Farmers Debt Crisis | అప్పుల ఊబిలో 90% తెలంగాణ రైతు కుటుంబాలు.. సంక్షోభ నివారణకు నిపుణుల పది పరిష్కారాలు
తెలంగాణ రైతు నానాటికీ రుణాల ఊబిలోకి కూరుకుపోతున్నాడని పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వాణిజ్యం పంటలు వేయడం, వాటికి భారీ పెట్టుబడుల కోసం ప్రైవేటు రుణాలు తీసుకోవడం వంటివి ఇందుకు కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు. రైతులకు అధికంగా రుణ భారాలు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఏడో స్థానంలో నిలిచింది. అయితే.. రుణ భారం నుంచి రైతులను తప్పించేందుకు వ్యవసాయ రంగ నిపుణులు పది పరిష్కారాలను సూచిస్తున్నారు.
ముఖ్యాంశాలు..
- ప్రభుత్వం రైతు రుణాలు మాఫీ చేసినా సగటు రైతుకు అప్పుల భారం తప్పడం లేదు..
- 2025 ఆగస్టు 5న కేంద్ర వ్యవసాయ మంత్రి పార్లమెంటుకు ఇచ్చిన సమాధానంలో తెలంగాణలో ఒక్కో రైతు కుటుంబానికి సగటున రూ.1.52 లక్షల అప్పు ఉందని తెలిపారు.
- తెలంగాణలో మొత్తం రైతు కుటుంబాలు 22 లక్షల వరకు ఉంటే దాదాపు 20 లక్షల కుటుంబాలు(90 శాతం వరకు) అప్పుల ఊబిలో కూరుకు పోయినట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి.
- చాలా మంది రైతులకు బ్యాంకుల నుంచి అవసరానికి సరిపడా రుణాలు రాక మనీ లెండర్ల వద్ద అధిక వడ్డీలకు ఎక్కువగా తీసుకుంటారు.
- రైతుకు రుణ విముక్తి కావాలంటే 10 రకాల పరిష్కారాలను నిపుణులు చూపుతున్నారు.
హైదరాబాద్, విధాత:
Farmers Debt Crisis | అందరికీ కడుపు నిండా అన్నం పెట్టే రైతన్న అప్పుల ఉబిలో పీకలలోతు దాకా కూరుకుపోయాడు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఏమున్నది గర్వకారణం అన్నట్లుగా…. పాలకులు ఎవరు వచ్చినా… రైతు బంధు.. రైతు భరోసా ఇచ్చినా కూడా రైతులు అప్పుల ఊబి నుంచి బయటపడటం లేదన్నది వాస్తవం. ప్రభుత్వం రైతు రుణాలు మాఫీ చేసినా సగటు రైతుకు అప్పుల భారం తప్పడం లేదు. 2025 ఆగస్టు 5వ తేదీన కేంద్ర వ్యవసాయ మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్ పార్లమెంటుకు ఇచ్చిన సమాధానంలో తెలంగాణలో ఒక్కో రైతు కుటుంబం సగటున రూ. 1.52 లక్షల అప్పు ఉందని తెలిపారు. ఇది జాతీయ సగటు అప్పు రూ.74.121 కంటే చాలా ఎక్కువన్నారు. ఈ ఒక్క స్టేట్‌మెంట్ చాలు తెలంగాణ రైతు దయనీయ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవడానికి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేసినప్పటికీ రైతులకు రుణవిముక్తి కాలేదంటే పరిస్థితి తీవ్రత ఎంతలా ఉందో అర్థం అవుతున్నది. తెలంగాణలో రైతుల రుణాలు రూ.1,75,960 కోట్లు ఉన్నాయని పలు నివేదికలు తెలియజేస్తున్నాయి.
90 శాతం కుటుంబాలు అప్పుల సుడిగుండంలోనే
తెలంగాణలో మొత్తం రైతు కుటుంబాలు 22 లక్షల వరకు ఉంటే దాదాపు 20 లక్షల కుటుంబాలు అంటే.. సుమారు 90 శాతం వరకు… అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి. రైతు స్వరాజ్య వేదిక ప్రతి ఏటా నివేదిక విడుదల చేస్తూ ఉంటుంది. దాని తాజా నివేదికను పరిశీలిస్తే పంట నష్టం జరిగి చేసిన అప్పులు తీర్చే మార్గం లేక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతనే 2024లో 256 మంది, 2025లో 283 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపింది. ఈ నివేదికను స్థానిక దిన పత్రికలలో ప్రచురితమైన వార్తల ఆధారంగా రూపొందించినట్లు రైతు స్వరాజ్య వేదిక పేర్కొన్నది.
