ఇరాన్​ సుప్రీం నాయకుడు ఖమేనీ బతికే ఉన్నారా? చనిపోయారా?

అమెరికా–ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ పరిస్థితిపై అనిశ్చితి. ఖమేనీ మరణించిఉండవచ్చని నెతన్యాహూ సంచలన ప్రకటన, ఇజ్రాయెల్ మీడియా మరణ వార్తలు, ఇరాన్ ఖండన. ఉపగ్రహ చిత్రాలు, అంతర్జాతీయ ప్రతిస్పందనలతో ఉద్రిక్తత.

Reported by: ADHARVA | అంత‌ర్జాతీయం | Mar 01, 2026, 1:05 am IST
Read Time: 7 mins
ఇరాన్​ సుప్రీం నాయకుడు ఖమేనీ బతికే ఉన్నారా? చనిపోయారా? ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ – దాడుల తర్వాత ఆయన పరిస్థితిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ. మరణించివుండవచ్చని నెతన్యాహు సంచలన ప్రకటన

Is Iran Supreme Leader Khamenei Alive Or Dead? Uncertainty After US–Israel Strikes On Tehran

హైలైట్స్:

  • మేనీ మరణించి ఉండవచ్చు : నెతన్యాహు సంచలన ప్రకటన

విధాత వరల్డ్​ డెస్క్​ | ఫిబ్రవరి 28, 2026 | హైదరాబాద్​:
అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడులతో మధ్యప్రాచ్యం ఉద్రిక్తతల అగ్నికుండగా మారింది. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ (86) లక్ష్యంగా ఉన్నారనే వార్తలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. ఆయన బతికే ఉన్నారా? లేక మరణించారా? అన్నది ఇప్పటికీ స్పష్టత లేని అంశంగా మారింది. ఇజ్రాయెల్ మీడియా “మరణించి ఉండవచ్చు” అని ప్రచారం చేస్తుండగా, ఇరాన్ ప్రభుత్వం మాత్రం “సురక్షితంగానే ఉన్నారు” అని చెబుతోంది. అధికారిక ధృవీకరణ ఇంకా వెలువడలేదు.

కాగా, కొద్దిసేపటి క్రితం ఇజ్రాయెల్​ ప్రధాని బెంజమిన్​ నెతన్యాహు, ఆయతుల్లా అలీ ఖమేనీ “మరణించిఉండవచ్చ”ని సంచలన ప్రకటన చేసారు.

దాడులు, ఉపగ్రహ చిత్రాలు, ‘డికాపిటేషన్ స్ట్రైక్వాదనలు

టెహ్రాన్‌లో ఖమేనీ నివాస సముదాయం పై వైమానిక దాడి తర్వాత పొగలు ఎగసిపడుతున్న ఉపగ్రహ దృశ్యం

అమెరికా–ఇజ్రాయెల్ దాడుల అనంతరం టెహ్రాన్‌లోని ఖమేనీ నివాస సముదాయం వద్ద కనిపిస్తున్న ధ్వంసం, పొగలు – ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టమైన నష్టం.

శనివారం ఉదయం ప్రారంభమైన అమెరికా–ఇజ్రాయెల్ దాడుల్లో టెహ్రాన్‌లోని బైత్-ఎ-రహ్బరీ కాంపౌండ్ (ఖమేనీ అధికార నివాస సముదాయం)కు భారీ నష్టం వాటిల్లినట్లు అంతర్జాతీయ మీడియా ప్రచురించిన ఉపగ్రహ చిత్రాలు సూచిస్తున్నాయి. బంకర్-బస్టర్ బాంబులు వినియోగించి భూగర్భ సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

దాడికి ముందు మరియు తర్వాత ఖమేనీ బైత్-ఎ-రహ్బరీ సముదాయం పోలికను చూపుతున్న ఉపగ్రహ చిత్రాలు

దాడికి ముందు ప్రశాంతంగా ఉన్న ఖమేనీ నివాసం… దాడి తర్వాత పూర్తిగా ధ్వంసమైన స్థితి – ఉపగ్రహ చిత్రాల ద్వారా బయటపడిన వాస్తవ దృశ్యాలు.

