విధాత, హైదరాబాద్ : రైతు రాజ్యం లక్ష్యంగా ప్రజా ప్రభుత్వ పాలన సాగుతుందని, వ్యవసాయం – వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు – అనుబంధ రంగాల విషయంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉండాలన్న లక్ష్యంతో, రైతుల జీవితాల్లో గణనీయమైన మార్పు తేవాలన్న సంకల్పంతో “తెలంగాణ రైజింగ్ – 2047” విధాన పత్రంలో ప్రాధాన్యత అంశంగా తీసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పరేడ్ గ్రౌండ్ లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ చేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ లో “రూరల్ అగ్రికల్చర్ రీజనల్ ఎకానమీ” పేరుతో వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత పారిశ్రామికవేత్తలుగా రైతులను తీర్చిదిద్దే దిశగా ప్రణాళిక ఉంటుంది అని, అగ్రికల్చరల్ ఏకో సిస్టమ్ అభివృద్ధి చేసి, రైతులను శ్రీమంతులుగా చేయాలన్న సంకల్ప పత్రం ఇది అని పేర్కొన్నారు.
ఈ రెండున్నరేళ్లలో వ్యవసాయానికి, రైతు సంక్షేమానికి రూ. 1 లక్షా 56 వేల 496 కోట్లు ఖర్చు చేశాం. రైతు భరోసా పెట్టుబడి సాయం కింద ఇప్పటి వరకు రూ. 27 వేల 529 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలలో వేశాం. గత ఏడాది వానాకాలం రైతు భరోసా పెట్టుబడి సహాయ పథకం కింద కేవలం తొమ్మిది రోజుల్లోనే రూ.8 వేల 744 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేశాం. ఈ ఏడాది ఇప్పటికే 5 వేల 700 కోట్ల రూపాయల రైతుభరోసా నిధులను నేరుగా రైతు ఖాతాలలో జమచేశాం. ఇది అన్నదాతల పట్ల మా చిత్తశుద్ధికి, వ్యవసాయం పట్ల మా ప్రాధాన్యతకు నిదర్శనం అని రేవంత్ రెడ్డి తెలిపారు.
రికార్డు స్థాయిలో పంటల దిగుబడి…కొనుగోలు
2025-26 అంచనాల ప్రకారం మన ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 236.87 లక్షల మెట్రిక్ టన్నులుగా నమోదైంది. ప్రజా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకంతో వరి, మొక్కజొన్న, పత్తి పంటల విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. పశు సంపద, మత్స్య రంగాలు గణనీయమైన వృద్ధి సాధించాయి. రైతులు విభిన్న పంటల ఉత్పత్తితో తెలంగాణను సకల పంటల క్షేత్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా తెలంగాణ రైతులు కార్యసాధకులు కావాలంటే అప్పులేని పరిస్థితి ఉండాలి. అందుకే రైతుల నెత్తిపై ఉన్న అప్పుల భారాన్ని తగ్గించే ఉద్దేశంతో ఒకే సారి రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేశాం. రూ.20,616 కోట్లు రైతుల ఖాతాల్లో వేసి, దాదాపు 25 లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేశాం. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను కొనసాగిస్తూనే, విద్యుత్తు పంప్ సెట్లకు సౌరశక్తితో నడిచే పంప్ సెట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నాం. తద్వారా అదనంగా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును గ్రిడ్‌కు అందించి, రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా చేస్తున్నాం అని తెలిపారు.
దేశంలోనే అధికంగా పంటల కొనుగోలు
ఆర్థికంగా భారమైనప్పటికి…రైతులు దళారుల బారిన పడి మోసపోకూడదని, రైతులు పండించిన పంటలను ప్రభుత్వం కనీస మద్దతు ధర చెల్లిస్తుందని మేం అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు రెండున్నరేళ్లలో ధాన్యం కొనుగోళ్లకు రూ. 82 వేల 840 కోట్లు ఖర్చు పెట్టాం అని, ఈ యాసంగి సీజన్లో రాష్ట్రమంతా 8575 కొనుగోలు కేంద్రాల ద్వారా చురుగ్గా ధాన్యం సేకరణ జరుగుతోందని తెలిపారు. ఇప్పటివరకు 63.65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. సుమారు రూ.11 వేల 903 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం. అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసిపోయిన చోట రైతు నష్టపోకూడదని దాదాపు 10 వేల మెట్రిక్ టన్నుల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ధాన్యం కొనుగోళ్లలో దేశంలో ఏ రాష్ట్రం కూడా మనతో పోటీపడే పరిస్థితి లేదు. దేశంలో యాసంగి సీజన్‌లో సేకరించిన మొత్తం ధాన్యంలో తెలంగాణ వాటా 60 శాతం నమోదైందని చెప్పడానికి గర్విస్తున్నాను.
గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో జొన్న, మొక్కజొన్న పంటల సాగు భారీగా పెరిగింది. ఈ యాసంగిలో సుమారు 16 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 4 లక్షల ఎకరాల్లో జొన్న సాగు చేసి తెలంగాణ రైతులు కొత్త చరిత్ర సృష్టించారు. మొక్కజొన్నల కొనుగోళ్లకు సుమారు 4 వేల 275 కోట్లు, జొన్న కొనుగోళ్లకు ఇప్పటి వరకు 1154 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించిందని తెలిపారు.
సాగునీటి రంగానికి ప్రాధాన్యత
తెలంగాణ నీటి కోసం దశాబ్దాలు గోస పడిందని, గత పదేళ్ల పాలనలో సైతం పరిస్థితులు మారలేదు. కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటాలు తేల్చి, ప్రాజెక్టులు పూర్తి చేసే విషయంలో మన ప్రభుత్వం చిత్త శుద్ధితో ఉంది. ఈ విషయంలో ఏ వేదిక పైన ఐనా రాజీ లేకుండా, లౌక్యంతో, రాజకీయ విజ్ఞతతో పని చేస్తాం అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టులు, 2014-15లో ప్రారంభమైన ప్రాజెక్టులు కొన్ని ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్నాయి. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ చేపట్టి వీటిని పూర్తి చేయాలని ప్రభుత్వం పట్టుదలతో పని చేస్తోంది. ఇవి పూర్తయితే ఆశించిన మేరకు కొత్త ఆయకట్టుకు నీరందుతుంది. తెలంగాణకు వర ప్రదాయని ప్రాణహిత – చేవేళ్ల ప్రాజెక్టుకు తిరిగి ప్రాణం పోసే ప్రయత్నం చేస్తున్నాం.
మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ఇటీవలే లేఖ రాశాను. వారితో చర్చించి, తుమ్మడిహెట్టి బ్యారేజీ నిర్మించే కార్యాచరణ చేపడుతాం. గత ప్రభుత్వం లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేండ్లకే కుంగిపోయింది. దీనికి మరమ్మతులు చేయించే భారం ప్రభుత్వంపై పడింది. ప్రజా శ్రేయస్సు, ప్రయోజనాల దృష్ట్యా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలను పునరుద్ధరించే పనులు మొదలు పెట్టాం అని తెలిపారు.
తెలంగాణ స్త్రీ శక్తి
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో ప్రజా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపట్టిందని, ఈ రోజు ఆర్థిక సాధికారతలో తెలంగాణ మహిళ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు. పొదుపు నుంచి పారిశ్రామికవేత్త వరకు తన శక్తిని చాటి చెబుతోంది. ప్రజా ప్రభుత్వం అందిస్తోన్న ప్రోత్సాహంతో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. మన మహిళా సంఘాలు ఇప్పుడు ఆర్థిక శక్తి కేంద్రాలు. ఆడబిడ్డలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే క్షేత్రాలు. బ్యాంకు లింకేజీ స్త్రీ నిధి ద్వారా ఈ సంఘాలకు రూ. లక్ష కోట్లు రుణాలుగా ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 60 వేల కోట్ల సున్నా వడ్డీ రుణాలను పంపిణీ చేశాం. రూ.5 లక్షల రుణప రిమితిని రూ.10 లక్షలకు పెంచాం. ఇందిరమ్మ క్యాంటీన్లు, సౌర విద్యుత్తు ప్లాంట్లు, పెట్రోల్ బంకులను మహిళలు నేడు యజమానులుగా ఎదిగారని తెలిపారు. 1000 బస్సులకు వాళ్లు ఓనర్లుగా మారారని,ఇందిరా మహిళా శక్తి సూపర్ బజార్లు, లాజిస్టిక్ హబ్‌లు, గోదాములు, రైస్ మిల్లులు ఏర్పాటుకు వాళ్లు సిద్ధంగా ఉన్నారని, ఇటీవలే రాష్ట్రమంతటా ఒకేరోజున 8 వేల స్త్రీ శక్తి భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నాం అని వివరించారు.
అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, యూనిఫాం కుట్టు కూలీ మహిళా సంఘాలకు అప్పగించాం. శిల్పారామంలో మహిళ సంఘాల ఉత్పత్తుల అమ్మకానికి స్టాళ్లు ఏర్పాటు చేశాం. తెలంగాణ మహిళ దేశ పారిశ్రామిక రంగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం ఎంతో దూరంలో లేదు. ఇది ప్రజా ప్రభుత్వ కల అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అందిస్తున్న మహాలక్ష్మి పథకం విజయపథంలో కొనసాగుతున్నది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ఆడబిడ్డలు దాదాపు రూ.10 వేల కోట్లు ఆదా చేసుకోగలిగారు. ఇది నాకు ఎంతో సంతృప్తినిచ్చిన పథకం. మహాలక్ష్మి పథకంలో రాష్ట్రంలోని 42.90 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నాం. గృహజ్యోతి కింద 53.09 లక్షల పేదల గృహాలకు 200 యూనిట్ల ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నా అని వెల్లడించారు.
రికార్డు వేగంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
యువతకు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాల భర్తీ ప్రక్రియను విజయవంతంగా చేపట్టాం. లీగల్ సమస్యలు, లిటిగేషన్లకు ఆస్కారం లేకుండా కొలువుల భర్తీ చేశాం. ఉద్యోగ నియామక ప్రక్రియలో పారదర్శకతను పునరుద్ధరించాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో పాటు ఇతర నియామక బోర్డులను పూర్తిగా సంస్కరించుకున్నాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4తో పాటు మెగా డీఎస్సీ, వైద్యారోగ్య శాఖలో వరుసగా నియామకాలను చేపట్టాం. రికార్డు సమయంలో 67,763 పోస్టులను భర్తీ చేసి యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచాం. ఉద్యోగంలో చేరే ముందు అఖిల భారత సర్వీస్ అధికారులకు శిక్షణను అందించినట్లుగా నియామక పత్రాలు అందుకున్న 562 గ్రూప్-వన్, 782 గ్రూప్`టూ అధికారులకు తొలిసారిగా మన ప్రభుత్వం ఫౌండేషన్ కోర్సు నిర్వహించింది.
ఈ నెలలోనే టిజిపిఎస్‌సి ద్వారా ఇంజనీరింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అటవీశాఖ, టౌన్ అండ్ కంట్రీప్లానింగ్ మరియు విద్యాశాఖలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. నోటిఫికేషన్‌ల జారీ ప్రక్రియ నిరంతరంగా జరుగుతుంది.
విద్యారంగం దశ మారింది
విద్య ఒక్కటే పేదరికాన్ని రూపుమాపగలదని నేను విశ్వసిస్తున్నాను. పేదరికం రూపుమాపగలిగితే సమాజంలో కుల, మతాల అంతరాలు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యత విద్యకు ఉంది. అందుకే ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా విద్యా శాఖను నా దగ్గరే పెట్టుకుని, తెలంగాణ ప్రభుత్వ విద్యలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టాను. కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం విడుదల చేసిన ఫెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ లో తెలంగాణ మంచి స్థానాన్ని పొందింది. ఇది మా కృషి ఫలితం. తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటు నుంచి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల వరకు ప్రతి ప్రయత్నంలో విద్యా వ్యవస్థ బలోపేతం, విద్యార్థులకు నైపుణ్యం, పాఠశాలల్లో అత్యన్నత మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా పని చేస్తున్నాం. రాష్ట్రంలోని 65 ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా పునర్ వ్యవస్థీకరించాం. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. ఈ యూనివర్సిటీలో ఇప్పటివరకు 1,190 మంది విద్యార్థులు కోర్సులు పూర్తి చేశారు. వీరిలో 838 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించటం ఆనందంగా ఉంది. మైక్రోసాఫ్ట్, ఫ్లిప్‌కార్ట్, టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, ఏఐజీ హాస్పిటల్స్, అపోలో హాస్పిటల్స్ వంటి ప్రముఖ సంస్థల్లో వీరికి అవకాశాలు దక్కాయి.
మధ్యాహ్న భోజన పథకం విస్తరణ
ఇప్పటికే రాష్ట్రంలోని 1362 ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు అందుబాటులోకి తెచ్చాం. ఈ ఏడాది కొత్తగా 2769 స్కూళ్లలో ప్రీ ప్రైమరీ తరగతులు ఏర్పాటు చేస్తున్నాం. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ శాతం పెరుగుతుంది. ఈ ఏడాది రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ పథకాన్ని అమలు చేస్తాం. ప్రస్తుతం పాఠశాలల్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కాలేజీలకు విస్తరిస్తున్నాం. అన్ని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు డైట్ ఛార్జీలు 40 శాతం, కాస్మోటిక్ ఛార్జీలను 212 శాతం పెంచింది. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల అధ్వర్యంలో పాఠశాలల్లో రూ.706 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల పనులు చేపట్టాం. మంచిరేవుల గ్రామంలో యంగ్ ఇండియా పోలీస్ రెసిడెన్షియల్ స్కూల్ స్థాపించాం.
