Middle East War | మధ్య ఆసియా యద్ధానికి నెల రోజులు పూర్తి.. కూలిపోని ఇరాన్‌.. దిక్కుతోచని ట్రంప్‌

ఇలా దాడి చేసి.. అలా ఇరాన్‌ను ఫినిష్‌ చేస్తామని బీరాలు పలికిన అమెరికా.. ఇప్పుడు యుద్ధాన్ని ఎలా ముగించాలో తెలియక దిక్కులు చూస్తున్నది. నెల రోజులు పూర్తయినా.. ఇరాన్‌ను లొంగదీసుకోకపోగా.. తనపైనే ఒత్తిడిని పెంచుకుంటున్నాడు ట్రంప్‌.

Middle East War | మధ్య ఆసియా యద్ధానికి నెల రోజులు పూర్తి.. కూలిపోని ఇరాన్‌.. దిక్కుతోచని ట్రంప్‌

Middle East War | అణ్వాయుధాన్ని తయారు చేస్తుందనే అనుమానంతో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులు ప్రారంభించి నెల రోజులు పూర్తయ్యాయి. దేశంలో అధికార వ్యవస్థను మార్చేస్తామని అమెరికా బీరాలు పలికినా.. ఇప్పుడు పరిస్థితి అనూహ్య మలుపులు తీసుకుంటున్నది. కొద్ది రోజుల్లోనే ఇరాన్‌ను ఫినిష్‌ చేస్తామని ధీమా వ్యక్తం చేసినా.. ట్రంప్‌, నెతన్యాహు అంచనాలకు భిన్నంగా ఇరాన్‌ తీవ్రస్థాయిలో ప్రతిఘటిస్తున్నది. తన పొరుగున ఉన్న అమెరికా స్థావరాలపై దాడులు చేస్తూ ఆ దేశానికి తీవ్ర ఆర్థిక నష్టాలను మిగుల్చుతున్నది.

తొలి దాడిలోనే ఖమేనీ హత్య

యుద్ధం ప్రారంభించిన తొలి 24 గంటల్లోనే 1500కుపై ఇరాన్‌ లక్ష్యాలపై అమెరికా, ఇజ్రాయెల్‌ బాంబులు కురిపించాయి. ఇరాన్‌ నాయకత్వాన్ని దెబ్బతీసే ప్రధాన లక్ష్యంతో సాగించిన ఈ దాడుల్లో సుప్రీం నాయకుడు అయొతుల్లా అలీ ఖమేనీ మరణించారు. కానీ.. ప్రజల్లో ప్రభుత్వంపై తిరుగుబాటు రాకపోవడం అమెరికా–ఇజ్రాయెల్‌కు మొదటి షాక్‌ అనే చెప్పాలి. మరోవైపు ఇరాన్‌.. తక్కువ ఖర్చుతో భారీ ప్రభావాన్ని చూపించేలా దాడులకు దిగుతున్నది. అమెరికా–ఇజ్రాయెల్‌ దాడులకు వెంటనే ప్రతిస్పందించిన ఇరాన్‌.. ఐదు వందలకు పైగా క్షిపణులు, 2000కుపైగా డ్రోన్లతో బదులిచ్చింది. ప్రత్యేకించి ఇరాన్‌కు చెందిన షాహెద్‌ డ్రోన్లు దాడుల్లో కీలక ఆయుధాలుగా మారాయి. గల్ఫ్‌ దేశాలపై దాడులు.. అమెరికాపై తీవ్ర ఒత్తిడిని పెంచాయి.

కీలకంగా.. హార్మూజ్‌ జలసంధి

ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20 శాతం వరకూ రవాణా జరిగే హార్మూజ్‌ జలసంధి.. యుద్దంలో కీలకంగా తయారైంది. ఈ మార్గాన్ని ఇరాన్‌ కట్టడి చేయడంతో భారత్‌ సహా అనేక దేశాలు విలవిల్లాడాయి. చమురు ధరలు 40 శాతం వరకూ పెరగడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి గురైంది.

