హైలైట్స్:
- 2020లోనే రూ.1.59 లక్షల కోట్లు..
- డర్టీ డజన్ దొంగలకు 11 బ్యాంకుల వరాలు
- రూ.5 లక్షల కోట్ల జగమొండి బాకీలు మాఫీ
- గ్రేట్ ఇండియన్ బ్యాంక్ రాబరీ – పార్ట్ 1
వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలంటే ఆర్థిక వ్యవస్థకు ఎదురయ్యే ప్రమాదాల గురించి ఏకరువు పెట్టే బ్యాంకులు.. బడా కార్పొరేట్ శక్తులు ఎగవేసిన రుణాల విషయంలో మాత్రం ఉదాశీనంగా వ్యవహరిస్తున్నాయి. సాధారణ మధ్యతరగతి ప్రజలు ఇంటి రుణం కోసం దరఖాస్తు చేస్తే.. సవాలక్ష నిబంధనలు పెట్టే బ్యాంకులు.. కార్పొరేట్ బడా బాబులకు మాత్రం అడిగిందే తడవుగా వేల కోట్లు రుణాలు మంజూరు చేస్తున్నాయి. బకాయిల చెల్లింపు విషయంలో సాధారణ ప్రజల విషయంలో ఆస్తులు వేలం వేయడం, బలవంతపు వసూళ్లకు పాల్పడటం వంటివి చేస్తున్న బ్యాంకులు.. కార్పొరేట్ బాకీల విషయంలో ఉదాశీనంగా వ్యవహరించడమే కాకుండా.. అవి చెల్లించకపోతే.. వాటిని నిరర్థక ఆస్తుల జాబితా(NPA)లోకి పంపి.. చేతులు దులిపేసుకుంటున్నాయని అనేక ఉదాహరణలు ఘోషిస్తున్నాయి. సహకార బ్యాంకుల తరహాలో పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు కఠిన చట్టాలు లేకపోవడం బడా రుణ ఎగవేతదారులకు వరంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
డజన్ కంపెనీలకు 5 లక్షల కోట్ల బకాయిలు మాఫీ
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత 11 బ్యాంకులు… ఓ డజన్ కార్పొరేట్ కంపెనీలకు మొత్తంగా రూ.5 లక్షల కోట్ల బాకీలను రైటాఫ్ చేశాయి. ఇక ఇతర కార్పొరేట్ కంపెనీలను కూడా కలుపుకొంటే.. మొత్తంగా 11 ఏళ్లలో రూ.9.75 లక్షల కోట్లు రైటాఫ్ చేశారు. ఒక్క 2020లోనే రూ.1.59 లక్షల కోట్లు రైటాఫ్ చేశారంటే కార్పొరేట్ ఎగవేతదారుల పట్ల ఎంత దయ, కరుణతో ఉన్నారో ఊహించుకోవచ్చు. పైగా.. ఇలాంటి వారికి రుణాలు ఇవ్వడం తమ గొప్పగా బ్యాంకులు చెప్పుకుంటున్నాయి. ఏళ్లు గడిచినా తిరిగి చెల్లించకపోయినా.. బ్యాంకులు కఠిన చర్యలకు దిగడం లేదు. సీబీఐ, ఈడీ రంగప్రవేశం చేసేదాకా చేతులు ముడుచుకుని కూర్చుంటున్నాయి. బ్యాంకు యాజమాన్యాలు, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్బీఐ నిర్వాకం మూలంగా లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం హారతి కర్పూరం మాదిరి కరిగిపోతున్నాయని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సహకార బ్యాంకుల మాదిరి రుణాల రికవరీకి కఠిన చట్టాలను రూపొందించేందుకు కూడా సాహసం చేయడం లేదని విమర్శిస్తున్నారు. దేశంలో వేలాది కోట్లు రుణాలు తీసుకోవడం, ఒకటి రెండు సంవత్సరాలు వాయిదాలు చెల్లించి, ఆ తరువాత నష్టాల పేరుతో మొహం చాటేయడం కార్పొరేట్ కంపెనీలు ఆనవాయితీగా మార్చుకున్నాయి. దేశంలో ఏ సంస్థ ఎంత మొత్తంలో బాకీలు పడిందో వరుస కథనాల్లో ఒకసారి పరిశీలిద్దాం…
పెప్పర్ స్ప్రే రాజగోపాల్ అప్పులు రూ.1,27,897 కోట్లు…
మాజీ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలంగాణకు వ్యతిరేకంగా పార్లమెంటు భవనంలోకి పెప్పర్ స్ప్రే తో వెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటన 2014లో దేశంలో సంచలనం కలిగించింది. ల్యాంకో గ్రూపు యజమానిగా ఉన్న లగడపాటి కంపెనీ విద్యుత్, స్టీల్, మైనింగ్ రంగాలకు విస్తరించింది. పది బ్యాంకులకు సుమారు రూ.1.27,897 కోట్లు బకాయి పడింది. దాదాపు అన్ని కంపెనీలు బకాయి పడి 2017లో దివాలా ప్రక్రియలోకి వెళ్లాయి. ల్యాంకో గ్రూపునకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంకు, బ్యాంక్ ఆప్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకులు పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చాయి. రుణ వాయిదాల చెల్లించకుండా దాటవేస్తున్నా ఒక్క బ్యాంకు యాజమాన్యం కూడా కఠిన చర్యలు తీసుకునే సాహసం చేయలేదు సరి కదా కేసులు కూడా నమోదు చేయకుండా చేష్టలుడిగి చూస్తుండిపోయాయి.
దేశంలో పెద్ద పెద్ద బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టిన లగడపాటి రాజగోపాల్ ఆస్ట్రేలియా, అమెరికా దేశాలలో మైనింగ్ వ్యాపారం చక్కగా చేసుకుంటున్నారు. 2014 సంవత్సరం వరకు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఆయనకు పలు జాతీయ బ్యాంకులు అడిగిందే మహాభాగ్యంగా భావించి… మౌలిక సదుపాయాలు, మైనింగ్ రంగాలకు మంజూరు చేశాయి. అది కూడా ఎలాంటి పూచికత్తు లేకుండా రుణాలు మంజూరు చేశాయంటే బ్యాంకు యాజమాన్యాలు ఎంతటి దయతో వ్యవహరించాయో ఊహించుకోవచ్చు. తీసుకున్న రుణాలను సక్రమంగా వాడుకోకుండా ఇతర రంగాలకు, విదేశాలకు మళ్లించినట్లు ఆరోపణలు రావడంతో తప్పని పరిస్థితుల్లో కేసులు నమోదు చేశారు. జార్ఖండ్ లోని బొగ్గు బ్లాకుల కేటాయింపుల్లో అసంపూర్తి దరఖాస్తులు స్వీకరించిన అధికారుల పాత్రపై సీబీఐ దర్యాప్తునకు ప్రత్యేక కోర్టు ఆదేశించింది. టెక్నికల్ ఎవాల్యుయేషన్ కమిటీ పత్రాలు సరిగా లేకపోయినా అనుమతులు ఎలా పొందారనే దానిపై సీబీఐ విచారించింది. ల్యాంకో ఇన్ ఫ్రా టెక్ ఖాతాను పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ మోసపూరితమైనదిగా ప్రకటించింది. ల్యాంకో గ్రూపు కేసులపై మరింత లోతుగా, ప్రస్తుత పరిస్థితి తెలుసుకోవాలని అనుకునేవారు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ వెబ్ పోర్టల్‌లోకి వెళ్లి చూడవచ్చు.