విధాత, హైదరాబాద్:

వాతావరణం మారుతున్నదంటే ‘కాలం’ మారుతున్నదని అర్థం. నైరుతి రుతుపవనాల రాక అటువంటి సంకేతమే. నైరుతి రుతుపవనాలు మొదట కేరళ తీరాన్ని తాకుతాయి. ఆ తర్వాత కర్ణాటకకు వెళతాయి. అటు నుంచి కొన్ని రోజుల వ్యవధిలో తెలంగాణను తాకుతాయి. ఇది దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆనవాయితీ. అయితే.. ఇప్పుడు కేరళలో నైరుతి రుతు పవనాల రాకకు ముందే రాజకీయ రుతుపవనం మొదలైంది. పారాచూట్‌ నాయకుడు కేసీ వేణుగోపాల్‌ను కాదని.. ప్రజలు కోరుకున్న వీడీ సతీశన్‌కు ముఖ్యమంత్రి పీఠం అప్పగించింది. అటుపిమ్మట ఆ రాజకీయ రుతుపవనం.. కర్ణాటకను తాకింది. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి.. మూడేళ్ల క్రితం ప్రజలు కోరుకున్న డీకే శివకుమార్‌ ముఖ్యమంత్రి కావడానికి మార్గం సుగమం చేసింది. ఇక అటు నుంచి తెలంగాణకు ఇదే రాజకీయ రుతుపవనం వస్తుందా? ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇదొక ఆసక్తికర చర్చగా మారింది.

నిన్నటిదాకా.. అధిష్ఠానం మాటే శాసనం..

ఏ రాష్ట్రంలోనైనా ముఖ్యమంత్రి ఎంపికలో అధిష్ఠానం తన కోటరీ మాటలనే పరిగణనలోకి తీసుకుంటూ ఉంటుంది. ప్రజాభీష్టం అనేది సెకండరీ అవుతూ ఉంటుంది. కానీ.. కేరళ సీఎం ఎంపికలో హైకమాండ్‌ ఈసారి ప్రజాభీష్టాన్ని పరిగణనలోకి తీసుకోవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపర్చింది. కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం ప్రజల మాట కూడా వింటున్నదన్న సంకేతాలు పంపింది. పదేళ్ల విరామం అనంతరం కేరళలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ విజయం సాధించింది. ఆ వెంటనే సీఎం కుర్చీకి రేసు మొదలైంది. ప్రధానంగా కేసీ వేణుగోపాల్‌, వీడీ సతీశన్‌ మధ్య పోటీ నెలకొంది. కేసీ వేణుగోపాల్‌ అధిష్ఠానానికి దగ్గరి మనిషి కావడంతో ఆయననే ఎంపిక చేస్తారనే ఊహాగానాలు మొదట్లో వచ్చాయి. కానీ.. ఎన్నికల ప్రచారంలో అన్నీ తానై.. పార్టీని విజయ తీరాలకు చేర్చింది మాత్రం వీడీ సతీశన్‌. దీంతో ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కుతుందనే చర్చ గట్టిగానే సాగింది. తన అభీష్టాలు ఎలా ఉన్నా.. ప్రజలు, పార్టీ కార్యకర్తలు సతీశన్‌నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్న విషయాన్ని గ్రహించిన అధిష్ఠానం.. ఆయనవైపే మొగ్గు చూపింది.

కర్ణాటకనూ తాకిన రాజకీయ రుతుపవనం..

