Bypass to Bhupalpally | భూపాలపల్లికి బైపాస్ రోడ్డు.. రూ.250 కోట్ల నిర్మాణ అంచనా
నేషనల్ హేవే -353సీ ప్రధాన రహదారి పై భూపాలపల్లి పట్టణం ఉంది. రూ. 250 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ బైపాస్ రోడ్డుకు సంబంధించి రూ. 175 కోట్లు నిర్మాణ పనులకు, రూ. 75 కోట్లు భూసేకరణకు వినియోగించనున్నట్లు ప్రాథమిక అంచనా వేశారు. ఈ నిధులను 2025-2026 వార్షిక ప్రణాళికలో చేర్చనున్నట్లు కేంద్రమంత్రి పేర్కొన్నారు.

Bypass Road to Bhupalpally | విధాత, ప్రత్యేక ప్రతినిధి : భూపాలపల్లి పట్టణానికి బైపాస్ రోడ్డు నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మేరకు కేంద్ర రోడ్లు, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ రోడ్డు నిర్మించనున్నట్లు ప్రకటించారు. రోడ్డు నిర్మాణానికి ఈ వార్షిక ప్రణాళికలోనే నిధులు మంజూరు చేస్తామని ఆయన హామీ ఇవ్వడంతో త్వరలో మిగిలిన ప్రక్రియ కొనసాగనున్నది. రోడ్డు నిర్మాణానికి సంబంధించి అవసరమైన డీటైల్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను తయారు చేసి టెండర్ పనులు పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి గడ్కరీ లేఖ ద్వారా వరంగల్ ఎంపీ కడియం కావ్యకు తెలియజేశారు.
నేషనల్ హేవే -353సీ ప్రధాన రహదారి పై భూపాలపల్లి పట్టణం ఉంది. రూ. 250 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ బైపాస్ రోడ్డుకు సంబంధించి రూ. 175 కోట్లు నిర్మాణ పనులకు, రూ. 75 కోట్లు భూసేకరణకు వినియోగించనున్నట్లు ప్రాథమిక అంచనా వేశారు. ఈ నిధులను 2025-2026 వార్షిక ప్రణాళికలో చేర్చనున్నట్లు కేంద్రమంత్రి పేర్కొన్నారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను, ప్రమాదాలను ఎంపీ కావ్య మంత్రి గడ్కరీకి పలు మార్లు తెలియజేశారు. పట్టణానికి బైపాస్ రోడ్డు నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని కోరారు. స్వల్పకాలంలోనే భూపాలపల్లి పట్టణంగా అభివృద్ధి దిశగా పయనిస్తున్నది. పరకాల, కాళేశ్వరం ప్రధాన రహదారిపై ఉన్న ఈ పట్టణానికి బైపాస్ రోడ్డు మంజూరు కావడంతో స్థానిక ప్రజలతో పాటు పరకాల, కాళేశ్వరం మధ్య ప్రయాణంచేసే వారి ఇబ్బందులు కూడా తగ్గే అవకాశం ఉంది.
భూపాలపల్లి అభివృద్ధికి దోహదం : ఎంపీ కావ్య
బైపాస్ రోడ్డు మంజూరుతో భూపాలపల్లి పట్టణం అభివృద్ధి దిశగా పురోగమిస్తుందని ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోడ్డు మంజూరుతో భూపాలపల్లి పట్టణ ప్రజల ఎన్నో ఏళ్ళ సమస్య తీరనుందని తెలిపారు. బైపాస్ రోడ్డు నిర్మాణ అవసరాన్ని వివరిస్తూ పలు మార్లు మంత్రిని కలిసినట్లు ఆమె వివరించారు. బైపాస్ రోడ్డు నిర్మాణంతో ట్రాఫిక్ సమస్య, ప్రజల భద్రతో పాటు ప్రయాణదూరంలో లాభం కలుగుతుందని కావ్య ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికి సహకరించిన మంత్రి గడ్కరికి ధన్యవాదాలు తెలియజేశారు.