• Telugu News
  • /National

నాగపూర్‌–హైదరాబాద్‌ మధ్య ప్రయాణం ఇక మూడున్నర గంటలే.. 50 శాతం పూర్తయిన ఎక్స్‌ప్రెస్‌వే

హైదరాబాద్‌, నాగపూర్‌ మధ్య ప్రయాణ సమయం మూడున్నర గంటలకు తగ్గిపోనున్నది. ఈ మేరకు రెండు నగరాలను కలుపుతూ నిర్మిస్తున్న ఎక్స్‌ప్రెస్‌వే పనులు 50 శాతం వరకూ పూర్తయ్యాయని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నిత్‌న్‌ గడ్కరీ వెల్లడించారు.

Reported by: Jagan Mohan Talluri | జాతీయం | Edited by: విధాత భారత్ డెస్క్ | Jun 25, 2026, 5:41 pm IST
Read Time: 5 mins
నాగపూర్‌–హైదరాబాద్‌ మధ్య ప్రయాణం ఇక మూడున్నర గంటలే.. 50 శాతం పూర్తయిన ఎక్స్‌ప్రెస్‌వే

హైదరాబాద్‌, నాగపూర్‌ మధ్య ప్రయాణం ఇకపై మూడున్నర గంటలకు తగ్గిపోనున్నది. ఈ రెండు నగరాలను కలిపే ఎక్స్‌ప్రెస్‌వే మరికొద్ది సంవత్సరాల్లో పూర్తికానున్నదని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఇటీవల తెలిపారు. ఈ కారిడార్‌లో పనులు ఇప్పటికే 50 శాతం వరకూ పూర్తయ్యాయని చెప్పారు. ఈ ప్రాంతానికి సంబంధించిన వరుస హైవేలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై మంత్రి కొన్ని ప్రకటనలు కూడా చేశారు. నాగపూర్‌–హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌వే గురించి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు పూర్తయితే రెండు నగరాల మధ్య 500 కిలోమీటర్ల ప్రయాణం సమయం గణనీయంగా తగ్గిపోతుందని నితిన్‌ గడ్కరీ చెప్పారు. ఇక నాగపూర్‌, చంద్రాపూర్‌ మధ్య ఆరు లేన్ల హైవే నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని గడ్కరీ వెల్లడించారు. ‘చంద్రాపూర్‌ చుట్టూ రింగు రోడ్డు నేరుగా హైదరాబాద్‌ను కలుపుతుంది. తెలంగాణలో మంచిర్యాల, ఆంధ్రప్రదేశ్‌లోని పలు నగరాలను కలుపుతూ చేపట్టిన ప్రాజెక్టులు అడ్వాన్స్‌డ్‌ స్టేజ్‌లో ఉన్నాయని కేంద్ర మంత్రి వెల్లడించారు.

రాయిపూర్‌, జబల్‌ పూర్‌ను కలుపుతూ కొత్త లింకులు

సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే గోండియాను కూడా కలుపుతుందని, అక్కడి నుంచి రాయిపూర్‌కు వెళ్లేందుకు అనుబంధ మార్గం అవకాశం కల్పిస్తుందని కేంద్రమంత్రి గడ్కరీ వెల్లడించారు. జబల్‌పూర్‌ నుంచి ఈ ప్రాంతంలో రోడ్డు కనెక్టివిటీని పెంచేందుకు కొత్త రహదారిని అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు.

గడ్చిరోలి నుంచి పోర్ట్‌ కనెక్టివిటీ..

భవిష్యత్తు ప్రణాళికలను వెల్లడించిన గడ్కరీ.. స్టీల్‌ హబ్‌గా రూపాంతరం చెందుతున్న గడ్చిరోలి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ఓడ రేవులకు నేరుగా రహదారులు వస్తాయని తెలిపారు. ‘గడ్చిరోలి స్టీల్‌హబ్‌గా ఎదుగుతున్నది. ఈ జిల్లాను జాతీయ రహదారులు ఏపీలోని నౌకాశ్రయాలతో నేరుగా అనుసంధానిస్తాయి. ఫలితంగా పశ్చిమతీరంలోని ముంబైతో పోల్చితే.. నాగపూర్‌.. సముద్రానికి మరింత దగ్గర అవుతుంది’ అని ఆయన వివరించారు.

"నాగపూర్‌–హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టు పూర్తయితే రెండు నగరాల మధ్య 500 కిలోమీటర్ల ప్రయాణం సమయం గణనీయంగా తగ్గిపోతుంది. నాగపూర్‌, చంద్రాపూర్‌ మధ్య ఆరు లేన్ల హైవే నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. చంద్రాపూర్‌ చుట్టూ రింగు రోడ్డు నేరుగా హైదరాబాద్‌ను కలుపుతుంది."

- కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ

దేశవ్యాప్తంగా సొరంగాలు

జాతీయ రహదారుల మౌలిక సదుపాయాల గురించి వివరించిన గడ్కరీ.. దేశవ్యాప్తంగా మూడు లక్షల కోట్ల రూపాయల వ్యయంతో సొరంగాలను నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నిర్మించిందని తెలిపారు. అందులో ప్రపంచంలోనే అతి పొడవైన జోజిలా సొరంగం కూడా ఉందని చెప్పారు. కశ్మీర్‌, ఉత్తరాఖండ్‌, ఇతర మారుమూల ప్రాంతాల్లో వివిధ సొరంగాల పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.