కర్ణాటకలో మూడేళ్ల క్రితం కాంగ్రెస్‌ విజయం సాధించినప్పుడు పార్టీ కార్యకర్తలు, ముఖ్యనేతలు, అన్నింటికి మించి ప్రజలు డీకే శివకుమార్‌నే ముఖ్యమంత్రిగా కోరుకున్నారు. కానీ.. సిద్ధరామయ్య పక్షాన్నే నిలిచిన అధిష్ఠానం.. డీకే శివకుమార్‌కు ఉప ముఖ్యమంత్రి పదవిని ఆఫర్‌ చేసింది. తనకు ఇస్తే సీఎం సీటు ఇవ్వాలని డీకే పట్టుబట్టడంతో కొద్ది రోజులు ప్రతిష్ఠంభన నెలకొన్నది. మొత్తానికి ఒక రాజీ ఫార్ములాతో సిద్ధరామయ్య సీఎంగా, డీకేశి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణాలు చేశారు. అప్పటి నుంచి మధ్యమధ్యలో ముఖ్యమంత్రి మార్పు అంశం ప్రస్తావనకు వస్తూనే ఉన్నది. కొంతకాలం క్రితం అది మరింత రాజుకున్నది. పార్టీ ఎమ్మెల్యేల్లో కొంతమంది డీకేశికి అనుకూలంగా అధిష్ఠానానికి లేఖ రాయడంతో కుర్చీలాట రచ్చకెక్కింది.

ఢిల్లీలో అధిష్ఠానం చర్చలు.. మరుసటిరోజే సిద్ధరామయ్య రాజీనామా

ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య, డీకేశిలను ఢిల్లీకి పిలిచిన అధిష్ఠానం.. ఇద్దరితో చర్చలు జరిపి.. తుది నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే గురువారం ఉదయం పార్టీ ముఖ్యులతో అల్పాహార సమావేశం ఏర్పాటు చేసిన సిద్ధరామయ్య.. అనంతరం రాజీనామా సమర్పించారు. అయితే.. ఈ సమావేశంలో సిద్ధరామయ్యకు డీకేశి పాదాభివందనం చేయడం వైరల్‌ అయింది. సిద్ధరామయ్య రాజీనామాకు సిద్ధపడ్డారన్న సంకేతాన్ని బలంగా పంపింది. ఆ మేరకు కొద్ది సేపటికే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

తెలంగాణలో పరిస్థితి ఏంటి?

సాధారణంగా నైరుతి రుతుపవనాలు కర్ణాటకను తాకిన తర్వాత తెలంగాణకు వస్తాయి. మరి రాజకీయ రుతుపవనం కూడా అదే దిశగా ప్రయాణిస్తుందా? అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. తెలంగాణలో రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రెండున్నరేళ్లు దాటుతున్నది. వాస్తవానికి రేవంత్‌కు కాంగ్రెస్‌లో స్వల్పకాలంలోనే రెండు కీలక పదవులు అధిష్ఠించారు. పార్టీలో చేరిన కొద్ది నెలలకే పీసీసీ పగ్గాలు అందుకున్నారు. ఆ తరువాత ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడంతో ముఖ్యమంత్రి అయ్యారు. ఎంతో మంది సీనియర్లు ఉన్నా.. అధికారంలోకి తీసుకురావడంలో రేవంత్‌ కష్టపడ్డారనే గట్టి నమ్మకం, కార్యకర్తల అభిప్రాయాన్ని గౌరవించి ముఖ్యమంత్రి పదవిని ఆయనకు అప్పగించారు. అయితే.. కొంత కాలంగా 2034 వరకూ తానే ముఖ్యమంత్రినని రేవంత్‌ రెడ్డి వీలున్న ప్రతి వేదికపైనా ఢంకా బజాయిస్తున్నారు. వాస్తవానికి కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి ఎవరు కావాలన్నది అంతిమంగా అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకుంటుంది. కానీ.. రాబోయే రెండు టర్మ్‌లకు కూడా తానే ముఖ్యమంత్రిగా ఉంటానని రేవంత్‌ ప్రకటించుకోవడం రాజకీయ వర్గాల్లో కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. పార్టీ నేతల్లోనూ కనుబొమలు ఎగురవేయించింది. ఈ వ్యాఖ్యలపై అటు అధిష్ఠానం కానీ.. రేవంత్‌ సహచర మంత్రులుగానీ బహిరంగంగా స్పందించలేదు. పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి.. సీఎం వ్యాఖ్యకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇలా ప్రకటించుకోవడం కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకమని, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుందని చురకలు వేశారు. తెలంగాణ కాంగ్రెస్‌ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మర్చుకొనే ప్రయత్నాలను అసలు సిసలు కాంగ్రెస్ వాదులు సహించబోరని తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపగా, మంత్రులు కానీ, సీనియర్లు కానీ స్పందించలేదు, కనీసం ఖండించనూ లేదు. ఆ తర్వాత కూడా రేవంత్‌ రెడ్డి అదే వ్యాఖ్యలు కొనసాగిస్తున్నారు. 2034లో రాష్ట్ర రాజకీయాలను వదిలి, తరువాతి తరానికి అవకాశం కల్పించి, కేంద్ర రాజకీయాలకు వెళ్తానని తాజాగా కూడా ప్రకటించారు. గతంలో ఏ కాంగ్రెస్ నాయకుడూ వ్యాఖ్యానించని విధంగా రేవంత్ మాట్లాడటంతో పార్టీలో సీనియర్‌ నాయకులు సైతం ఆశ్చర్యపోయారు. జాతీయ పార్టీలలో ఇలాంటి సంప్రదాయం, కట్టుబాట్లు దాటి మాట్లాడే సాహసం చేయరని అంటున్నారు. కాంగ్రెస్‌లో కొమ్ములు తిరిగిన నాయకులు చాలా మంది ఉన్నప్పటికీ.. ఏ నాయకుడూ ఏ సమయంలోనూ ఇంత బహిరంగంగా, ధైర్యంగా తానే ముఖ్యమంత్రినని ప్రకటించుకోలేదని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.

