జార్ఖండ్ లో భారీగా మావోయిస్టుల లొంగుబాటు

జార్ఖండ్‌లో 27 మంది మావోయిస్టులు భారీగా లొంగిపోయారు. కీలక నేతలతో పాటు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పోలీసులకు అప్పగించారు.

జార్ఖండ్ లో భారీగా మావోయిస్టుల లొంగుబాటు

జార్ఖండ్‌లో రాష్ట్రంలో గురువారం భారీ స్థాయిలో మావోయిస్టులు లొంగిపోయారు. మొత్తం 27 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు రాష్ట్ర డీజీపీ మిశ్రా మీడియాకు వెల్లడించారు. లొంగిపోయిన వారిలో మావోయిస్టు పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు మిసిర్‌ బిశ్రాతో పాటు కీలక నాయకులు, కమిటీ సభ్యులు, స్క్వాడ్ సభ్యులు ఉన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో జరిగిన ఎన్‌కౌంటర్లలో 22 మంది మావోయిస్టులు మరణించగా.. 44 మందిని అరెస్టు చేసినట్లు, 29 మంది లొంగిపోయినట్లుగా డీజీపీ తెలిపారు. రాష్ట్రంలోని మిగతా మావోయిస్టులు కూడా వీలైనంత త్వరగా లొంగిపోవాలని ఆయన కోరారు.

తాజాగా జరిగిన మావోయిస్టుల లొంగుబాటు రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద సామూహిక మావోయిస్టుల లొంగుబాటుగా డీజీపీ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “నవజీవన్” ఆపరేషన్, పునరావాస విధానం కారణంగా అనేక మంది మావోయిస్టులు తిరిగి ప్రధాన స్రవంతిలోకి రావడానికి ముందుకు వస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. లొంగిపోయిన వారిలో ఆరుగురు స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు (SZCM), ఆరుగురు ఏరియా కమిటీ సభ్యులు (ACM), 13 మంది స్క్వాడ్ సభ్యులు ఉన్నారు. అదనంగా, జార్ఖండ్ జన్ ముక్తి పరిషత్ (JJMP)కు చెందిన ఇద్దరు కార్యకర్తలు ఉన్నారని వివరించారు

లొంగిపోయిన మావోయిస్టులు 17 ఆయుధాలు, దాదాపు 3,000 రౌండ్ల మందుగుండు సామగ్రిని అప్పగించారు. వీరు ముఖ్యంగా కోల్హాన్, సరందా అటవీ ప్రాంతాల్లో చురుకుగా పనిచేసేవారని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతాలు మావోయిస్టులకు ఆశ్రయ కేంద్రాలుగా ఉన్నాయని, అక్కడి అడవులు, కొండ ప్రాంతాలపై వారికి విస్తృత పరిజ్ఞానం ఉందని పేర్కొన్నారు.

రాష్ట్ర పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కోబ్రా బెటాలియన్లు, జార్ఖండ్ జాగ్వార్ దళాలు సంయుక్తంగా మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. నిరంతర భద్రతా చర్యలు, సంస్థలో అంతర్గత విభేదాలు, పెరుగుతున్న ఒత్తిడి వంటి కారణాలతో అనేక మంది కేడర్లు తిరిగి సాధారణ జీవితంలోకి రావాలని నిర్ణయించుకుంటున్నారని పోలీసులు తెలిపారు.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతను బలోపేతం చేసేందుకు సరందా ప్రాంతంలో 21 కొత్త అడ్వాన్స్‌డ్ క్యాంప్ లొకేషన్లు (ACLలు), ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్‌లు (FOBలు) ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. హింసను విడనాడి ప్రభుత్వ పునరావాస పథకాల ప్రయోజనాలను పొందాలని మిగిలిన మావోయిస్టులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ భారీ లొంగుబాటు జార్ఖండ్‌లో మావోయిస్టు ప్రభావం తగ్గుతున్నదానికి సంకేతంగా భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

ట్రెండింగ్.. పీవీ సింధూ “టెంపుల్” క్లిప్ !
ఆదాయ వేటలో తెలంగాణ సర్కార్‌ తొలి అడుగు.. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ విలువ భారీగా పెంపు