సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా

కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాల మేరకే నిర్ణయం తీసుకున్నట్లు మీడియాకు తెలిపారు.

Reported by: Tejaswini Nanna | జాతీయం | May 28, 2026, 3:51 pm IST
Read Time: 3 mins
సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా

కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. గురువారం మధ్యాహ్నం డీకే శివకుమార్‌తో కలిసి ఆయన లోక్‌భవన్‌కు వెళ్లారు. గవర్నర్‌ థావర్‌ చంద్‌ గెహ్లాట్ లోక్ భవన్ లో అందుబాటులో లేకపోవడంతో ఆయన కార్యదర్శికి సిద్ధరామయ్య తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఈ విషయాన్ని గవర్నర్‌ ప్రత్యేక కార్యదర్శి ధ్రువీకరించారు. సీఎం రాజీనామా లేఖను తీసుకున్నామని, గవర్నర్‌ తిరిగొచ్చాక దీనిపై నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. గవర్నర్ గెహ్లఆాట్ ఈ సాయంత్రం బెంగళూరు చేరుకోనున్నారు.

అధిష్ఠానం ఆదేశాల మేరకే రాజీనామా: సిద్ధరామయ్య

లోక్ భవన్ లో రాజీనామా లేఖ సమర్పించిన అనంతరం సీఎం సిద్దరామయ్య సహచర మంత్రులు డీకే, పరమేశ్వర్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధిష్ఠానం సూచనలతో సీఎం పదవికి రాజీనామా చేశానని వెల్లడించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే వైదొలిగానని, బంధనల ప్రకారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశానని, నా రాజీనామాను గవర్నర్‌ ఆమోదిస్తారనే విశ్వాసం ఉందని తెలిపారు. అసెంబ్లీలో కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజార్టీ ఉంది. రాజ్యాంగబద్ధంగా కొత్త ప్రభుత్వం ఏర్పడుతోంది. ఇప్పటివరకు ప్రభుత్వ నిర్వహణలో నాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు. సీఎంగా నాకు అవకాశమిచ్చిన సోనియా, రాహుల్‌, ఖర్గేకు ధన్యవాదాలు అని తెలిపారు. ఏడు కోట్ల మంది కర్ణాటక ప్రజలకు సీఎంగా ఇంతకాలం సేవ చేసే అవకాశం లభించిందన్నారు.
రాజ్యాంగమే మా ధర్మం. ప్రజలే మాకు దేవుళ్లు. హైకమాండ్‌ ఆదేశాలకు అందరం కట్టుబడి ఉంటాం. అధిష్ఠానం ఏ బాధ్యతలు అప్పగించినా స్వీకరిస్తా అని సిద్ధరామయ్య వెల్లడించారు.