ఆనాడు.. సీఎల్పీలోనే నిర్ణయమన్న వైఎస్‌

చంద్రబాబు తొమ్మిదిన్నరేళ్ల పాలన అనంతరం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు. అంతకు ముందు ఆయన రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేశారు. ప్రజలను నేరుగా కలుసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో అన్నీ తానై ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. ఆ సమయంలో వైఎస్‌నే సీఎం చేస్తారని అంతా భావించారు. అదే ప్రశ్నను మీడియా అడిగితే.. పార్టీ అధిష్ఠానం తీసుకోబోయే నిర్ణయమే ఫైనల్‌ అని, సీఎల్పీలోనే సీఎం ఎన్నిక ఉంటుందని వైఎస్‌ చాలా క్లియర్‌గా చెప్పారు. అంతేకానీ.. నేనే గెలిపించా.. నన్నే సీఎం చేస్తారు.. అని చెప్పుకోలేదు.

అధిష్ఠానం రూటే సపరేటు..

కాంగ్రెస్‌ అధిష్ఠానం తన పార్టీ ముఖ్యమంత్రులు తమకు తలొగ్గి ఉండాలనే భావనతో ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. పార్టీని ధిక్కరించే తరహాలో మాట్లాడేవారికి ముకుతాడు వేసేందుకు పార్టీలోనే ఒకరిద్దరు సీనియర్లను ప్రోత్సహించి.. అంతర్గతంగా మంట రాజేస్తుంటుందని అంటుంటారు. కానీ.. ప్రస్తుతం రేవంత్‌ వ్యాఖ్యలపై ఎలాంటి స్పందనలు లేదా సంకేతాలను కాంగ్రెస్‌ అధిష్ఠానం ఇవ్వడం లేదు. పార్టీలో సీనియర్లను ఎగదోస్తున్న పరిస్థితి కూడా కనిపించడం లేదు. వాస్తవానికి రేవంత్‌ రెడ్డి సీఎం అయిన ఏడాది వరకూ ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలే ఉండేవి. ఆ తర్వాత ఫిర్యాదులు పెరగడంతో సోనియా, రాహుల్‌, ప్రియాంక అప్పాయింట్‌మెంట్లు లభించలేదనే ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది. తదుపరి వరుస ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయాల నేపథ్యంలో మళ్లీ సంబంధాలు మెరుగుపడ్డాయనే చర్చలు ఉన్నాయి. ఈ సమయంలోనే రాజకీయ రుతుపవనాలు చురుకుగా మారుతున్నాయి. ఈ రుతుపవనాలు తెలంగాణను సైతం తాకుతాయా? అనే అంశంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి.

