హైలైట్స్:
- ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయితో మంత్రి ఉత్తమ్ కీలక భేటీ
- సర్వే ఖర్చుల కోసం రూ.9.883 కోట్లు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
- ముంపు ప్రభావిత భూములకు చట్టబద్ధ పరిహారం
- 4.40 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు భారీ ఊతం
- రామప్ప–పాకాల లింక్ కాలువ ద్వారా అదనంగా 30 వేల ఎకరాలకు సాగునీరు
- దేవాదుల ఆయకట్టు స్థిరీకరణతో పాటు వందల గ్రామాలకు తాగునీరు
- రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
విధాత ప్రత్యేక ప్రతినిధి :
గోదావరి నదిపై నిర్మించ తలపెట్టిన సమ్మక్క–సారక్క బ్యారేజ్ (సమ్మక్క సాగర్) ప్రాజెక్టు అనుమతుల సాధనలో తెలంగాణ ప్రభుత్వానికి మరో కీలక ముందడుగు పడిందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. గురువారం రాత్రి హైదరాబాద్‌కు వచ్చిన ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయిని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘనంగా స్వాగతించారు. అనంతరం రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ అధికారుల బృందంతో కలిసి ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రితో మంత్రి ఉత్తమ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఛత్తీస్‌గఢ్–తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన సమ్మక్క–సారక్క ప్రాజెక్టుపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్ర జల సంఘం తుది పరిశీలనకు తీసుకెళ్లేందుకు అవసరమైన అభ్యంతర రహిత పత్రం (ఎన్ఓసీ ) జారీ చేయాలని విన్నవించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గోదావరి జలాల వినియోగం, పెండింగ్ నీటిపారుదల ప్రాజెక్టుల పూర్తి, రైతాంగానికి శాశ్వత సాగునీటి భద్రత కల్పించడం వంటి అంశాలకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. సమ్మక్క–సారక్క బ్యారేజ్ అత్యంత కీలకమైన ప్రాజెక్టు అని ఆయన వివరించారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి తెలంగాణ సానుకూలంగా స్పందించారని మంత్రి తెలిపారు. ఇది కీలక మలుపుగా నిలుస్తుందన్నారు. కేంద్ర జల సంఘంలోని అంతర్‌రాష్ట్ర వ్యవహారాల డైరెక్టరేట్ మినహా మిగతా అన్ని ప్రధాన డైరెక్టరేట్ల నుంచి ప్రాజెక్టుకు ఇప్పటికే అనుమతులు లభించాయని మంత్రి వెల్లడించారు. ఎన్ఓసీ లేకపోవడం వల్ల మాత్రమే డీపీఆర్ తుది పరిశీలన నిలిచిపోయిన విషయాన్ని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. ప్రాజెక్టు ముంపు, బ్యాక్‌వాటర్ ప్రభావిత ప్రాంతాలపై ఇరు రాష్ట్రాల ఇంజినీర్లు ఇప్పటికే సంయుక్త సర్వే నిర్వహించారని మంత్రి తెలిపారు. మరింత ఖచ్చితమైన సర్వే చేపట్టాలని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కోరిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందించిందన్నారు. సర్వే ఖర్చుల కోసం రూ.9.883 కోట్లను 2026 ఏప్రిల్‌లో ఛత్తీస్‌గఢ్ జలవనరుల శాఖకు విడుదల చేసినట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం బీజాపూర్ జిల్లాలో సర్వే పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
పరిహారం చెల్లిస్తాం
ముంపు లేదా బ్యాక్‌వాటర్ ప్రభావిత భూములు గుర్తించిన పక్షంలో చట్టబద్ధంగా పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. అవసరమైతే పరిహార మొత్తాన్ని ముందుగానే డిపాజిట్ చేసేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి తెలియజేసినట్లు ఆయన పేర్కొన్నారు. సమ్మక్క–సారక్క ప్రాజెక్టు మూలాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పీవీ నరసింహారావు కంతనపల్లి సుజల స్రవంతి పథకంలో ఉన్నాయని మంత్రి వివరించారు. గోదావరి నదిపై కంతనపల్లి వద్ద బ్యారేజ్ నిర్మించి ఎస్సార్ఎస్పీ స్టేజ్–2 ఆయకట్టును స్థిరీకరించడం లక్ష్యంగా ఈ ప్రాజెక్టు రూపొందించారని అన్నారు. 2009 ఫిబ్రవరి 10న జారీ చేసిన జీఓ ఎంఎస్ నెం.27 ద్వారా ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతి లభించిందని, 2012 మార్చి 2న కేంద్ర జల సంఘం డీపీఆర్ తయారీకి సూత్రప్రాయ అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు.
"సమ్మక్క–సారక్క బ్యారేజ్ ద్వారా గోదావరి నుంచి 46.96 టీఎంసీల నీటిని మళ్లించి ఎస్సార్ఎస్పీ స్టేజ్–2 కింద 4.40 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నా. దీనికి అదనంగా రామప్ప–పాకాల లింక్ కాలువ ద్వారా మరో 30 వేల ఎకరాలకు కొత్తగా సాగునీటి సౌకర్యం కల్పిస్తాం. ఈ ప్రాజెక్టు ద్వారా సూర్యాపేట జిల్లాలో 2,34,199 ఎకరాలు, మహబూబాబాద్ జిల్లాలో 96,494 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 85,774 ఎకరాలు, వరంగల్ జిల్లాలో 22,422 ఎకరాలు, జనగామ జిల్లాలో 1,111 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు ప్రయోజనం కలుగుతుంది."
- నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
4.40 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ
సమ్మక్క–సారక్క బ్యారేజ్ ద్వారా గోదావరి నుంచి 46.96 టీఎంసీల నీటిని మళ్లించి ఎస్సార్ఎస్పీ స్టేజ్–2 కింద 4.40 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నట్లు మంత్రి తెలిపారు. దీనికి అదనంగా రామప్ప–పాకాల లింక్ కాలువ ద్వారా మరో 30 వేల ఎకరాలకు కొత్తగా సాగునీటి సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా సూర్యాపేట జిల్లాలో 2,34,199 ఎకరాలు, మహబూబాబాద్ జిల్లాలో 96,494 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 85,774 ఎకరాలు, వరంగల్ జిల్లాలో 22,422 ఎకరాలు, జనగామ జిల్లాలో 1,111 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు ప్రయోజనం కలుగుతుందని ఆయన తెలిపారు. రామప్ప–పాకాల లింక్ కాలువ ద్వారా ములుగు జిల్లాలో 8,000 ఎకరాలు, వరంగల్ నర్సంపేట ప్రాంతంలో 22,000 ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందన్నారు. ఇదే కాకుండా జె. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకంలోని కొంత ఆయకట్టు స్థిరీకరణకు కూడా ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని వందలాది గ్రామాలకు తాగునీటి ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. ప్రాజెక్టు డీపీఆర్‌ను 2021 ఆగస్టు 31న కేంద్ర జల సంఘానికి సమర్పించినట్లు మంత్రి తెలిపారు. హైడ్రాలజీ డైరెక్టరేట్, కాస్ట్ ఎస్టిమేట్స్ డైరెక్టరేట్, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, కేంద్ర భూగర్భ జల మండలి సహా పలు ప్రధాన అనుమతులు ఇప్పటికే లభించాయని చెప్పారు. 2024 జూలై నుంచి 2026 జనవరి వరకు కేంద్ర జల సంఘం కోరిన వివరణలన్నింటికీ తెలంగాణ నీటిపారుదల శాఖ సమగ్ర సమాధానాలు సమర్పించిందన్నారు.
ఎన్‌వోసీ సాధన కోసం నిరంతర కృషి
ఎన్ఓసీ సాధన కోసం తెలంగాణ ప్రభుత్వం గత రెండేళ్లుగా నిరంతరంగా కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. 2024 ఏప్రిల్ 26, ఆగస్టు 12, 2025 జనవరి 24, ఏప్రిల్ 23 తేదీల్లో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి అధికారిక లేఖలు రాసినట్లు తెలిపారు. 2025 సెప్టెంబర్ 22న రాయ్‌పూర్‌లో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిని స్వయంగా కలిసి ఇదే అంశాన్ని ప్రస్తావించినట్లు గుర్తు చేశారు. అంతే గాకుండా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్ తో, కేంద్ర జల సంఘం చైర్మన్‌తో కూడా ఈ అంశంపై చర్చలు జరిపినట్లు మంత్రి తెలిపారు. 2025 నవంబర్, డిసెంబర్ నెలల్లో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు ప్రత్యేక విజ్ఞప్తులు పంపి అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరినట్లు వివరించారు.
ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఎన్ఓసీ జారీ చేసిన వెంటనే కేంద్ర జల సంఘం అంతర్‌రాష్ట్ర వ్యవహారాల డైరెక్టరేట్ డీపీఆర్ తుది పరిశీలన పూర్తి చేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దీంతో సమ్మక్క–సారక్క బ్యారేజ్ అమలుకు ఉన్న చివరి ప్రధాన పరిపాలనా అడ్డంకి కూడా తొలగిపోయే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలు, సాగునీటి భద్రత, తాగునీటి అవసరాలు, అంతర్‌రాష్ట్ర సత్సంబంధాలు — ఈ నాలుగు అంశాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం సమ్మక్క–సారక్క ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తోందని మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.