Cat Snake | ఈ భూమ్మీద అనేక రకాల జాతులకు చెందిన పాములు( Snakes ) ఉన్నాయి. అడవుల్లో సాధారణంగా అతి పెద్ద కోబ్రాలు( Cobra ) దర్శనమిస్తుంటాయి. వాటితో ఇతర విషపూరిత పాములు కూడా సంచరిస్తుంటాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా క్యాట్ స్నేక్( Cat Snake ) ప్రత్యక్షమైంది. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న కనకగిరి అడవుల్లో( Kanakagiri Forest ) ఈ పిల్లి పాము ప్రత్యక్షమవడం పర్యావరణ ప్రేమికులను( Nature Lovers ), స్నేక్ లవర్స్( Snake Lovers )ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఏపీలోని తిరుమల కొండలు, నల్లమల్ల అడవుల్లోనే ఇప్పటి వరకు ఈ క్యాట్ స్నేక్ కనిపించినట్లు కథనాలు ఉన్నాయి.
చెట్లపై సంచరిస్తూ..
ఈ క్యాట్ స్నేక్ ఎక్కువగా చెట్లపై సంచరిస్తూ ఉంటుంది. దీని పొడవు వచ్చేసి 5 నుంచి 7.5 అడుగుల పొడవు ఉంటుంది. డచ్ పర్యావరణ ప్రేమికుడు ‘ఎలిటియో అలెగొండస్ ఫోర్‌స్టెన్’ గౌరవార్థం దీనికి ఫోర్‌స్టెన్ క్యాట్ స్నేక్( Forsten’s cat snake ) అని నామకరణం చేశారు.
పిల్లి కళ్ల మాదిరే క్యాట్ స్నేక్ కళ్లు..

కొత్తగూడెంకు చెందిన ‘మెరాకి ఆర్గనైజేషన్’కు చెందిన ప్రకృతి ప్రేమికుడు సుజీత్ అన్నే తన నలుగురు స్నేహితులతో కలిసి కొద్ది రోజుల క్రితం కనకగిరి అడవుల్లోకి వెళ్లాడు. అక్కడున్న సరీసృపాలను, పక్షులను గుర్తించే పనిలో ఉండగా.. ఈ క్యాట్ స్నేక్ తారసపడింది. ఇంకేముంది.. ఈ అరుదైన క్యాట్ స్నేక్‌ను తన కెమెరాలో బంధించాడు. ఈ పాము 5 అడుగుల వరకు ఉందని తెలిపారు. క్యాట్ స్నేక్ కళ్లు పిల్లి కళ్ల మాదిరే ఉంటాయని, అందుకే దీనికి క్యాట్ స్నేక్ అని పేరు వచ్చిందని పేర్కొన్నారు.
కనకగిరి అడవులు కేవలం పాములకే కాదు..
కనకగిరి అడవులు కేవలం పాములకే కాదు.. అరుదైన పక్షులకు, ఇతర జీవులకు కూడా నిలయంగా మారింది. గతంలో తొలిసారిగా ‘బ్లూ-ఇయర్డ్ కింగ్‌ఫిషర్’ (Blue-eared Kingfisher) అనే పక్షిని కూడా ఈ బృందం ఇక్కడే గుర్తించింది. వీటితో పాటు మలబార్ జెయింట్ స్క్విరల్ (పెద్ద ఉడుత), టెర్మైట్ హిల్ గెక్కో (బల్లి జాతి), బ్లాక్-వింగ్డ్ కైట్, రుఫస్ ఉడ్‌పెక్కర్ వంటి పలు అరుదైన పక్షి జాతులు ఇక్కడ సంచరిస్తున్నాయి. ఈ కొండల్లో ఉన్న జీవవైవిధ్యాన్ని (Biodiversity) మరింతగా అన్వేషించడానికి ఈ వర్షాకాలంలో ఒక సమగ్ర సర్వేను చేపట్టాలని ఈ బృందం భావిస్తోంది.