భూమిపై పంట వ్యర్థాలను దగ్ధం చేయవద్దని ఎంత మొత్తుకున్నా…మంటలతో ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లినా…కేసుల పాలైనా.. రైతులు మాత్రం జరిగే నష్టాన్ని పెద్దగా అర్థం చేసుకోలేదు. తెలంగాణలో 2025-26 యాసంగి సీజన్ తర్వాత ఏప్రిల్, మే, జూన్ నెలలో 74.8 లక్షల ఎకరాల్లో కోతలు జరగగా, 16.85 లక్షల ఎకరాల్లో పంట వ్యర్థాలను రైతులు దహనం చేశారని వ్యవసాయ వర్సిటీ రిమోట్ సెన్సింగ్ సర్వే, జియో ఇన్ఫర్మేటిక్ సిస్టంలో తేలడం సంచలనంగా మారింది. రైతులు దగ్ధం చేసిన పంట వ్యర్థాలలో 9 లక్షల ఎకరాల్లో వరికి సంబంధించినవి, మిగతా 8 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న తదితరాలు ఉన్నాయి.
నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి, పెద్దపల్లి జిల్లాలు పంట వ్యర్థాల దహనంలో మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో 50,616 ఎకరాల్లో, సూర్యాపేట జిల్లాలో 55,015, పంట వ్యర్థాల దహనం జరిగింది. పంట వ్యర్థాల దహనం వల్ల 23.63 లక్షల కిలోల నత్రజని, 11.9 లక్షల కిలోల భాస్వరం, 1062 లక్షల కిలోల పొటాష్‌తో పాటు కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్, మీథేన్ వంటి వాయువులు గాలిలో కలిశాయి. దీంతో నేల ఆరోగ్యం, గాలి నాణ్యత దెబ్బతిన్నట్లు నివేదిక పేర్కొంది. పంట వ్యర్థాల దహనం పెనుముప్పుగా పరిణమించినందున.. నిరోధానికి వెంటనే చర్యలు చేపట్టాలని వీసీ అల్దాస్ జానయ్య ప్రభుత్వానికి నివేదించారు.
రాష్ట్రంలో భారీఎత్తున జరుగుతున్న పంట వ్యర్థాల దహనంపై సర్వే చేయాలని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ వర్సిటీని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్, మే, జూన్ నెల మూడోవారం వరకు ఉపగ్రహ సాంకేతికత ద్వారా సర్వే నిర్వహించారు. అది విడుదల చేసిన ఛాయాచిత్రాల ఆధారంగా పంట వ్యర్థాల దహనం తీరును విశ్లేషించి, నివేదిక రూపొందించారు.
పంట వ్యర్థాల దహనం సర్వే గుర్తించిన నష్టాలు
ఒక టన్ను వరి గడ్డి, కొయ్యలని కాల్చివేయడం వల్ల ఐదున్నర కిలోల నత్రజని, 2.3 కిలోల భాస్వరం, 25 కిలోల పొటాష్ గాలిలో కలసిపోతాయని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య వివరించారు. ఒక ఎకరానికి సుమారు రెండున్నర టన్నుల వరిగడ్డి, వ్యర్థాలు వస్తాయని, అంటే ఒక ఎకరం వరి విస్తీర్ణంలో వీటిని కాల్చినట్లయితే 13.5 కిలోల భాస్వరం, 6.75 కిలోల పొటాష్ గాలిలో కలసిపోయి తద్వారా వాయు కాలుష్యం తీవ్రంగా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ లెక్కల ప్రకారం 23.63 లక్షల కిలోల నత్రజని, 11.90 లక్షల కిలోల భాస్వరం, 1062 లక్షల కిలోల పొటాష్ ఈ మూడు మాసాల్లోనే గాలిలో కలసిపోయాయని తెలిపారు. పంట వ్యర్థాలను కాల్చకుండా తిరిగి నేలలోనే కలియదున్ని కొంత కాలం కుళ్ళనిచ్చినట్లయితే నేల సారం పెరగటంతో పాటు కాలుష్యం తగ్గించగలిగే వాళ్ళమని జానయ్య అభిప్రాయపడ్డారు.
ఇలాగే కొనసాగితే పదేళ్లలో ఢిల్లీ తరహా వాయు కాలుష్యం
ఒక టన్ను పంట వ్యర్ధాల కాల్చివేత వల్ల 60 కిలోల అతి ప్రమాదకరమైన కార్బన్ మోనాక్సైడ్‌తో పాటు 1460 కిలోల కార్బన్ డయాక్సైడ్, 200 కిలోల బూడిద గాలిలోకి విడుదల అవుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటు వాతావరణంలో ఉష్ణోగ్రతపెరుగుదలకి ప్రధాన కారణమైన మీథేన్, నైట్రోజెన్ ఆక్సైడ్ వాయువులు గాలిలోకి విడుదల అవుతాయని తెలిపారు. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రస్తుతం ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్‌లో సురక్షితంగా ఉన్న హైదరాబాద్ మహానగరం వచ్చే 10 ఏళ్లలో మరో ఢిల్లీలా మారుతుందని హెచ్చరించారు.
