• Telugu News
  • /Latest news

వెలుగుమట్ల తరహాలో హనుమకొండ గుండ్ల సింగారంలో పేదల గుడిసెలు కూల్చివేత

హనుమకొండలో మరో వెలుగుమట్ల తరహా ఘటన చోటు చేసుకున్నది. పథకం ప్రకారం విరుచుకుపడిన పోలీసులు.. అక్కడి ప్రజల గుడిసెలు, షెడ్లను కూల్చిపారేశారు.

Reported by: Warangal correspondent | Latest News | Edited by: విధాత తెలంగాణ డెస్క్ | Jun 20, 2026, 10:26 pm IST
Read Time: 12 mins
వెలుగుమట్ల తరహాలో హనుమకొండ గుండ్ల సింగారంలో పేదల గుడిసెలు కూల్చివేత

హైలైట్స్:

  • భారీ పోలీసు బందోబస్తు మధ్య పథకం ప్రకారం మూకుమ్మడి దాడి
  • గుడిసెలు, షెడ్లు, గుడారాలు నేలమట్టం
  • రోడ్డున పడ్డ… ఐదేళ్ళుగా నివాసం ఉంటున్న 350 కుటుంబాలు
  • అడ్డుకోబోయిన సీపీఐ నాయకులు, గుడిసెవాసుల అరెస్టు
  • బాధితులను పరామర్శించిన సీపీఐ రాష్ట కార్యదర్శి కూనంనేని
  • అఖిలపక్షాలతో సమావేశమై ఈ సమస్యపై పోరాటం తీవ్రంచేస్తామని వెల్లడి

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

హనుమకొండ నగరంలోని గుండ్ల సింగారంలో శనివారం పొద్దుపొద్దున్నే వందలాది మంది పోలీసులు, అధికారులు మూకుమ్మడిగా దాడి చేసి ఇక్కడ గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పేదల షెడ్లను కూల్చి వేశారు. తాత్కాలికంగా నిర్మాణం చేసుకుని నివిసిస్తున్న రేకుల షెడ్లు, గుడారాలను కూల్చివేయడంతో పేదలంతా రోడ్డునపడ్డారు. నిర్మాణ సామాగ్రి, ఇంటిలోని సామాన్లు, ఇతర వస్తువులు, బియ్యం, తినుబండారాలు ఈ కూల్చివేతలో నేలపాలయ్యాయి. పోలీసులు, రెవిన్యూ అధికారులు ముందస్తు పథకం ప్రకారం చేపట్టిన ఈ కూల్చివేతతో పేదలు భయకంపితులయ్యారు. ఐదేండ్లుగా నివిసిస్తున్న పేదల గుడారాలు నేలమట్టడం కావడంతో నీడగా నిలుస్తుందని భావించిన గూడు కళ్ళెదుటే చెల్లాచెదురుకావడంతో మహిళలు గోల్లుమన్నారు. ఈ కూల్చివేతను అడ్డుకునేందుకు యత్నించిన సీపీఐ నాయకులను, గుడిసెవానులను పోలీసులు అరెస్టు చేశారు. కేసులు పెడుతామని బెదిరించారు. అడ్డుకునేందుకు యత్నించిన వారిని అరెస్టు చేశారు. దీంతో గుండ్ల సింగారంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పెద్దలు ఆక్రమించుకున్న వందలాది ఎకరాల భూముల జోలికివెళ్ళకుండా పేదలు నివాసం కోసం వేసుకున్న గుడిసెలనూ, గుడారాలను కూల్చివేయడంతో ప్రభుత్వం పై వీరంతా భగ్గుమంటున్నారు. ఈ మధ్య ఖమ్మం శివారులోని వెలుగుమట్ల సంఘటన మరిచిపోకముందే గుండ్ల సింగారంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డారని వారంతా మండిపడుతున్నారు.

దాదాపు ఐదేళ్ళ క్రితం సీపీఐ ఆధ్వర్యంలో గుండ్ల సింగారంలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించి గుడిసెలు నిర్మాణం చేపట్టారు. మొన్ననే ఈ కాలనీకి సురవరం సుధాకర్ రెడ్డి నగర్ గా నామకరణం చేసి, పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు. ఈ లోపే ఈ గుడిసెవాసుల కాలనీని ప్రభుత్వం నేలమట్టం చేయడంతో గూడు దక్కిందనే నమ్మకంతో ఉన్న పేదల ఆశలు ఒక్కసారిగా ఆవిరయ్యాయి.

"భూకబ్జాదారులు ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నా స్పందించని అధికారిక యంత్రాంగం నిలువ నీడ లేని పేదలు 50 గజాల స్థలంలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న వారిపై అర్ధరాత్రివేళ దొంగల మాదిరిగా దాడి చేయడం దుర్మార్గమైన చర్య. వరంగల్ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గుడిసెలు వేసుకున్న పేదల పై ప్రతాపం చూపుతున్నారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందించి ఇలాంటి దుశ్చర్యలను నిలుపుదల చేయాలి.."