పేదల సొంత ఇంటికల
పేదవాళ్ల సొంతింతి కల సాకారానికి తొలి ఏడాదే రూ.22 వేల 500 కోట్లు కేటాయించి, 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశాం. గత ఏడాది ఫిబ్రవరిలో ఈ పథకం ప్రారంభించుకున్నాం. కేవలం 13 నెలల కాలంలోనే రాష్ట్రంలో లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తయింది. సెప్టెంబర్ 17వ తేదీ ప్రజా పాలన దినోత్సవం నాటికి మిగతా రెండు లక్షల ఇళ్లు పూర్తి చేస్తాం. దేశానికే ఇది ఆదర్శవంతమైన నమూనాగా నిలిచిందని చెప్పటానికి సంతోషంగా ఉంది.
ఈ ఆర్ధిక సంవత్సరానికి క్యూర్ పరిధిలో లక్ష ఇండ్లు, రాష్టంలోని ఇతర ప్రాంతాల్లో 2.50 లక్షల ఇండ్లు. మొత్తం 3.50 లక్షల ఇళ్ల మంజూరు చేశాం. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో మంజూరై… ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్న ఇండ్లను కూడా రెండో విడతలో పూర్తి చేయాలని నిర్ణయించాం. రాష్ట్ర అవతరణ దినోత్సవ కానుకగా నిన్న ఆసిఫాబాద్ జిల్లా, కెరమెరి మండలం, కొఠారి గ్రామంలో మలి విడత ఇందిరమ్మ ఇళ్ల పథకానికి పునాది రాయి వేశాం అని రేవంత్ రెడ్డి తెలిపారు.
పేదలందరికీ సన్నబియ్యం బువ్వ
పేదవాడికి సొంతిల్లు ఆత్మగౌరవం ఐతే, రేషన్ కార్డు ఆహార భద్రత. ఏళ్లకేళ్లుగా ఎదురుచూస్తున్న కుటుంబాల ఆకాంక్షను మా ప్రభుత్వం నెరవేర్చింది. రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల 12 వేల కొత్త కార్డులను జారీ చేశాం. ప్రస్తుత రేషన్ కార్డుల్లో 19 లక్షల 44 వేల కొత్త సభ్యుల పేర్లను చేర్చాం. తద్వారా రాష్ట్రంలో 3 కోట్ల 38 వేల మంది ఈరోజు సన్న బియ్యం భోజనం చేయగలుగే పరిస్థితి కల్పించాం.
ఆదర్శవంతమైన చట్టాలు…
ఈ ఆధునిక యుగంలో పిల్లలు కన్న తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యతలు స్వీకరించకుండా, వారిని వృద్ధాశ్రమాలలో చేర్పించి చేతులు దులుపుకుంటున్న తీరు తీవ్ర ఆవేదన కలిగిస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ విషయంలో ఏదో ఒకటి చేయాలన్న సంఘర్షణ నుంచి వచ్చిన ఆలోచనతో ఒక పటిష్ఠమైన, వృద్ధుల సామాజిక భద్రతకు భరోసా ఇచ్చే చట్టాన్ని రూపొందించాం. తల్లిదండ్రుల పోషణ జవాబుదారీతనం, పర్యవేక్షణకు చట్టం తెచ్చి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రజా ప్రతినిధులను ఇందులో చేర్చాం అని గుర్తు చేశారు. రాష్ట్రంలో సుమారు నాలుగు లక్షల మంది గిగ్ వర్కర్ల సంక్షేమానికి రాహుల్ గాంధీ గారి చొరవతో మన ప్రభుత్వం చేసిన చట్టం ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. 12 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న 73 రకాల ఉపాథిరంగాలకు చెందిన కార్మికులకు కనీస వేతనాలు నోటిఫై చేశాం అని, దీని ద్వారా స్కిల్డ్ వర్కర్లకు 25.9 శాతం మరియు అన్ స్కిల్డ్ వర్కర్లకు 34.95 శాతం వేతనాలు పెరిగినాయని కార్మిక సోదరులకు తెలియపరచడానికి సంతోషిస్తున్నానన్నారు.
పోరాట యోధుల గుర్తింపు
అమరవీరులు, పోరాటయోధులే తెలంగాణ రాష్ట్రం. వారి త్యాగాలకు విలువలేని లేని రాష్ట్రం జీవం లేని శరీరం లాంటిదని నేను భావిస్తాను. అందుకే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన యోధులను గుర్తించి, వారికి, వారి కుటుంబాలకు తగిన న్యాయం చేయాలన్న లక్ష్యంతో ఇటీవలే కె.కేశవరావు, కోదండరాం నాయకత్వంలో అధికారికంగా ఒక కమిటీని నియమించాం. ఆ కమిటీ నివేదిక ఆధారంగా తెలంగాణ పోరాట యోధులందరినీ సముచిత రీతిన సత్కరించి, వారిపట్ల మా చిత్తశుద్ధిని చాటుకుంటాం అన్నారు.
ఆదర్శవంతంగా కుల గణన
దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల గణన సర్వేను తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా చేపట్టింది. రాష్ట్రంలో కులాల వారీగా సర్వే వివరాలను వెల్లడించింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న జన గణనకు రాష్ట్రంలో చేపట్టిన సర్వే రోల్ మోడల్గా నిలిచిందని గర్వంగా ప్రకటిస్తున్నాను.
సామాజిక న్యాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని చట్టాన్ని ఆమోదించి, 59 షెడ్యూల్డ్ కులాలను 3 గ్రూపులుగా ఉపవర్గీకరించి అమలు కూడా ప్రారంభించింది. విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు అందించే బీసీ, ఎస్సీ ఎస్టీ చట్టాన్ని, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని కూడా ప్రభుత్వం ఆమోదించింది.
99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను పురస్కరించుకొని ముందస్తు పండుగగా మార్చి 6 నుంచి ఈనెల 12 వరకు రాష్ట్రమంతటా “ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక” 99 రోజుల పాటు ప్రజా ప్రభుత్వం నిర్వహించింది. పరిశుభ్రత, ఫైళ్ల సత్వర పరిష్కారం, ప్రజారోగ్యం, పోషకాహారం, రహదారి భద్రత, సామాజిక సంక్షేమం, బాలల రక్షణ, మాదక ద్రవ్యాల నివారణ, వ్యవసాయాభివృద్ధి, నాణ్యమైన విద్య, యువజన సాధికారత, క్రీడల ప్రోత్సాహం, మహిళల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణపై రాష్ట్రవ్యాప్తంగా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. సమగ్ర అభివృద్ధి, సామాజిక న్యాయం, భద్రత, సాధికారత, సుస్థిర ప్రగతి లక్ష్యాలతో ఈ కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది.
ఉద్యోగులకు రూ. కోటి బీమా పథకం
ప్రభుత్వ ఉద్యోగులు మాకు కుటుంబ సభ్యులతో సమానం అని, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు మొదటి తారీఖునే పడేలా నిర్ణయం తీసుకున్నాం. ఉద్యోగులు, పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న బిల్లులు, బకాయిల కోసం ప్రతినెలా అదనంగా వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాం. ఉద్యోగులకు కోటి రూపాయలతో ప్రత్యేక బీమా పథకాన్ని ప్రవేశపెట్టాం. వారికి ఆరోగ్య భద్రత, సామాజిక భద్రతను కల్పించే ఈ పథకం దేశ చరిత్రలోనే ఇదే మొదటిదని చెప్పేందుకు సంతోషిస్తున్నాను. ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ఉద్యోగులకు నగదు రహిత ఆరోగ్య పథకం (EHS) అమలు చేయబోతున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నానని తెలిపారు.
ఆరోగ్య సంరక్షణ లో ఆదర్శం
మాతా, శిశు మరణాల నిష్పత్తిని తగ్గించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోంది. రాష్ట్రంలో ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధికి ఇప్పటి వరకు దాదాపు రూ.11 వేల కోట్లు ఖర్చు చేశాం. వరంగల్ హెల్త్ సిటీ, సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీ నగర్ లో టిమ్స్, నిమ్స్ విస్తరణ, ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన నిర్మాణం, 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద కవరేజీని రూ.5 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచాం.
మాదకద్రవ్యాల కట్టడి
డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణం విషయంలో మేం చాలా పట్టుదలగా ఉన్నాం. సమాజాన్ని నిర్వీర్యం చేసే మత్తు పదార్ధాల విషయంలో ఎంతటి వారు ఉన్న ఉపేక్షించేది లేదు. దీని కోసం ప్రత్యేకంగా EAGLE (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్) ను ఏర్పాటు చేసిన విషయం మీకు తెలుసు. ఈగల్‌కి దాదాపు 59 వేల మంది యాంటీ డ్రగ్ సైనికులు మద్దతు ఇస్తున్నారు. ఇది మంచి ఫలితాలను ఇస్తోంది. షీ టీమ్స్, టీ-సేఫ్ సర్వీస్ ద్వారా మహిళల భద్రతకు ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని తెలిపారు.
మన సంస్కృతికి పెద్దపీట
పదేళ్లుగా నిలిచిపోయిన సినిమా అవార్డులను తిరిగి మనం ప్రారంభించుకున్నాం. మన సంస్కృతికి, మన అస్థిత్వానికి చిహ్నమైన ప్రజా గాయకుడు గద్దరన్న పేరుతో ఈ అవార్డులను ఇవ్వడం ద్వారా తెలంగాణ చరిత్రను, సంస్కృతిని సుసంపన్నం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇది గద్దరన్నకు ప్రజా ప్రభుత్వం సమర్పిస్తోన్న నివాళి కూడా. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించాం. గిరిజన ఆచారాలను, సంప్రదాయాలను కాపాడుతూ వన దేవతల గద్దెల పునర్నిర్మాణం చేసుకున్నాం. ఇటీవలే యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి క్షేత్రంలో ఆలయ అనుబంధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశాము. భద్రాచలం శ్రీరామాలయం అభివృద్ధి, వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి, బాసర జ్ఞానసరస్వతి ఆలయ అభివృద్ధి, కాళేశ్వరం ఆలయం అభివృద్ధి పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
ఇటీవలే సరస్వతి పుష్కరాలను ఘనంగా నిర్వహించుకున్నాం. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలకు బాసర నుండి భద్రాచలం వరకు గోదావరి నది ఒడ్డున ఉన్న ఆలయాలను అభివృద్ధి చేసేందుకు రూ.1000 కోట్ల నిధులు కేటాయించాం. తద్వారా టెంపుల్ టూరిజాన్ని ప్రోత్సహిస్తున్నాం. హజ్ యాత్రకు వెళ్లే ముస్లిం సోదరులపై ఇటీవల పడిన ఆర్థిక భారాన్ని ప్రజా ప్రభుత్వం భరిస్తుంది. మెదక్ చర్చి అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.
ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ ఆవిర్భావం తర్వాత మన దశ – దిశ ఏమిటన్న స్పష్టత లేదు. నలుగురు వ్యక్తుల ఆలోచనలే రాష్ట్ర భవిష్యత్ అన్నట్టుగా నాటి పరిస్థితి ఉండింది. అందుకే ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేధావుల మధనంతో తెలంగాణకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశాం. ఇది వచ్చే వందేళ్ల పాటు తెలంగాణ గమ్యాన్ని గమనాన్ని నిర్దేశిస్తుంది. తెలంగాణను దేశంలోనే కాదు, ప్రపంచానికే గేట్ వేగా నిలబెట్టే శక్తి “తెలంగాణ రైజింగ్ – 2047” ఈ ప్రణాళికకు ఉంది.2034 నాటికి వన్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ సంకల్పమే ఈ ప్రణాళిక అని స్పష్టం చేశారు.
క్యూర్-ప్యూర్-రేర్ మోడల్
రాష్ట్రం మొత్తానికి ఒకటే మాస్టర్ ప్లాన్ అన్నది నాకు తెలిసి దేశంలోనే ఎక్కడా లేదు. ఈ ఆలోచనకు తెలంగాణనే నాంది. “తెలంగాణ రైజింగ్ – 2047” విజన్ డాక్యుమెంట్ లో క్యూర్ (CURE) -ప్యూర్ (PURE)-రేర్ (RARE) గా రాష్ట్రాన్ని వర్గీకరించాం. అభివృద్ధికి మూడంచెల వ్యూహాన్ని అనుసరిస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రాంతాన్ని క్యూర్ గా పరిగణిస్తాం. దీనిని ప్రపంచ స్థాయి సర్వీసెస్ హబ్ గా తీర్చిదిద్దుతున్నాం. ఇప్పటి వరకు ఉన్న హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)ని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లుగా పునర్వవ్యస్థీకరించాం. పోలీసు వ్యవస్థ పరిధినిహైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌తో పాటు, సైబరాబాద్, మల్కాజ్‌గిరి, కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లుగా మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని పునర్వవ్యస్థీకరించాం. ఈ ప్రాంతాన్ని పూర్తి పర్యావరణహితంగా, కాలుష్య రహితంగా తీర్చిదిద్దడమే ఈ ప్రణాళిక లక్ష్యం. కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను ఔటర్ రింగు రోడ్డు బయటకు తరలించేందుకు హిల్ట్ పాలసీ తీసుకువచ్చాం. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈవీలకు లైఫ్ టాక్స్ తో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్డు టాక్స్ లలో మినహాయింపు ఇస్తున్నాం అని తెలిపారు.
చెరలోని చెరువులు కుంటలకు విముక్తి
హైదరాబాద్ నగరానికి ఒకప్పుడు సిటీ ఆఫ్ లేక్స్ అండ్ రాక్స్ అనే పేరుంది. కాల క్రమంలో చెరువులు, కుంటలన్నీ ఆక్రమణలు, కబ్జాలకు గురయ్యాయి. కోర్ అర్బన్ ఏరియాలో ఉన్న సరస్సులు, చెరువులు, ట్యాంకులను పునరుద్ధరించే బాధ్యతను హైడ్రాకు అప్పగించాం. ఇప్పటివరకు దాదాపు రూ.60 వేల కోట్ల విలువైన 1045 ఎకరాలకు పైగా ఆక్రమణ, కబ్జాలకు గురైన చెరువు భూములు, ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నాం. ఇవి ఇకపై ప్రజల ఆస్తిగా కొనసాగుతాయని గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మెట్రో
కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వం తన ఆస్తులను అమ్ముకోవడమే తప్ప కొత్త ఆస్తులను సృష్టించింది లేదు. ప్రజా ప్రభుత్వం ఆ పద్ధతికి స్వస్తి చెప్పింది. తొలి సారి ప్రైవేటు నుంచి ఆస్తులను ప్రభుత్వ పరం… అంటే ప్రజల ఆస్తిగా మార్చింది. ప్రతిష్ఠాత్మక హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును ఎల్ అండ్ టీ నుంచి కొనుగోలు చేసి, ప్రజల ఆస్తిగా మార్చాం. ఫోర్త్ సిటీ నిర్మాణం, నగర విస్తరణ, పెరుగుతున్న ట్రాఫిక్, ఎయిర్ పోర్ట్ కనెక్టివిటీ అవసరాలు దృష్టిలో పెట్టుకొని ఫేజ్ 2 లో ఏడు కారిడార్లలో 122.9 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరించే ప్రతిపాదనలతో తయారు చేసిన డీపీఆర్ ను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాం.
మూసీ పునరుజ్జీవనం
హైదరాబాద్ స్వచ్ఛమైన, పర్యావరణహితమైన నగరంగా ఉండాలి. అప్పడే ప్రపంచానికి ఆదర్శంగా మనం నిలబడే అవకాశం ఉంటుంది. ఉపాధి, ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం మిళితమైన అభివృద్ధి మనకు అవసరం.
ఆ దిశగా చేసిన ఆలోచనే మూసీ ప్రక్షాళన. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాల నుంచి గాంధీ సరోవర్ వరకు ఫేజ్-1 ప్రాజెక్టుగా మూసీ ప్రక్షాళన చేస్తున్నాం. మూసీ ప్రాజెక్టులో భాగంగానేగోదావరి ఫేజ్ -2, ఫేజ్`3 పనులు వేగంగా జరుగుతున్నాయి. గోదావరి జలాలను ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు అనుసంధానించి 2.5 టీఎంసీల నీటిని మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు తరలిస్తారు. దీంతో సిటీలో సరిపడే తాగునీరు అందుతుంది. ఇటీవలే మంచిరేవుల వద్ద 1200 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ వీర భద్రేశ్వరాలయం ఉన్నచోట శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయ పునర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నాం. మత సామరస్యానికి ప్రతీకగా మాసీ పరివాహకంలో మసీదు, చర్చి, గురుద్వారా నిర్మించేలా ప్రణాళికలు తయారయ్యాయని తెలిపారు.
ప్యూర్ మోడల్
ఔటర్ రింగ్ రోడ్ తరహాలో రీజినల్ రింగ్ రోడ్ నిర్మించుకుంటున్నాం. ఈ రెండింటి మధ్య ఉన్న ప్యూర్ (పెరి-అర్బన్ రీజియన్ ఎకానమీ) ప్రాంతాన్ని ఇన్‌ఫ్రాస్ట్రక్షర్, మాన్యూఫాక్చరింగ్ హబ్ గా తీర్చిదిద్దుతాం. ప్రధానంగా ఈ ప్రాంతంలో తయారీ పరిశ్రమలు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఎకో-ఇండస్ట్రియల్ పార్కులు, లాజిస్టిక్స్ కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుంది. 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీగా ఏర్పాటు చేస్తున్నాం. శంషాబాద్‌ను బుల్లెట్ రైలు కేంద్రంగా అభివృద్ధి చేయటం ద్వారా రీజనల్ కనెక్టివిటీ బలోపేతం అవుతుంది.