ఇజ్రాయెల్ ఛానల్-12 సహా కొన్ని మీడియా సంస్థలు “ఖమేనీ మరణించి ఉండవచ్చని పెరుగుతున్న సంకేతాలు ఉన్నాయి” అని పేర్కొన్నాయి. కొందరు భద్రతా విశ్లేషకులు దీనిని “డికాపిటేషన్ స్ట్రైక్(Decapitation Strike)”గా అభివర్ణిస్తున్నారు – అంటే శత్రు దేశ నాయకత్వాన్ని పూర్తిగా తుడిచిపెట్టడం.

రాయిటర్స్ నివేదికల ప్రకారం, ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నసీర్జాదెహ్, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) కమాండర్ మొహమ్మద్ పాక్పూర్ దాడుల్లో మృతి చెందినట్లు సమాచారం. అయితే దీనిపై కూడా అధికారిక నిర్ధారణ రాలేదు.

ఇరాన్ స్పందన: “బతికే ఉన్నారు

ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నసీర్జాదెహ్ మరియు IRGC కమాండర్ మొహమ్మద్ పాక్పూర్ చిత్రాలు

దాడుల్లో మరణించారని అంతర్జాతీయ మీడియా పేర్కొంటున్న ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నసీర్జాదెహ్, IRGC కమాండర్ మొహమ్మద్ పాక్పూర్.

ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో “నాకు తెలిసినంతవరకు ఖమేనీ సురక్షితంగానే ఉన్నారు” అని స్పష్టం చేశారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ కూడా సేఫ్ అని తెలిపారు.

దాడులు ప్రారంభానికి ముందే ఖమేనీని రహస్య సురక్షిత ప్రదేశానికి తరలించినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఆయన నుంచి ఎటువంటి వీడియో లేదా ఆడియో సందేశం వెలువడలేదు. ఇరాన్ ప్రభుత్వ మీడియా కూడా బతికే ఉన్నట్టు రుజువులు చూపకపోవడం అనిశ్చితిని మరింత పెంచుతోంది.

 “ఆపరేషన్ లయన్స్ రోర్” – నెతన్యాహు, ట్రంప్ వ్యాఖ్యలు

ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహు ఈ దాడులను “ఆపరేషన్ లయన్స్ రోర్”గా పేర్కొన్నారు. ఇరాన్ అణు, క్షిపణి సామర్థ్యాలను అడ్డుకోవడమే లక్ష్యమని చెప్పారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీడియో సందేశంలో ఇరాన్ ప్రజలకు పిలుపునిస్తూ “మీ స్వేచ్ఛకు సమయం వచ్చింది” అన్నారు. ఇరాన్ పాలక వ్యవస్థను విమర్శిస్తూ అధికార మార్పిడి సంకేతాలు ఇచ్చారు.

దీనికి ప్రతిగా ఇరాన్ ఇజ్రాయెల్, గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణి దాడులు చేపట్టింది. ఖతార్, యూఏఈ, బహ్రైన్, సౌదీ అరేబియా వంటి దేశాలు అప్రమత్తమయ్యాయి.

ఇప్పుడు పరిస్థితి దశలో ఉంది?

ఖమేనీ జీవించి ఉన్నారా లేదా అన్నది అధికారికంగా ధృవీకరించబడలేదు. ఇజ్రాయెల్ మీడియా వాదనలు ఒకవైపు, ఇరాన్ అధికారిక ఖండన మరోవైపు ఉన్నాయి. ఖమేనీ ప్రత్యక్ష ప్రసంగం లేదా వీడియో సందేశం వెలువడితేనే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. లేదంటే ఇరాన్‌లో నాయకత్వ సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా ఉంది. మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది.