ఓరుగల్లు గడ్డపై నుండి ‘రుద్రమ’ విజయం… ఉత్సాహాన్ని నింపిన రాకెట్ ప్రయోగం
ఓరుగల్లు గడ్డపై నుండి తొలిసారిగా మోడల్ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఏటిడిఆర్ఎల్, కుడా, వరంగల్ ఎన్ఐటి సమన్వయంతో చేపట్టిన ఈ ప్రయోగం భద్రకాళి బండ్ వేదికగా నిలిచింది. శనివారం సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో మోడల్ రాకెట్ ను ప్రయోగించారు.
- ఓరుగల్లు గడ్డపై నుండి ‘రుద్రమ’ విజయం
- భద్రకాళి బండ్ వద్దనుండి మోడల్ రాకెట్ ప్రయోగం
- ప్రయోగాన్ని వీక్షించిన ఎంపీ, ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ, కలెక్టర్
- విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపిన రాకెట్ ప్రయోగం
విధాత, వరంగల్ ప్రతినిధి : ఓరుగల్లు గడ్డపై నుండి తొలిసారిగా మోడల్ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఏటిడిఆర్ఎల్, కుడా, వరంగల్ ఎన్ఐటి సమన్వయంతో చేపట్టిన ఈ ప్రయోగం భద్రకాళి బండ్ వేదికగా నిలిచింది. శనివారం సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో రుద్రమ గా నామకరణం చేసి రాకెట్ ను రూపొందించిన శశాంక్ భూపతి, ఏటిడిఆర్ఎల్ బృందం సభ్యులు భద్రకాళి బండ్ వద్ద నుండి ఈ మోడల్ రాకెట్ ను ప్రయోగించారు. మోడల్ రాకెట్ రుద్రమ వేగంగా ఆకాశం వైపు దూసుకెళ్లింది. హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరమైన చారిత్రక వరంగల్ నగరంలో మోడల్ రాకెట్ ప్రయోగాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున భద్రకాళి బండ్ వద్దకు విద్యార్థులు, యువత, నగరవాసులు చేరుకున్నారు. వీరందరూ చూస్తుండగానే ఏటిడిఆర్ఎల్ బృందం సభ్యులు రాకెట్ ప్రయోగాన్ని చేపట్టగానే విద్యార్థులు యువత నగరవాసులు ఆసక్తిగా తిలకించారు. రాకెట్ ప్రయోగం విజయవంతంగా నింగి వైపు దూసుకెళ్తుండడంతో ఉత్సాహంగా కేరింతలు పెట్టారు. జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా చేపట్టిన రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో సరికొత్త చరిత్రను సృష్టించింది. తొలి దశగా చిన్న మోడల్ రాకెట్ ప్రయోగంగా మొదలుపెట్టిన రాకెట్ ప్రయోగం విజయ తీరాలకు చేరడంతో రానున్న భవిష్యత్తులో పెద్ద స్వప్నాలకు నాంది పలికింది. నూతన ఆవిష్కరణలకు, మరింత మంది ఔత్సాహికులను విజ్ఞాన తీరాల వైపు నడిపించేందుకు ఈ ప్రయోగం ఊతమిస్తోంది. భద్రకాళి బండ్ వద్ద రాకెట్ ప్రయోగానికి వేదిక కావడంతో వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లు చేశారు. రాకెట్ ప్రయోగం కౌంట్ డౌన్, ఆకాశం వైపు రాకెట్ సాగే దృశ్యాలను వీక్షించేందుకు డిజిటల్ స్క్రీన్ ను ఏర్పాటు ఏర్పాటు చేశారు. భద్రకాళి బండ్ పై నిర్వహించిన ప్రయోగంలో రాకెట్ ఒకటి రెండు దశల్లో అద్భుతంగా ఎగిరి నిర్దేశిత ఎత్తును చేరుకోగా మూడో దశలో గాలి దుమారం కారణంగా స్వల్ప సాంకేతిక ఇబ్బంది తలెత్తినప్పటికీ చివరకు మొత్తం ప్రయోగ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది.
రాకెట్ ప్రయోగాన్ని వీక్షించిన ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్ తదితరులు
భద్రకాళి బండ్ వద్ద మోడల్ రాకెట్ రుద్రమ ప్రయోగాన్ని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్ రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, ఇస్రో విశ్రాంత శాస్త్రవేత్త శేషగిరిరావు, ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా ఫౌండర్ సెక్రటరీ డైరెక్టర్ రఘునందన్ కుమార్, తదితరులు గ్యాలరీ నుండి వీక్షించారు. రాకెట్ ప్రయోగం అనంతరం వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ మోడల్ రాకెట్ ప్రయోగం విద్యార్థులు యువతలో విజ్ఞానం పట్ల ఆసక్తిని పెంపొందించడంతో పాటు భవిష్యత్తు ప్రయత్నాలకు వేదికగా నిలిచిందన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram