హైదరాబాద్ రాయదుర్గంలోని నరేశ్ అటోమొబైల్స్ విన్‌ఫాస్ట్ కార్ల షోరూంలో రూ.25 లక్షలతో కొనుగోలు చేసిన కారు షోరూం బయట ఆగిపోవడం వివాదస్పదమైంది. వీఎఫ్ 7 విండ్ కారును జూన్ 2న కొనుగోలు చేసిన వినియోగదారుడు ..3వ తేదీన చార్జింగ్ పెట్టేందుకు షో రూమ్ కు రాగా…కిలో మీటర్ వెళ్లకుండానే ఆగిపోయింది. తాను కారును మొత్తం 5కిలోమీటర్లు నడుపలేదని, కారు చెక్ చేయకుండా షోరూమ్ నిర్వాహకులు నాకు కారు విక్రయించారని, సమస్యను షోరూం సిబ్బందికి తెలియజేస్తే వారు నిర్లక్ష్యం వహిస్తూ స్పందించడం లేదని కొనుగోలు దారుడు వాపోయారు.

“కారు ఆగిపోవడంతో మాకు సంబంధం లేదు” అంటూ షోరూమ్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కొనుగోలుదారుడు మీడియాకు వివరించారు. కారు తిరిగి ఇచ్చినా రిప్లేస్ చేయడం లేదని, డబ్బులు ఇవ్వడం లేదని, ఏం చేసుకుంటారో చేసుకోండని బెదిరిస్తున్నారని, సేల్స్ మేనేజర్, సర్వీస్ మేనేజర్ పట్టించుకోవడం లేదని, ఎండీ మీ ఇష్టం వచ్చింది చేసుకోమంటున్నారని, నన్ను షోరూం నుంచి బయటకు పంపించారని బాధితుడు వాపోయాడు. జరిగిన అన్యాయంపై ఇప్పటికే వినియోగదారుల ఫోరంలో కేసు కూడా వేశానని తెలిపాడు. ఈ ఘటనపై విన్ ఫాస్ట్ కంపెనీ స్పందించాలని కోరారు.