- కూనంనేని సాంబశివరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

ఐదేళ్ళుగా అవస్థల మధ్య జీవనం

అనేక అవస్థలు, కనీస సదుపాయాలు కూడా లేనప్పటికీ ‘గూడు’ గా మారుతోందని గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొని ఆధార్ కార్డు, రేషన్ కార్డు కలిగి జీవిస్తున్నామని తమను ఇప్పటికిప్పుడు బయటికి పొమ్మంటే ఎక్కడికి పోవాలని గుడిసె వాసులు కన్నీటి పర్యంతమయ్యారు. అరెస్ట్ అయినవారిలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట బిక్షపతి, హనుమకొండ మండల కార్యదర్శి ఎన్ ఎ స్టాలిన్, నాయకులు పూజారి అమృతయ్య, కట్కూరి కృష్ణ, మాలోత్ మంగ, బాలాజీ రంజిత్ లతో పాటు 40 మంది ఉన్నారు. ఇదిలా ఉండగా, మమ్మల్ని చంపినా ఇక్కడి నుంచి కదిలేదు లేదంటూ, ఐదేళ్లుగా గుడిసెలు వేసుకొని ఉంటున్నాం. పిల్లలు ఇక్కడి నుంచే బడికి వెళ్తున్నారు. నిన్న అధికారులు ఇక్కడికి వచ్చినప్పటికీ.. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. పొద్దున 4 గం.కే ఇక్కడికి వచ్చారు. పిల్లలు ఉన్నారని చెప్పినా వినిపించుకోలేదు. మహిళలం అని చూడకుండా నెట్టేశారు. ఇంట్లో ఉండగానే రేకులు కూలగొట్టారు. మమ్మల్ని ఇక్కడే చంపండి.. కదిలేదు లేదు’ అని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. గుడిసెలు తొలగించిన ప్రాంతంలో పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. నివాసాలు కోల్పోయిన కుటుంబాలు ఎండలోనే తాత్కాలికంగా ఉంటూ అక్కడే వంటలు చేసుకుంటున్నాయి. చిన్నారులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమకు ప్రత్యామ్నాయ నివాసం కల్పించాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.తమ గుడిసెలను కూల్చి వేసినా తాము ఆ భూమి వదలబోమని స్పష్టం చేశారు.

ఇళ్ళు కూల్చివేత దుర్మార్గం, న్యాయం జరిగే వరకు పోరాడుతాం:కూనంనేని సాంబశివరావు

హనుమకొండ గుండ్ల సింగారంలో శనివారం పేదల ఇళ్ళు కూల్చి వేయడం దుర్మార్గమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. పేదల ఇళ్ళు కూల్చివేత విషయం తెలుసుకున్న కూనంనేని హుటా హుటిన హైదరాబాద్ నుండి వచ్చి ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పేదలు తమ గోడు వెళ్లబోసుకుని, చిన్న పిల్లలు, మహిళలు అని చూడకుండా తమను తమ ఇండ్ల నుండి ఈడ్చి పడేశారని తెలిపారు. అలాగే బియ్యం, ఇతర నిత్యావసరాలను రోడ్డు పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.కాగా విద్యార్థుల సర్టిఫికేట్ లను సైతం తీసుకోనివ్వకుండా పోలీసులు ఈడ్చుకొని వెళ్లారని విద్యార్థులు తెలిపారు. అనంతరం కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ గుండ్ల సింగారంలో ఇండ్లు కోల్పోయిన పేదలకు న్యాయం జరిగే వరకూ తాము అండగా ఉంటామని అన్నారు. భూకబ్జాదారులు ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నా స్పందించని అధికారిక యంత్రాంగం నిలువ నీడ లేని పేదలు 50 గజాల స్థలంలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న వారిపై అర్ధరాత్రివేళ దొంగల మాదిరిగా దాడి చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు.వరంగల్ జిల్లాలలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గుడిసెలు వేసుకున్న పేదల పై ప్రతాపం చూపుతున్నారని, దీనిపై ముఖ్యమంత్రి స్పందించి ఇలాంటి దుశ్చర్యలను నిలుపుదల చేయాలన్నారు. కూల్చివేతలు ఆపకుంటే వరంగల్ జిల్లా నుండే రాష్ట్ర వ్యాప్తంగా పేదల ఇళ్ళ స్థలాల పోరాటం ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పేదల ఇళ్ళు, ఇండ్ల స్థలాలు, భూ సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఐక్య పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. దీనిపై ఆదివారం హైదరాబాద్ లో అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యలపై ఒక భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుని ముందుకు సాగుతామని చెప్పారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ జైలుకు అయినా వెళతాము కాని భూమిని వదిలేది లేదన్నారు.భూమి సాధించుకునే వరకు సిపిఐ మీ వెంట ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, సిపిఎం జిల్లా కార్యదర్శి గాదె ప్రభాకర్ రెడ్డి, సిపిఐ వరంగల్ జిల్లా కార్యదర్శి షేక్ బాషుమియా, నాయకులు తోట బిక్షపతి, అదరి శ్రీనివాస్, మేకల రవి, మండ సదాలక్ష్మి, వలీ ఉల్లాఖాద్రి, ఎన్ ఎ స్టాలిన్, సిపిఎం జిల్లా నాయకులు ఎం. చుక్కయ్య, బొట్ల చక్రపాణి, సిపిఐ జిల్లా నాయకులు కర్రె లక్ష్మణ్, బాషబోయిన సంతోష్, జక్కు రాజు గౌడ్, ఏషబోయిన శ్రీనివాస్, కొట్టేపాక రవి, రాజు కుమార్, అలువాల రాజు తదితరులు పాల్గొన్నారు.