తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాల కోసం TG EAPCET 2026 రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ రేపటి నుంచి అందుబాటులోకి వస్తోంది. సాంకేతిక విద్యాశాఖ తాజాగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించింది.మొదటి విడతలో భర్తీ కాని 27,487 సీట్లను రెండో విడతలో భర్తీ చేస్తారు. అర్హత ఉన్న విద్యార్థులు నిర్ణీత సమయంలోపు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. మొదటి విడతలో 60,300 మంది అభ్యర్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయగా… మిగిలిన సీట్ల భర్తీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ జూలై 17న ప్రారంభమై 22వ తేదీన తాత్కాలిక సీట్ల కేటాయింపుతో ముగుస్తుంది.జూలై 17 నుంచి ప్రాసెసింగ్ ఫీజు, స్లాట్ బుకింగ్ చేసుకోవాలని, జూలై 18న సర్టిఫికెట్ వెరిఫికేషన్, జూలై 18–19 వెబ్ ఆప్షన్ల నమోదు, జూలై 22న తాత్కాలిక సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపింది. వెబ్ ఆప్షన్ల నమోదు పూర్తయిన తర్వాత అధికారులు డేటాను విశ్లేషిస్తారు. అనంతరం జూలై 22న తాత్కాలిక సీట్ల కేటాయింపును అధికారిక వెబ్ సైట్ లో పొందుపరుస్తారు. సీటు పొందిన విద్యార్థులు నిర్ణీత గడువులోగా ట్యూషన్ ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాలని విద్యాశాఖ సూచించింది. మొదటి విడతలో సీటు రాని వారు లేదా నచ్చిన కాలేజీ రాని వారు ఈ రెండో విడతను ఉపయోగించుకోవచ్చు. తాజా అప్డేట్స్ కోసం అధికారిక వెబ్ సైట్ ను క్రమం తప్పకుండా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇంజినీరింగ్ తొలి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థుల్లో 60,300 మంది మాత్రమే కాలేజీల్లో చేరేందుకు ఆసక్తి చూపారు. వీరంతా ఆన్‌లైన్ ద్వారా ఫీజులు చెల్లించి, వెబ్‌సైట్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. నిజానికి ఈడబ్ల్యూఎస్ (EWS) కోటా కలుపుకొని రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 88,053 బీటెక్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటి కోసం 88,510 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు.
ఈ విద్యా సంవత్సరం (2026-27) దేశవ్యాప్తంగా సాంకేతిక విద్యా ప్రమాణాలను పర్యవేక్షించే ఏఐసీటీఈ (AICTE) తెలంగాణకు అదనంగా మరో 15 వేల బీటెక్ సీట్లను మంజూరు చేసింది. ముఖ్యంగా డిమాండ్ ఉన్న కంప్యూటర్ సైన్స్, ఐటీ అనుబంధ కోర్సుల్లో ఈ సీట్లు పెరిగాయి. అయితే…. ఈ అదనపు సీట్లను ప్రస్తుత కౌన్సెలింగ్‌లో చేర్చాలా లేదా అనే అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనిపై విద్యాశాఖ ఉన్నతాధికారులు గురువారం ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా సమావేశమై చర్చించనున్నారు. సీఎం ఆమోదం తెలిపితే ఈ 15 వేల సీట్లు కూడా రెండో విడత లేదా తదుపరి విడత కౌన్సెలింగ్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.