విధాత, హైదరాబాద్:
సాధారణంగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం.. ప్రభుత్వ అధికారులు, ప్రైవేటు కంపెనీలకు నోటీసులు జారీ చేస్తుంది. కానీ కరీంనగర్ రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ ఒక బిల్డర్‌కు జారీ చేసిన నోటీసుపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నోటీసు అందిన తరువాత మూడు రోజులలోపు సీనరేజీ, పర్యావరణ ప్రభావ ఫీజుల వివరాలు అందచేయాలని ఆ నోటీసులో పేర్కొనడంతో బిల్డర్ సైతం కంగుతిన్నాడు. ఇదేమీ తీరు అంటూ ఆయన అధికారులపై అసహనం వ్యక్తం చేశాడు. ఈ నోటీసు వెనకాల ఒక మంత్రి ఒత్తిడి ఉండవచ్చనే అనుమానాలు రియల్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
కరీంనగర్ పట్టణంలో ఒక బిల్డర్ రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్ నిర్మిస్తున్నాడు. మొత్తం పది యూనిట్లను నిర్మాంచి, విక్రయించేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ లోపు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రంగ ప్రవేశం చేయడంతో అసలు కథ మొదలైంది. పరిశ్రమల విభాగం జారీ చేసిన జీఓఎంఎస్ నెంబర్ 34, 8 ప్రకారం సీనరేజీ ఫీజులు, పర్యావరణ ప్రభావ ఫీజులు ఎంత మేర చెల్లించారనే రశీదులు తనిఖీ సమయంలో అందచేయాలని నోటీసులో పేర్కొన్నారు. జిల్లా మైన్స్ అండ్ జియాలజీ అసిస్టెంట్ డైరెక్టర్ జారీ చేసి ట్రాన్సిట్ పాసులను కూడా సమర్పించాలని కోరారు. భవన నిర్మాణం కోసం చేసిన తవ్వకాలపై ఎంత మేర సీనరేజి ఫీజులు చెల్లించారనేది వివరించాలని పేర్కొన్నారు. మున్సిపాల్టీ లేదా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి భవన నిర్మాణంపై అనుమతులు తీసుకున్నారా, ఒక వేళ తీసుకున్నట్లయితే ఆ పత్రాలను చూపించాలన్నారు.
దీంతో పాటు అనుమతించిన లే అవుట్ లోనే నిర్మాణం చేశారా లేదా అనేది తెలియచేయాలని కోరారు. భవన నిర్మాణం పనులకు ముందు వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్పు చేశారా, చేస్తే ఎంత మొత్తం సెస్ రెవెన్యూ శాఖకు చెల్లించారనేది రశీదులు సమర్పించాలని చెప్పారు. రెసిడెన్షియల్ భవన నిర్మాణం కోసం ఎంత మొత్తం వ్యయం చేశారు, ఆ వివరాలతో పాటు లేబర్ సెస్ ఎంత చెల్లించారనేది తెలియచేయాలని సూచించారు. ఎంఏ యూడీ జారీ చేసిన జీఓ ఎంఎస్ నెంబర్ 168 ప్రకారం 20వేల చదరపు అడుగులు పైబడి నిర్మాణం చేస్తే ఎన్విరాన్ మెంటల్ క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాలి, తీసుకున్నట్లయితే ఆ సర్టిపికెట్ కూడా అందచేయాలని పేర్కొన్నారు. దీంతో పాటు టీజీ రెరా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ సమర్పించాలని తెలిపారు. ఈ శ్రమ్ వెబ్ పోర్టల్ రిజిస్ట్రేషన్ కాపీ కూడా ఉన్నట్లయితే అందచేయాలని ఆ నోటీసులో స్పష్టం చేశారు.
మూడు రోజులలో దీనికి సంబంధించిన అన్ని రశీదులు, పత్రాలు తమకు అందచేయాలని, అలా అందచేయని పక్షంలో అక్రమ నిర్మాణంగా భావించి చర్యలు తీసుకుంటామని రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ స్పష్టం చేయడం శోచనీయమని రియల్ ఎస్టేట్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.