బర్సా సహా 20మంది మావోయిస్టుల లొంగుబాటు : తెలంగాణ డీజీపీ వెల్లడి

పీఎల్జీఏ మిలటరీ చీఫ్ బర్సా అలియాస్ దేవా సహా 20మంది మావోయిస్టులు తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు. భారీగా ఆయుధాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు.

బర్సా సహా 20మంది మావోయిస్టుల లొంగుబాటు : తెలంగాణ డీజీపీ వెల్లడి

విధాత, హైదరాబాద్ : మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ మిలటరీ చీఫ్ బర్సే సుక్కా అలియాస్ దేవా, దర్శన్ సహా 17మంది మావోయిస్టులు శనివారం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. హిడ్మా స్వగ్రామానికి చెందిన దేవా 2003లో మావోయిస్టు పార్టీలో చేరి మిలటరీ యూనిట్ చీఫ్ గా ఎదిగాడని, అతడిపై రూ.75లక్షల రివార్డు ఉందని డీజీపీ తెలిపారు. అతనితో పాటు మొత్తం 17మంది చత్తీస్ గఢ్ కు చెందిన వారేనని తెలిపారు. వారంతా డీకేజడ్ ఎస్, సౌత్ సబ్ జోనల్ లో పనిచేస్తున్నారన్నారు.

వారితో పాటు పెద్దపల్లి జిల్లా కిష్టాపురం గ్రామానికి చెందిన తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్ కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్, ఆయన భార్య విశాఖ పట్నం అరిలోయకు చెందిన అడ్లూరి ఈశ్వరీలు, హన్మకొండ హసన్ పర్తికి చెందిన దార సారయ్య(అర్బన్ పార్టీ సభ్యుడు) కూడా లొంగిపోయారని డీజీపీ వెల్లడించారు. కంకణాల రాజిరెడ్డి 1997లో మావోయిస్టు పార్టీలో చేరాడని తెలిపారు.
లొంగిపోయిన మావోయిస్టులతో పాటు 8 ఏకే 47, రెండు ఎంఎల్జీస్ తుపాకులు, ఇతర ఆయుధాలు కూడా అప్పగించారని తెలిపారు. రూ.20 లక్షల నగదు కూడా వారి నుంచి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. తాజా లొంగుబాటుతో పీఎల్జీఏ బెటాలియన్ పూర్తిగా కనుమరుగైందని, 400మందిపైగా ఉన్నారని, వారిలో సరెండర్, అరెస్టులు, ఎన్ కౌంటర్ల ద్వారా క్షిణించిపోగా ప్రస్తుతం 64మంది ఉన్నారని తెలిపారు. తెలంగాణ స్టేట్ కమిటీ కూడా మొత్తం కనుమరుగైందని, ప్రస్తుతం ఒక్క స్టేట్ కమిటీ సభ్యుడు మాత్రమే పార్టీలో ఉన్నారన్నారు.

రెండేళ్లలో తెలంగాణ పోలీస్ వద్ద 567మంది లొంగిపోయారన్నారు. తెలంగాణకు చెందిన వారు 52మంది ఉన్నారని రికార్డులు ఉన్నాయని, వారిలో చనిపోయిన వారు..ఉద్యమం వీడి వెళ్లిపోయిన వారిని తీసివేస్తే…ప్రస్తుతం వాస్తవంగా 17మంది మాత్రమే ఉన్నారని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. మిగిలిన వారు కూడా త్వరగా లొంగిపోవాలని డీజీపీ కోరారు.

ఇవి కూడా చదవండి :

Donald Trump : అమెరికా సైన్యం అదుపులో వెనుజులా అధ్యక్షుడు
Uttam Kumar Reddy : అసెంబ్లీలో కృష్ణాజలాలపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింగ్ ప్రజెంటేషన్ షురూ