిగిలి ఉన్నాయి. సోవియట్ పతనం తర్వాత ఉపాధి, ఆదాయం లేకుండా పోవడంతో,పేదరికంతో ప్రేరేపించబడిన మార్కోవ్ అముర్ పులుల కంచుకోట వంటి అటవీ ప్రాంతంలో ప్రవేశించి వేటగాడిగా జీవించేందుకు ప్రయత్నించాడు. అయితే వేటలో మార్కోవ్ ఒకేసారి చేసిన మూడు తప్పులు అతని ప్రాణాలు కోల్పోయేందుకు కారణమయ్యాయి. అముర్ పులిని గాయపరచడంతో పాటు దాని ఆహారాన్ని ఎత్తుకెళ్లడం..అది ఈ ఘటనను మరిచిపోతుందని తప్పుడు అంచనా వేయడంతోనే ఆ పులికి మార్కోవ్ లక్ష్యంగా మారిపోవాల్సి వచ్చిందని పరిశోధకులు తేల్చారు.