బంగారం, వెండి వంటి విలువైన లోహాల కొనుగోలు భారతీయులకు గౌరవప్రదమైనదే కాకుండా సురక్షిత పెట్టుబడి మార్గం కూడా. బంగారం, వెండి వాటిపై పెట్టుబడులు అదనపు ఆదాయం ఇవ్వనప్పటికి..భారతీయులలో బంగారం పట్ల ఉన్న మోజు దాని కొనుగోళ్లను స్థిరంగా ఉంచుతుంది. ధర ఎంతైనా ఎంతో కొంత స్థోమత మేరకు కొనుగోలు చేయడం అలవాటుగా కొనసాగుతుంది. అయితే పశ్చిమాసియా సంక్షోభం నేపధ్యంలో బంగారం దిగుమతులపై భారత ప్రభుత్వం ఆంక్షలు విధించడం, ఏడాది పాటు కొనుగోలు చేయవద్దంటూ స్వయానా ప్రధాని మోదీ పిలుపునివ్వడం వంటి పరిణామాలు దేశీయంగా బంగారం కొనుగోళ్లను క్షీణింప చేస్తున్నాయి. అదే సమయంలో బంగారంపై రుణాల నిబంధనలు సైతం రిజర్వ్ బ్యాంకు కఠినతరం చేస్తుండటం కూడా బంగారంపై ఆసక్తిని తగ్గించేదిగా చేస్తుంది. ఈ నేపథ్యంలో జనం క్రమంగా తమ పెట్టుబడులను స్థిరాస్తి రంగం వైపు మళ్లిస్తుండటంతో అనూహ్యంగా దేశంలోని పలు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంటుండటం హాట్ టాపిక్ గా మారింది.
బంగారం కంటే స్థిరాస్థినే ముద్దు
బంగారం అనేది ఒక సురక్షితమైన ఆస్తి అయినప్పటికీ, అది ఎలాంటి అదనపు నెలవారీ ఆదాయాన్ని లేదా అద్దెను ఇవ్వదు. దీంతో ఆధునిక పెట్టుబడిదారులు తమ పొదుపు వ్యూహాన్ని మార్చుకుంటున్నారు. ఇటీవలి అనరాక్(ANAROCK) గృహ కొనుగోలుదారుల సర్వే ప్రకారం, దాదాపు 63 శాతం మంది ప్రజలు నేడు రియల్ ఎస్టేట్‌ను అత్యుత్తమ పెట్టుబడి సాధనంగా భావిస్తున్నారు. గతంలో మొదటి స్థానాల్లో ఉన్న స్టాక్ మార్కెట్ (22 శాతం), బంగారం(7 శాతం) ఇప్పుడు చాలా వెనుకబడిపోయాయి.దేశంలో బంగారానికి డిమాండ్ భారీగా పడిపోయింది. పసిడి విక్రయాలు 70 శాతం తగ్గిపోయాయి. బంగారం కేవలం ఆభరణంగానో, లాకర్‌కే పరిమితమయ్యే ఆస్తిగానో మిగిలిపోతుంటే, ఇల్లు అనేది కుటుంబానికి ఆర్థికంగా, నివాసపరంగా, జీవనశైలిని పెంచే సాధనంగా భావించే ధోరణి పెరిగిపోతుంది. భారతీయ కుటుంబాలకు పొదుపు ఆలోచనలు ఎక్కువ కావడంతో.. వారు బంగారంపై పెట్టే ఖర్చును తగ్గించి, ఆ డబ్బును మరింత ప్రయోజనకరమైన మార్గాల్లోకి మళ్లిస్తున్నారు. ఈ క్రమంలోనే లాకర్లలో నిరుపయోగంగా ఉండే బంగారం కంటే, స్థిరాస్తి (రియల్ ఎస్టేట్) రంగం వైపు ప్రజల మొగ్గు స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో భూములు, ఇండ్లు, ఇళ్ల స్థలాల ధరల్లో గణనీయమైన పెరుగుదల నమోదవుతుండటం ఆసక్తికరంగామారింది.
‘మన ఇల్లు’భావనకు పెద్దపీట
కష్టపడి సంపాదించిన డబ్బును గూడు లేని స్థితి నుండి గర్వంగా ‘మన ఇల్లు’ అని పిలుచుకునే శాశ్వత ఆస్తిగా మార్చుకోవడానికే నేటి భారతీయులు ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ మార్పుతో శాశ్వత నివాసంతో పాటు భవిష్యత్తు తరాలకు భద్రతను, ఉన్నతమైన జీవన ప్రమాణాలను అందించే ఒక వివేకవంతమైన ఆర్థిక నిర్ణయంగా భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రముఖ నగరాల్లో ఇళ్ల అద్దెలు విపరీతంగా పెరిగిపోవడంతో, నెలకు అద్దె రూపంలో యజమానుల జేబులు నింపే కంటే, అదే మొత్తాన్ని గృహ రుణ ఈఎంఐలుగా (EMI) మార్చుకుని సొంత ఇల్లు నిర్మించుకోవడమే తెలివైన నిర్ణయమని సగటు కుటుంబాలు భావిస్తున్నాయి. ఒక సంవత్సరం పాటు బంగారం కొనడం ఆపివేస్తే లభించే భారీ మొత్తం, కొత్త ఇంటి కొనుగోలుకు అవసరమైన డౌన్ పేమెంట్‌గా ఉపయోగపడుతోంది. ఈ విధంగా బంగారంపై చేసే పొదుపు, చాలా కుటుంబాలలో అనధికారికంగా సొంత ఇంటి కలని సాకారం చేసే నిధిగా మారుతోంది. దీనివల్ల ఇల్లు లేని వారితో పాటు చిన్న లేదా అద్దె ఇళ్లలో ఉండేవారు సైతం ధైర్యంగా పెద్ద ఇళ్లలోకి, లేదా నగర శివార్లలో కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో సరసమైన ధరల్లో లభించే ఆస్తుల వైపు అడుగులు వేస్తున్నారు.