అధిక వడ్డీ రుణాలే కారణం…
తెలంగాణలో రైతులు అప్పుల పాలవడానికి కారణాలను పరిశీలిస్తే… చాలా మంది రైతులు.. బ్యాంకుల నుంచి అవసరానికి సరిపడా రుణాలు రాక… మనీ లెండర్ల వద్ద అధిక వడ్డీలకు డబ్బు తీసుకుంటూ ఉంటారు. కొన్ని చోట్ల నెలకు నూటికి రూ.3 మించిన వడ్డీకీ రుణాలు తీసుకుంటున్నారు. ఫలితంగా వడ్డీలు కూడా చెల్లించలేని స్థితికి చేరుకుంటున్నారు. రాష్ట్రంలో సొంత భూమి ఉన్న రైతులు, కౌలు రైతులు ఎక్కువగా పత్తి, మిర్చి లాంటి వాణిజ్య పంటలు సాగు చేస్తుంటారు. వీటికి ఎక్కువ పెట్టుబడి అవసరం. ఎరువులు, పురుగుల మందుల ఖర్చులు భారీగా పెరిగి పోయాయి. ఇంత చేసినా పంట దిగుబడి బాగా వస్తుందన్న నమ్మకం లేదు. ఈ ఏడాది వర్షాల కారణంగా సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో నాలుగుసార్లు పంట నష్టం ఏర్పడింది. కొన్నిచోట్ల వర్షాలు సకాలంలో కురువక పంటలు ఎండి పోతాయి. మరో చోట వర్షాలు ఎక్కువై పంట నష్టం వస్తుంది. అన్నీ అనుకూలించి పంటలు పండినా ఒక్కోసారి మార్కెట్లో ధర ఉండదు. రైతుల చేతి నుంచి పంట వ్యాపారుల చేతికి వచ్చిన తరువాత ధర ఆకాశాన్ని అంటుతుంది. ఇలా ధరల్లో స్థిరత్వం లేక పోవడం వల్ల రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు.
ఇలా రైతులు అప్పుల ఊబిలోకి కూరుకుపోవడంలో దేశంలో దక్షిణాది రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. టాప్ టెన్ రాష్ట్రాలలో తమిళనాడు మొదటి స్థానం, ఏపీ రెండవ స్థానం, మహారాష్ట్ర 3వ స్థానం కాగా తెలంగాణ 7వ స్థానంలో ఉన్నది. దేశవ్యాప్తంగా రైతులపై వ్యవసాయ రుణాల భారం రూ.31,34,807 కోట్లు ఉండగా తెలంగాణ రైతులపై రుణభారం రూ1,75,960 కోట్లు ఉంది.
రుణ విముక్తం ఎలా?
రైతులు రుణ విముక్తులు కావాలంటే రుణమాఫీలు, రైతు బంధు, రైతు భరోసాలు మాత్రమే సరిపోదని వ్యవసాయ రంగ నిపుణులు అంటున్నారు. పంటలకు సరైన ధర, తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడం, పంటల బీమాతోపాటు మార్కెట్ సంస్కరణలు కలిసి పని చేయాలని సూచిస్తున్నారు. రుణ మాఫీ అనేది తాత్కాలిక ఉపశమనం మాత్రమే కానీ దీర్ఘకాలిక పరిష్కారం కాదని స్పష్టం చేస్తున్నారు. రైతుకు రుణ విముక్తి కావాలంటే 10 రకాల పరిష్కారాలను చూపుతున్నారు.
ఆ పరిష్కారాలు ఇవే…
- రైతు పండించిన పంటకు లాభసాటి ధర ఇవ్వాలి. రైతులు పండించిన పంటకు ఉత్పత్తి ఖర్చుపైన 50 శాతం లాభం వచ్చే విధంగా ధర రావాలి. దీనికి కోసం వ్యవసాయ కమిషన్ సూచించే విధంగా కనీస మద్దతు ధర విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలి.