మూడోవారంలో కీలక మలుపులు

  • యుద్ధం మొదలైన మూడో వారానికి పరిస్థితి మరింత తీవ్రంగా మారింది.
  • సౌత్‌ పర్స్‌ గ్యాస్‌ ఫీల్డ్‌పై ఇజ్రాయెల్‌ దాడి చేయగా.. అందుకు ప్రతిగా ఖతార్‌, సౌదీ ఎనర్జీ కేంద్రాలపై ఇరాన్‌ దాడులకు దిగింది.
  • దాంతో ఈ యుద్ధం కాస్తా.. ఇంధన యుద్ధంగా మారిపోయింది. 
  • ఈ పరిణామాలు కొనసాగుతున్న క్రమంలోనే ఇరాన్‌ కొత్త సుప్రీం నేతగా ఖమేనీ కుమారుడు మొజ్తాబా ఖమేనీ నియమితులయ్యారు.
  • ఆయితే ఆయన బహిరంగంగా కనిపించకపోవడం కూడా చర్చనీయాంశమైంది.
  • యుద్ధంలో అనేక మంది ఇరాన్‌ కీలక నేతలను, మిలిటరీ లీడర్లను అమెరికా హతమార్చినా.. ఇరాన్‌ సైన్యం తగ్గేదే లేదంటూ మరింత విజృంభించి ప్రతిదాడులు చేస్తుండటం అమెరికా, ఇజ్రాయెల్‌కు మింగుడుపడని అంశంగా తయారైంది.
  • 16 దేశాలకు యుద్ధం విస్తరించింది.
  • వేల మంది చనిపోగా.. లక్షల మంది నిరాశ్రయులయ్యారు.

ట్రంప్ వ్యూహం మారిందా?

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై చోటు చేసుకుంటున్న ఒత్తిడి.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నూ చుట్టుముట్టింది. ఒకవైపు నాటో దేశాలు సహకరించడం లేదు. దీంతో నాటో దేశాలపైనా ట్రంప్‌ పెద్ద ఎత్తున విమర్శలు కురిపించారు. పిరికిపందలంటూ దుమ్మెత్తిపోశారు. మొత్తానికి ఓ దశలో ట్రంప్‌.. ఇరాన్‌పై దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఏప్రిల్‌ 6 వరకూ చర్చలకు అవకాశం ఇస్తున్నట్టు చెప్పారు. కానీ.. చర్చల్లో ఎటూ తెగే పరిస్థితులు కనిపించడం లేదు. యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా షరతులు పెడితే.. వాటిని కాలదన్నిన ఇరాన్‌.. తాను సైతం కండిషన్లు పెట్టింది. వాటిని పరిష్కరిస్తేనే యుద్ధానికి ముగింపు ఉంటుందని తేల్చి చెప్పింది. ఇందులో ఇప్పటి వరకూ ఇరాన్‌కు బాంబు దాడుల్లో జరిగిన నష్టానికి గ్యారంటీలతో కూడిన పరిహార చెల్లింపులు కూడా ఉన్నాయి. ఈ చర్చలకు మధ్యవర్తిగా పాకిస్థాన్‌ తెరపైకి వచ్చింది. మరోవైపు యుద్ధానికి బాధ్యత తనది కాదనే వాదనను ట్రంప్‌ లేవనెత్తారు. తనపై వస్తున్న విమర్శలను తప్పించుకునే ధోరణిలో ఇటీవల మాట్లాడిన ట్రంప్‌.. అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి పీట్‌ హెగ్సెత్‌ను ఉద్దేశించి.. ఇదంతా నీవల్లే నంటూ నెపం మోపడం విశేషం.

భూతల దాడులు?

తాజా పరిణామాల్లో ఈ యుద్ధం భూతల దాడులకు దారి తీస్తుందా? అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఇరాన్‌ చమురు ఎగుమతుల్లో 90శాతం వరకూ జరిగే ఖార్గ్‌ ఐలాండ్‌పై పట్టు సాధించే క్రమంలో అమెరికా ప్రయత్నాలు చేస్తున్నదనే వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే యుద్ధం కొత్త దశలోకి అడుగుపెట్టినట్టు అవుతుందని అంతర్జాతీయ నిపుణులు అంచనాలు వేస్తున్నారు. ఎతావాతా.. యుద్ధం నెల రోజులు పూర్తి చేసుకున్నా.. అమెరికా ఊహించినట్టు ఇరాన్‌ కూలిపోలేదు.. పైగా రెట్టింపు కసితో వ్యూహాత్మకంగా ప్రతిదాడులు చేస్తున్నది. తద్వారా అంతర్జాతీయంగా అమెరికాపై ఒత్తిడి పెరిగేలా చూస్తున్నది.

ఇప్పుడేంటి?

ఈ పరిణామాలన్నింటినీ గమనంలో ఉంచుకుంటూ.. యుద్దం మూడు మార్గాల్లో ఏదో ఒకటి ఎంచుకోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందులో ఒకటి చర్చల ద్వారా ముగింపు, రెండోది హార్మూజ్‌ జల సంధిపై ఒత్తిడి పెంచడం.. ఇక మూడోది.. భూతల దాడులు. భూతల దాడులు మొదలవడం అంటే.. పెద్ద యుద్ధానికి దారి తీయడమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తుఫానుకు ముందు ప్రశాంతతలా పరిస్థితి నివురుగప్పిన నిప్పును తలపిస్తున్నది. రాబోయే కొద్ది రోజుల్లో చోటు చేసుకునే పరిణామాలు.. ఈ యుద్ధ దిశను నిర్ణయిస్తాయనే అంచనాలు వెలువడుతున్నాయి.