పంజాబ్ నుంచి తెలంగాణకు పాకిన మంటలు
పంట వ్యర్థాల దహనం చేసే పర్యావరణ వ్యతిరేక ప్రక్రియ పంజాబ్ రాష్ట్రం నుంచి తెలంగాణకు పాకింది. మొక్కజొన్న,పత్తి సాగు తర్వాత మిగిలిపోయే వ్యర్థాలకు రైతులు నిప్పు పెడుతుండటం తెలంగాణరాష్ట్రంలో నానాటికి పెరిగిపోతుంది. దీంతో కొత్త పర్యావరణ సమస్యలు, ప్రాణ, ఆస్థి, పంట నష్టాలు, రైతుల మధ్య వివాదాలు నెలకొంటున్నాయి. ఈ అనుచిత పరిణామాలను నివారించడంతెలంగాణ ప్రభుత్వానికి సవాల్ గా మారింది.
పర్యావరణ ముప్పుగా మారిన పంట వ్యర్థాల దహనం..
భూసారం నాశనం: పంట వ్యర్థాల దహనం మంటల తీవ్రమైన వేడి వల్ల భూమిలోని తేమ, సేంద్రియ కర్బనం, ఉపయోగకరమైన సూక్ష్మజీవులు (బ్యాక్టీరియా) నశించిపోతాయి. దీనితో పాటు నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి ముఖ్యమైన పోషకాలు కూడా కాలిపోయి భూసారం నశించిపోతుంది.
గాలి కాలుష్యం: పంట వ్యర్థాల దహనం వల్ల కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వంటి హానికరమైన వాయువులు, భారీగా పొగ, దుమ్ము కణాలు (PM2.5) గాలిలో కలిసి వాతావరణం, గాలి విషపూరితమవుతుంది.
ప్రజారోగ్య సమస్యలు: గాలి కాలుష్యం పెరగడం వల్ల ప్రజలకు శ్వాసకోశ ఇబ్బందులు (ఉబ్బసం, బ్రాంకైటిస్), కంటి మంటలు, చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయి.
ప్రాణ, ఆస్తి నష్టాలు: పంట వ్యర్థాలకు పెట్టిన నిప్పుతో పొలాల్లో మంటలు అదుపుతప్పి వేగంగా వ్యాపించడం వల్ల చుట్టుపక్కల ఉన్న పంటలు, పశువులు, రైతులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదాలు జరుగుతున్నాయి. తెలంగాణలో ఇటీవల మే 24 భూపాలపల్లి జిల్లాలో పంట వ్యర్థాలను కాల్చే క్రమంలో చాగర్ల చంద్రమౌళి, భాగ్యమ్మ అనే ఇద్దరు రైతులు, మే 13నిర్మల్ జిల్లాలో మంద గంగన్న అనే మొక్కజొన్న రైతు, మే 10న హనుమకొండ జిల్లాలో జి. జయపాల్ రెడ్డి అనే రైతు ప్రమాదవశాత్తు మృతి చెందడం తెలిసిందే. అలాగే పంట వ్యర్థాల మంటలు అంటుకుని పక్క పొలాల్లోని పంటలు, పశువుల కొట్టాలు, ట్రాన్స్ ఫార్మార్లు, మోటార్లు, పైపులు, మామిడి తోటలు దగ్ధమై రైతులకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది. ఏపీలో సైతం ఇలాంటి ప్రమాదాలు భారీగా చోటుచేసుకోవడం గమనార్హం.
పర్యావరణ చట్టాలతో జరిమానాలు, జైలు శిక్షలు
పంట వ్యర్థాలను దహనం చేయడాన్ని పర్యావరణ శాఖ పూర్తిగా నిషేధించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాల మేరకు పర్యావరణ పరిహారం కింద రూ.5,000 నుండి రూ.25,000 వరకు పర్యావరణ పరిహారం (జరిమానా) విధిస్తారు. శాటిలైట్ ద్వారా నిఘా ఉంచి, ‘ఎయిర్ యాక్ట్’ కింద మూడేళ్ల జైలు శిక్ష విధించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జైలు శిక్షలు కూడా విధించే అవకాశం ఉంది. దీనికి తోడు పంట వ్యర్థాల మంటలతో నష్టపోయిన బాధిత రైతులు పెట్టే నిప్పు పెట్టిన రైతుల వేసే క్రిమినల్, ఫైనాన్షియల్ కేసులను కూడా రైతులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
రైతులలో అవగాహన పెంచాలి..
పంట వ్యర్థాల దహనంతో ఎదురవుతున్న నష్టాలకు సంబంధించి రైతులలో అవగాహన కల్పిస్తేనే ఈ దుశ్చర్యకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. ముఖ్యంగా పోలీస్ శాఖను, గ్రామపంచాయతీలను ఇందులో భాగస్వామ్యం చేసి..గ్రామాలలో అవగాహన సదస్సులు, డప్పు చాటింపులు వేయించి రైతులలో చైతన్యం కల్పించాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. రైతులు పంట వ్యర్థాలను తగులబెట్టడం చట్టరీత్యా నేరమని రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి.గోపి హెచ్చరించారు. పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ జారీ చేసిన జీవో 27 ప్రకారం వ్యర్థాల దహనాన్ని పూర్తిగా నిషేధించామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా సాధారణ చెత్తను కాల్చితే రూ.5 వేలు, అదే భారీ స్థాయిలో వ్యర్థాలను తగులబెడితే రూ.25 వేల వరకు పర్యావరణ పరిహారం (జరిమానా) విధిస్తామని ఓ అధికారిక ప్రకటనలో తెలిపారు.