రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం, పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోనే తొలిసారి ఇటువంటి శాఖను ఏర్పాటు చేస్తుండటం విశేషం. ప్రభుత్వ సేవలు ప్రతి ఒక్కరికి అందచేయాలనే లక్ష్యంతో ఫిర్యాదుల పరిష్కార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నిర్ణయం తీసుకున్నారు. గతవారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో నూతన మంత్రిత్వ శాఖకు ఆమోదముద్ర పడింది. ప్రజల నుంచి ప్రభుత్వానికి అందుతున్న వినతులు, ఫిర్యాదులను పర్యవేక్షించడంతో పాటు పరిష్కారం అయ్యేలా ఈ శాఖ చూడనున్నది.
ఆన్‌లైన్ వెబ్ పోర్టల్‌లో ట్రాకింగ్
తమ దరఖాస్తు ఏ దశలో ఉన్నదో తెలుసుకునేందుకు ప్రత్యేకంగా వెబ్‌పోర్టల్‌ను అందుబాటులోకి తేనున్నారు. ప్రస్తుతం శాఖల వారీగా అందుతున్న వినతులు, ఫిర్యాదులు, దరఖాస్తులను అదే విభాగానికి చెందిన అధికారులు పర్యవేక్షించి పరిష్కరిస్తున్నారు. దీని వల్ల పెద్దగా ప్రయోజనం లేకపోగా ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. తమ సమస్యలను సరిగా పట్టించుకోవడం లేదని, పరిష్కరించడం లేదనే భావన ప్రజల్లో రోజు రోజుకు పెరుగుతోంది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వ పాలనపై మరింత నమ్మకం పెంపొందించేందుకు ఫిర్యాదుల పరిష్కార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి శివ కుమార్ వచ్చారు.
కర్ణాటక ప్రభుత్వ వివిధ శాఖలు, విభాగాలు, కార్పొరేషన్ల ద్వారా ప్రజలకు నిత్యం సేవలు, సమాచారం అందిస్తున్నది. అయితే ప్రతి వినతి లేదా దరఖాస్తు పరిష్కారానికి ముగింపు లభించడం లేదు. దీని మూలంగా ప్రభుత్వంపై అపనమ్మకంతో పాటు తమను పట్టించుకోవడం లేదనే బాధ ప్రజల్లో గూడుకట్టుకుంటున్నది. అన్ని మంత్రిత్వ శాఖల మాదిరి ఫిర్యాదుల పరిష్కారం కోసం మంత్రిత్వ శాఖ వస్తే భరోసా పెరుగుతోందనేది ముఖ్యమంత్రి అభిలాషిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ అధికారుల్లో బాధ్యత పెరుగుతోంది. ప్రభుత్వానికి అందుతున్న దరఖాస్తులు, ఫిర్యాదులు, వినతులు మంత్రి ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించే అవకాశం లభిస్తుంది. నిర్ణీత సమయంలో సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయి. ఎప్పటికప్పుడు సమీక్షించడం మూలంగా ప్రజలకు వేగంగా సేవలు అందుతాయి. ప్రతి సమస్యకు ఒక ముగింపు ఉంటుందనేది ముఖ్యమంత్రి శివ కుమార్ ఆలోచనగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పలు శాఖలు, విభాగాలు తమతమ పరిధిలోనే సేవలు అందిస్తుండగా, కొత్తగా ఏర్పాటు చేసే మంత్రిత్వ శాఖ అన్ని శాఖలకు చెందిన వినతులు, దరఖాస్తులను నిరంతరాయంగా పర్యవేక్షిస్తుంది. దీనివల్ల ప్రభుత్వ సేవల్లో ఆలస్యం తగ్గి వేగం పెరుగుతుంది. అన్ని మంత్రిత్వ శాఖల మాదిరే ఫిర్యాదుల పరిష్కార మంత్రిత్వ శాఖలో ముఖ్య కార్యదర్శి, కార్యదర్శి, ఇతర అధికారులు ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ మంత్రిత్వ శాఖ ప్రభుత్వంలో ఇంటర్నల్ వాచ్ డాగ్ మాదిరి పనిచేస్తుంది. ఇది మొత్తం ప్రభుత్వానికి అంతరాత్మ రక్షకుడిగా మారుతుందని ఒక ఉన్నతాధికారి తెలిపారు.