- రైతులకు బ్యాంకుల నుంచి అవసరమైన రుణాలన్నింటినీ నాలుగు శాతం కంటే తక్కువ వడ్డీతో అందించాలి. అప్పుడే ప్రైవేట్ అప్పుల జోలికి వెళ్లే అవసరం ఉండదు. ఈ మేరకు రిజర్వ్ బ్యాంకు తన మార్గదర్శకాలను సులభతరం చేయాలి. కౌలు రైతులకు కూడా పంట రుణాలు అందించాలి.
- ప్రకృతి విపత్తుల వల్ల పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించేలా పంటల బీమా సక్రమంగా అమలు చేయాలి. ఈ మేరకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పారదర్శకంగా అమలు చేయాలి.
- రైతుకు సాగు ఖర్చు తగ్గితే ఆ మేరకు లాభం వస్తుంది. ముఖ్యంగా ఎరువులు, పురుగుల మందులు, విత్తనాల ధరలు తగ్గితే రైతు ఖర్చు భారీ ఎత్తున తగ్గుతుంది. ఈ మేరకు సహజ వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.
- సరైన సాగునీటి వసతులు లేక బోర్లు వేసి, రైతులు ఆర్థికంగా త్రీవంగా నష్టపోతున్నారు. స్థిరమైన సాగునీటి వసతి ఉంటే రైతులకు పంట నష్టాలు తగ్గుతాయి. ఈ మేరకు డ్రిప్‌లు, చెరువులు, కాలువల వ్యవస్థ పెరగాలి.
- రైతులు దళారీలపై ఆధారపడకుండా పంటను నేరుగా అమ్ముకునేలా మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలి.
- రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా పండ్లు, కూరగాయలు, పశు పోషణ, కోళ్ల పెంపకం వంటి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు రైతులకు అవసరం. ఈ మేరకు రైతులకు అవగాహన కల్పించాలి.
- రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేసుకొని రైతులు కలిసి తమ ఉత్పత్తులను విక్రయిస్తే ఖర్చు తగ్గి, ధర పెరిగే అవకాశం ఉంటుంది. ఈ దిశగా వ్యవసాయ అధికారులు రైతులను ప్రోత్సహించాలి. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఏర్పాటు ఇందులో కీలకంగా ఉండనున్నది.
- రైతులుతాము పండించిన పంటకు మార్కెట్ ధర వచ్చే వరకు నిల్వ చేసుకోవడానికి గోదాములు, కోల్ఢ్ స్టోరేజీలు తగినన్ని ఏర్పాటు చేయాలి.
- వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేసి, ప్యాకింగ్ చేసి ఎగుమతి చేస్తే రైతులకు ఆదాయం పెరుగుతుంది. ఈ మేరకు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు విరివిగా తీసుకురావాలి. ఎగుమతులే లక్ష్యంగా ఉత్పత్తి జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి.
అప్పుల్లో అన్నదాతలు – రాష్ట్రాల వారీగా వ్యవసాయ రుణాలు
• దేశవ్యాప్తంగా రైతులపై మొత్తం వ్యవసాయ రుణాలు ₹31,34,807 కోట్లు
• పంట రుణాలు: ₹16,34,219 కోట్లు
• టర్మ్ లోన్స్: ₹15,00,588 కోట్లు
రాష్ట్రాల వారీగా ఎక్కువ రుణాలు ఉన్న రాష్ట్రాలు
1. తమిళనాడు – ₹5,06,290 కోట్లు
2. ఆంధ్రప్రదేశ్ – ₹3,75,254 కోట్లు
3. మహారాష్ట్ర – ₹3,07,293 కోట్లు
4. ఉత్తరప్రదేశ్ – ₹2,30,096 కోట్లు
5. కర్ణాటక – ₹2,10,244 కోట్లు
6. రాజస్థాన్ – ₹1,92,293 కోట్లు
7. తెలంగాణ – ₹1,75,960 కోట్లు
8. గుజరాత్ – ₹1,68,460 కోట్లు
9. కేరళ – ₹1,61,023 కోట్లు
10. మధ్యప్రదేశ్ – ₹1,70,757 కోట్లు
తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ వివరాలు
ఆంధ్రప్రదేశ్:
• పంట రుణాలు – ₹2,01,744 కోట్లు
• టర్మ్ లోన్స్ – ₹1,73,510 కోట్లు
• మొత్తం – ₹3,75,254 కోట్లు
తెలంగాణ:
• పంట రుణాలు – ₹95,167 కోట్లు
• టర్మ్ లోన్స్ – ₹80,792 కోట్లు
• మొత్తం – ₹1,75,960 కోట్లు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram