హైలైట్స్:
- నాణ్యత, పారదర్శకత, సాంకేతికతకు ప్రాధాన్యం
- రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
విధాత, ప్రత్యేక ప్రతినిధి:
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేసి వాటి ప్రయోజనాలు చివరి లబ్ధిదారుని వరకు చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. గురువారం హనుమకొండలో హనుమకొండ, వరంగల్ జిల్లాల అధికారులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై రాష్ట్ర గవర్నర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల చారిత్రక నేపథ్యం, అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, వైద్య–ఆరోగ్య సేవలు, వ్యవసాయం, మౌలిక వసతులు, ఇతర కీలక అంశాలపై జిల్లా కలెక్టర్లు చాహత్ బాజ్ పాయి, డాక్టర్ సత్య శారద పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గవర్నర్‌కు వివరించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చేపడుతున్న భద్రత తదితర చర్యలను పోలీస్ కమిషనర్ శ్వేత వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ మాట్లాడుతూ టీబీ నిర్మూలనకు మరింత పటిష్ట చర్యలు చేపట్టాలని, విస్తృత స్థాయిలో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి వ్యాధి నియంత్రణకు కృషి చేయాలని సూచించారు. పల్స్ పోలియో కార్యక్రమం వంద శాతం లక్ష్యంతో అమలయ్యేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రతి రంగంలో మరింత నాణ్యత, సామర్థ్యం పెంచుకునే అవకాశం ఉందని, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల ప్రయోజనాలు నిజమైన లబ్ధిదారునికి చేరేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్న గవర్నర్, ఈ ప్రాంతం పత్తి సాగుకు ప్రసిద్ధి చెందినందున రైతులను అధిక ఆదాయం వచ్చే పంటల సాగు, విలువ ఆధారిత వ్యవసాయం వైపు ప్రోత్సహించాలని సూచించారు. పాలనలో పారదర్శకత అత్యంత కీలకమని, పారదర్శక వ్యవస్థ వల్ల ప్రజలకు, రైతులకు, ప్రభుత్వానికి సమానంగా ప్రయోజనం కలుగుతుందని అన్నారు. ప్రస్తుతం ప్రపంచం కృత్రిమ మేధస్సు (Artificial Intelligence – AI) యుగంలోకి అడుగుపెట్టిందని పేర్కొంటూ, ఏఐ అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దారి తీస్తోందన్నారు. భవిష్యత్తులో కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, దానిని భయపడాల్సిన అవసరం లేదని, ఏఐని మనిషి సృష్టించాడనే విషయాన్ని గుర్తుంచుకొని, దానిని సమర్థవంతమైన సాధనంగా ఉపయోగించుకుని పరిపాలన, సేవల నాణ్యతను మరింత మెరుగుపరచుకోవాలని సూచించారు.
ప్రతి శాఖ సమన్వయంతో, ప్రతి రంగానికి సమాన ప్రాధాన్యం ఇస్తూ పనిచేస్తే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని గవర్నర్ పేర్కొన్నారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా అమలు చేస్తున్న తీరును ఆయన అభినందించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కె.ఆర్. నాగరాజు, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.