రేర్ మోడల్
ఇది తెలంగాణ డీఎనఏకి గుండె కాయ. వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఈ జోన్ పరిధిలోకి వస్తాయి. త్రిబుల్ ఆర్ నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు ఈ ప్రాంతం ఉంటుంది. సాగునీరు, వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి, వ్యవసాయ పరిశోధనలు, పంటల వైవిద్యం ఇత్యాది అంశాలు ఈ పరిధిలో ఏర్పాటయ్యే పరిశ్రమలు, పరిశోధన కేంద్రాల ద్వారా జరుగుతాయి. రైతులను శ్రీమంతులను చేసే కార్యచరణ ఇందులో ప్రధానంగా ఉంటుంది.
విమానాశ్రయాల అభివృద్ధి
రాష్ట్రంలోని వరంగల్, ఆదిలాబాద్‌లో విమానాశ్రయాల ఏర్పాటుకు మనం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఆమోదం పొందాం. ఈ విమానాశ్రయాలను వేగంగా నిర్మించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వరంగల్ విమానాశ్రయ అభివృద్ధికి అవసరమైన మొత్తం 950 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అప్పగించింది. త్వరలోనే ఈ ఎయిర్ పోర్ట్ అభివృద్ది పనులు ప్రారంభమవుతాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్
ప్రతి ఏటా జనవరిలో దావోస్ వెళ్లి పెట్టుబడుల ఆకర్షణకు తెలంగాణను ప్రమోట్ చేయడమే కాక… దావోస్ తరహా పెట్టుబడుల సదస్సు పెట్టాలన్నది మన ప్రభుత్వం ఆలోచన. దానికి తొలి ప్రయత్నంగానే గత ఏడాది డిసెంబర్ లో రెండు రోజుల పాటు తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాం. ఈ సదస్సు ద్వారా దాదాపు రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం. పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలకు ఇది నాంది పలికింది. ఇటీవల SAFRON – CFM ఇంటర్‌నేషనల్ ఏరో ఇంజిన్ ఎంఆరఓ ఫెసిలిటీ హైదరాబాద్లో నెలకొల్పడం తెలంగాణ పారిశ్రామిక పురోగతికి నిదర్శనం. ఇటీవలే హైదరాబాద్లో 23వ బయో ఏషియా 2026 అంతర్జాతీయ సదస్సును మన ప్రభుత్వం నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంచనాల్లో తెలంగాణ రాష్ట్రం టాప్ అచీవర్ గా నిలవడం హర్షణీయం అన్నారు.
కొత్తగా 5 లక్షల ఉద్యోగాల కల్పన
ఇప్పుడు తెలంగాణ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (GCC) హబ్ గా మారుతోంది. దేశంలోని జీసీసీల్లో దాదాపు 20 శాతం హైదరాబాద్లోనే ఉన్నాయి. నాస్కామ్ జియో ల్యాండ్ స్కేప్ రిపోర్ట్ 2026 ప్రకారం, గత ఏడాది దేశంలో కొత్తగా ఏర్పాటైన బీఎఫ్ఎస్ఐ జీసీసీల్లో 50 శాతం హైదరాబాద్‌ను ఎంచుకున్నాయి. ఇది మన విజయాలను కొత్త శిఖరాలకు చేర్చుతోంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు తెలంగాణ టూరిజం పాలసీని రూపొందించుకున్నాం. దీంతో దాదాపు మూడు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దావోస్లో న్యూ నెక్ట్స్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీని ఆవిష్కరించుకున్నాం. 2030 నాటికి తెలంగాణ టాప్ లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో ఒకటిగా నిలబెట్టాలనేది లక్ష్యం. దీంతో రాబోయే రోజుల్లో 5 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి.
ప్రపంచానికే తెలంగాణను గేట్‌వే
దేశంలోనే కాదు… ప్రపంచానికే తెలంగాణను గేట్‌వే గా నిలబెట్టాలన్నది నా స్వప్నం. దానికి మార్గం తెలంగాణ రైజింగ్ – 2047 డాక్యుమెంట్. 2034 నాటికి వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా, 2047 నాటికి త్రి ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తెలంగాణ ఉండాలన్నది ప్రజా ప్రభుత్వ సంకల్పం. దానికి ప్రజల అండదండలు కావాలి. మీ అందరి సహకారం. ఆశీర్వాదంతో ఈ లక్ష్యాన్ని చేరుకుంటామన్న విశ్వాసం నాకు ఉంది. ఈ ఆర్థిక వృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, తెలంగాణ అభివృద్ధికి పునరంకితం కావాలని కోరుకుంటున్నానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.