విధాత, హైదరాబాద్ : అమెరికా-ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం తుది దశకు చేరుకుని పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు సద్దుమణిగే పరిస్థితులు కనిపిస్తుండటంతో బంగారం, వెండి మార్కెట్ లు మళ్లీ పుంజుకోనున్నాయని మార్కెట్ వర్గాల విశ్లేషిస్తున్నాయి. అయితే ఆదివారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,49,080వద్ద స్థిరంగా కొనసాగుతుండగా, 22క్యారెట్ల 10గ్రాముల ధర రూ. 1,36,650వద్ద నిలిచింది. కిలో వెండి ధర సైతం రూ. 2,70,000వద్ద స్థిరంగా కొనసాగుతుంది.
భవిష్యత్తులో మళ్లీ పెరుగనున్న బంగారం ధరలు
పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతను మరింత ఆలస్యం చేసే అవకాశాల నేపథ్యంలో స్వల్ప కాలంలో పసిడి ధరలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉన్నప్పటికి దీర్ఘకాలికంగా బంగారం ధరలు మళ్లీ రికార్డు స్థాయిని అందుకుంటాయని జేపీమోర్గాన్ అంచనా వేసింది. ప్రస్తుత ధరల స్థాయిల నుండి చూసుకుంటే, బంగారం భవిష్యత్తులో పెట్టుబడిదారులకు 20 శాతానికి పైగా లాభాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉందని పేర్కొంది. మోర్గాన్ తాజా నివేదిక ప్రకారం.. 2026 చివరి నాటికి బంగారం ధర ఔన్సుకు 6,000 డాలర్లకు , 2027 చివరి నాటికి ఏకంగా 6,300 డాలర్ల రికార్డు స్థాయికి చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఈ ధరల పెరుగుదల అనేది ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు , అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకునే వడ్డీ రేట్ల నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుందని, ప్రస్తుతానికి ఈ విషయాలపై మార్కెట్లో పూర్తి స్పష్టత లేదని జేపీమోర్గాన్ పేర్కొంది.