ఢిల్లీకి పెద్ద ఎత్తునే ఫిర్యాదులు

పరిపాలన వైఫల్యాలు, కుంభకోణాలు, రేవంత్‌ సోదరుల అక్రమాలు, హామీలు అమలు చేయకపోవడం వంటి అంశాలపై కొందరు సీనియర్లు ఢిల్లీ పెద్దలకు ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని గాంధీ భవన్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండోసారి మాత్రమే కాదు.. మూడోసారి కూడా తానే ముఖ్యమంత్రి అవుతానని ఏ ధీమాతో రేవంత్‌ ప్రకటిస్తున్నారో అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. రేవంత్‌ రెడ్డి వద్ద ప్లాన్‌ బీ ఏమైనా ఉన్నదా? అనే సందేహాలను లేవనెత్తుతున్నారు.

చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు..

వీలున్న ప్రతి సందర్భంలోనూ హైదరాబాద్‌ ఐటీ అభివృద్ధిలో చంద్రబాబు పాత్రను రేవంత్‌ రెడ్డి ప్రశంసిస్తూనే ఉంటారు. అదే సమయంలో బీజేపీ పెద్దలకు వ్యతిరేకంగా వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ విషయంలో అధిష్ఠానానికి పలువురు సీనియర్లు ఫిర్యాదు చేశారనే వాదనలు ఉన్నాయి. కానీ.. ఏ ఒక్క సీనియర్‌ కూడా ఆ విషయంలో బయటపడటం లేదు. మరోవైపు రేవంత్‌ రెడ్డి ఆరెస్సెస్‌ సంబంధాలు కూడా చాలా కాలంగా చర్చల్లో ఉన్నవే. బీజేపీతో తన ప్రారంభ రాజకీయాలను రేవంత్‌ కూడా అంగీకరించారు కూడా. ఈ నేపథ్యంలో 2034 టార్గెట్‌ వెనుక ప్లాన్‌ బీ ఏమైనా ఉందా? అనే సందేహాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు.

సీఎంల మార్పిడికి సోనియా చెక్‌

సోనియా గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాత చీటికిమాటికి ముఖ్యమంత్రులను మార్చే సంప్రదాయానికి చెక్‌ పెట్టారు. మంచో చెడో ఐదేళ్ళ పాటు పదవిలోనే కొనసాగిస్తున్నారు. రాజస్థాన్‌లో అశోక్ గెహ్లోత్‌ను తప్పించాలని సచిన్‌ పైలట్‌ వర్గం పట్టుబట్టినా ఆమె తలొగ్గలేదు. ఇటువంటి సమయంలో తెలంగాణలో మార్పులు ఉంటాయా? అనేది సందేహంగానే ఉన్నది. కానీ.. అధిష్ఠానం పూనుకొంటే తెలంగాణలో సైతం మార్పులు తప్పకపోవచ్చని సీనియర్‌ నేతలు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. దీనిపై కొద్ది రోజుల్లోనే స్పష్టత రావచ్చని అంటున్నారు.

Read Also |

సీఎం రేవంత్ ప్రభుత్వ పాలసీలు తుగ్లక్ పాలసీలు : ఎంపీ ఈటల ఫైర్
సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా
11 ఏళ్లలో 9.75 లక్షల కోట్ల కార్పొరేట్‌ రుణాలు రైటాఫ్.. బడాబాబుల పట్ల కేంద్రం ఉదాశీనత