• Telugu News
  • /Telangana

పోక్సో కేసులో బండి సంజయ్‌ కొడుకుకు బెయిల్‌

పోక్సో కేసులో చర్లపల్లి జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న బండి సాయి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు సాధారణ బెయిల్‌ మంజూరు చేసింది. భగీరథ్‌ తండ్రి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌.

Reported by: Jagan Mohan Talluri | తెలంగాణ‌ | Edited by: విధాత తెలంగాణ డెస్క్ | Jul 09, 2026, 8:33 pm IST
Read Time: 4 mins
పోక్సో కేసులో బండి సంజయ్‌ కొడుకుకు బెయిల్‌

విధాత, హైదరాబాద్:

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన సాధారణ బెయిల్ గురువారం మంజూరు చేసింది. భగీరథ్‌ను పోక్సో కేసులో మే నెల 16వ తేదీన పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్టు చేసి, చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉంచారు. బీబీఏ సప్లమెంటరీ పరీక్షలకు హాజరయ్యేందుకు పోక్సో ప్రత్యేక కోర్టు మే నెల 20వ తేదీన మధ్యంతర బెయిల్ ఇచ్చింది. పరీక్షలు పూర్తయిన తరువాత తిరగి 25న చర్లపల్లి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. 45 రోజులుగా జైలు జీవితం గడుపుతున్నానంటూ సాధారణ బెయిల్ కోసం గత నెలలో కోర్టును భగీరథ్‌ అభ్యర్థించారు. విచారణ తరువాత గురువారం హైకోర్టు సాయి భగీరథ్ కు సాధారణ బెయిల్ మంజూరు చేసింది. సాక్షులను ప్రభావితం చేయకూడదని, రూ.1 లక్ష పూచీకత్తు ఇవ్వాలని తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. పోలీసులు పిలిచినప్పుడు విచారణకు హాజరు కావాలని, కోర్టు ముందస్తు అనుమతి లేకుండా విదేశీ ప్రయాణాలు చేయవద్దని గట్టిగా ఆదేశించింది.

ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్ రావు, పిటిషనర్ తరఫు న్యాయవాది టీ నిరంజన్ రెడ్డి తమ వాదనలు విన్పించారు. సాయి భగీరథ్ పై మే మే నెల 8వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే వాంగ్మూలాల సేకరణ పోలీసులు ప్రారంభించారని నాగేశ్వర్ రావు అన్నారు. దర్యాప్తు ముగింపు దశకు చేరుకుందని, గడువులోగా అభియోగపత్రాన్ని దాఖలు చేస్తామని కోర్టుకు విన్నవించారు. ఈ కీలక సమయంలో నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. సాయి భగీరథ్ 45 రోజులకు పైగా జైలులో ఉండటంతో జీవితంలో చాలా కోల్పోయాడని, పరస్పర అంగీకారంతో జరిగిన ఘటనపై కేసులు నమోదు చేయడం చట్టపరంగా చెల్లదని నిరంజన్ రెడ్డి వాదించారు. బెయిల్ మంజూరు చేస్తే కోర్టు షరతులకు కట్టుబడి ఉంటామని తెలిపారు. ఇరు వర్గాల వాదనల తరువాత గురువారం నాడు హైకోర్టు సాధారణ బెయిల్ మంజూరు చేయడంతో బండి సంజయ్ కు పెద్ద రిలీఫ్ లభించింది.