Traffic Restrictions | హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌ల నేప‌థ్యంలో హైద‌రాబాద్ న‌గ‌రంలో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ వేడుక‌ల‌ను అధికారికంగా ప‌రేడ్ గ్రౌండ్‌లో నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేసింది. మ‌రికాసేప‌ట్లో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. సీఎంతో పాటు 6 వేల మంది ఈ వేడుక‌ల్లో పాల్గొన‌నున్నారు.

ఈ నేప‌థ్యంలో ప‌రేడ్ గ్రౌండ్ ప‌రిస‌రాల్లో మ‌ల్కాజ్‌గిరి పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. ఉద‌యం 7 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయ‌న్నారు. బేగంపేట, సికింద్రాబాద్, తిరుమలగిరి, బోయిన్‌పల్లి, ట్యాంక్‌బండ్‌ తదితర ప్రాంతాల గుండా ప్రయాణించేవారు ప్రత్యామ్నాయం చూసుకోవాలని సూచించారు.

వీటిపై నిషేధం..

బేగంపేట, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి పోలీస్‌స్టేషన్ల పరిధిలో పారాగ్లైడర్లు, తేలికపాటి ఎయిర్‌క్రాఫ్టులు, ఆయుధాలు, పదునైన, మండే స్వభావమున్న వస్తువులు, డ్రోన్లు, లేజర్‌ లైట్లు తదితర వస్తువులపై నిషేధం విధించారు.

భారీ పోలీసు బందోబ‌స్తు..

ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా.. 1,140 మంది పోలీసుల‌తో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముగ్గురు డీసీపీలు, నలుగురు అదనపు డీసీపీలు, 8 మంది ఏసీపీలు, 49 మంది ఇన్‌స్పెక్టర్లు, 88 మంది ఎస్సైలు, 723 మంది ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుళ్లు, హోంగార్డులు విధుల్లో పాల్గొంటున్నారు.