కార్పొరేట్ సంస్థల బాటలో…
దేశంలో పేరొందిన ప్రైవేటు సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం కస్టమర్ సపోర్టు కోసం పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం కూడా కార్పొరేట్ కంపెనీ తరహాలోనే ఉంటుందని ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఇదే తరహాలో తాము కూడా ప్రభుత్వంలో ప్రజలకు మెరుగ్గా, వేగవంతమైన సేవలు అందించేందుకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఎందుకు ఏర్పాటు చేయకూడదనే ఆలోచన వచ్చిందన్నారు. ప్రస్తుత మంత్రిత్వ శాఖలను కొత్తగా వచ్చే మంత్రిత్వ శాఖతో ఇబ్బంది ఉండదని, ఏ శాఖ పని ఆ శాఖ చేసుకుంటూ వెళ్ళనున్నదన్నారు. అయితే ప్రభుత్వ శాఖలు, విభాగాలు నిర్ణీత సమయంలో సమస్యలు, వినతులు, దరఖాస్తులు పరిష్కారం చేస్తున్నాయా లేదా అనేది ఫిర్యాదుల పరిష్కార మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది. గ్రామ స్థాయి నుంచి ముఖ్యమంత్రి కార్యాలయం వరకు ఐటీ సాయంతో వ్యవస్థ నడిచేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫిర్యాదు లేదా దరఖాస్తు సమర్పించిన ప్రతి ఒక్కరు తమ స్థితి ఎక్కడ ఉందో ఆన్ లైన్ లోనే తెలుసుకునే అవకాశం కూడా కల్పించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే సేవలపై ప్రస్తుతం సకల వెబ్ ఫోర్టల్ పనిచేస్తున్నది. నిర్ణీత గడువులోపు పరిష్కరించకుండా అలస్యం చేస్తే సదరు అధికారి లేదా ఉద్యోగిపై పెనాల్టీలు విధిస్తున్నారు. నూతన మంత్రిత్వ శాఖ ఏర్పాటుతో సకల వెబ్ పోర్టల్ ను మరింత పటిష్టం చేయనున్నారు. సకల చట్టం కింద నిర్ధేశిత సేవలను నిర్ణీత కాల వ్యవధిలో అందించే బాధ్యత ఇప్పటికే ఉంది. ఆలస్యం అయినా, నిర్లక్ష్యం చేసినా పెనాల్టీలతో పాటు శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలకు మరింత వేగంగా, నాణ్యంగా సేవలు అందించేందుకు ప్రపంచ దేశాల్లో అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను కర్నాటకలో ప్రవేశపెట్టి పరిపాలనను మరింత మెరుగుపర్చనున్నారు.
1980 లో యూనైటెడ్ కింగ్ డమ్ లాంటి దేశం సిటిజన్ చార్టర్ అండ్ సిటిజన్ ఎంటైటిల్ మెంట్ విధానాన్ని తీసుకువచ్చింది. దీని వెనకాల ఉన్న ప్రధాన లక్ష్యం ఏమంటే పౌరులకు సేవలు పొందే హక్కు తో పాటు ఆ సేవలను నిర్ధిష్ట పద్దతి, నిర్ణీత కాలపరిమితితో అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది. కొత్తగా ఏర్పాటు చేసే ఫిర్యాదుల పరిష్కార మంత్రిత్వ శాఖ పై ముఖ్యమంత్రి శివ కుమార్ క్రమం తప్పకుండా పర్యవేక్షించి గాడిలో పెట్టనున్నారు. తన మదిలో నుంచి వచ్చిన మానసపుత్రిక కావడంతో అత్యంత ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఎప్పటికప్పుడు సమస్యలు, వినతులు, ఫిర్యాదులు పరిష్కారానికి నోచుకుంటే ఫలితంగా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనడంలో సందేహం లేదు. ఫిర్యాదుల పరిష్కార మంత్రిత్వ శాఖ ఏర్పాటు కోసం గత వారం జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఇప్పటి వరకు ఒక సమస్య పరిష్కారానికి లేదా ఒక దరఖాస్తు పై సమాచారం పొందేందుకు పలు విభాగాలను సమన్వయం చేసుకోవాల్సి ఉండేది. ఇక నుంచి ఆ పరిస్థితి పౌరులకు ఉండదు. దరఖాస్తుకు సంబంధించిన సేవలు ఒకే వెబ్ పోర్టల్‌లో వీక్షించుకునే వెసులుబాటు ప్రజలకు ఉంటుంది.