నిర్మాణదారులు అత్యాశకు పోకుంటే కొనుగోలులో మరింత వృద్ది
నేటి కొనుగోలుదారులు కేవలం ధరల పెరుగుదలను మాత్రమే కాకుండా, నమ్మకమైన బిల్డర్, అనుకూలమైన ప్రాంతం, కుటుంబానికి అవసరమైన ఆధునిక వసతులను నిశితంగా పరిశీలిస్తూ స్వల్పకాలిక లాభాల కంటే దీర్ఘకాలిక సౌకర్యాలకు ప్రాధాన్యతనిస్తూ స్థిరాస్తి వైపు ఆసక్తి చూపుతున్నారు. అయితే బిల్డర్లు, డెవలపర్లు ప్రీమియం, లగ్జరీ ప్రాజెక్టులపై దృష్టి పెట్టకుండా మధ్యతరగతి కుటుంబాలకు సరిపడే ఇంటి నిర్మాణ ప్రాజెక్టులను ఎక్కువ చేస్తే ఇండ్ల కొనుగోలు అంతమేరకు పెరుగుతాయని నిర్మాణరంగ నిపుణులు సూచిస్తున్నారు. 2బీహెచ్ కే, 3 బీహెచ్ కే, స్థలం వృథా కాకుండా తక్కువ స్థలంలో ఎక్కువ వసతులు, మంచి గాలి వెలుతురు, డ్రైనేజీ మంచినీటీ వసతులతో కూడిన ఇళ్ల నిర్మాణాలను చేస్తే కొనుగోళ్లు మరింత పెరగడం ఖాయం అంటున్నారు. అయితే కొనుగోలుదారులు మోసాలకు గురికాకుండా ఆస్తుల కొనుగోలులో జాగ్రత్తలు వహించాలని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మూడు నెలలుగా ఇళ్ల రిజిస్ట్రేషన్ల పెంపు
రియల్ ఎస్టేట్ పుంజుకుంటుండటంతో గతేదాడితో పోల్చితే ఈ ఏడాది నాలుగు నెలల్లో ఇళ్ల రిజిస్ట్రేషన్లు పెరిగిపోయాయి. భూముల విలువను ప్రభుత్వం పెంచనుందన్న ప్రచారంతో ఆ లోపునే రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకోవాలన్న ఆలోచనతో కొనుగోలుదారులు ఉండటం, బంగారం వైపు నుంచి స్థిరాస్తి వైపు పెట్టుబడులు మళ్లిస్తుండటం వంటి కారణాలతో ఇండ్లు, భూముల క్రయవిక్రయాలు క్రమంగా పెరగడానికి కారణమవుతున్నాయి. దీంతో రిజిస్ట్రేషన్లు పెరిగి..ఆ మేరకు ప్రభుత్వానికి ఆదాయం సైతం పెరిగింది. ఈ ఏడాది జనవరిలో 4686 ఇండ్ల రిజిస్ట్రేషన్లు జరిగితే..ఏప్రిలో నెలలో 6,837కు పెరిగిపోవడం గమనార్హం.
రాజధాని నుంచి గ్రామాల్లోకి పాకుతున్న రియల్ బూమ్
కొత్తగా రాయదుర్గంలో ఎకరం భూమి వేలంలో రూ.237కోట్లు పలకడం, రావిర్యాలలో సైతం గజం భూమి రూ. 83,500పలకడం వంటి పరిణామాలు తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త బూమ్ అందిస్తున్నాయి. రాజధాని హైదరాబాద్ నుంచి మెల్లగా గ్రామాల్లోకి మళ్లీ రియల్ బూమ్ విస్తరిస్తుండటంతో గ్రామాల్లో మళ్లీ భూముల ధరలకు రెక్కలొస్తున్నాయి. క్రమంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ భూముల క్రయవిక్రయాలు పుంజుకుంటుండటం రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊపునిస్తుంది. అదిగాక ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్ ధరల పెంచనుందన్న భయంతో కొనుగోలుదారులు ఇండ్లు, భూముల కొనుగోలుకు త్వరపడుతున్నారు. మొత్తంగా బంగారం నుంచి స్థిరాస్తి వైపు పెట్టుబడులు మళ్లడం, రిజిస్ట్రేషన్ ధరల పెంపు, ప్రభుత్వ భూముల వేలం రికార్డు ధరలు పలుకుతుండటం వంటి పరిణామాలు పట్టణాలు, గ్రామాల్లో స్థిరాస్తి వ్యాపారాన్ని పెంచుతుండగా..దీనిని ఆర్థిక వ్యవస్థకు ఓ సానుకూల పరిణామంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.