మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ బందోబస్తు : డీజీపీ శివధర్ రెడ్డి
రాష్ట్రంలో బుధవారం నిర్వహించే మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేశామని డీజీపీ శివధర్ రెడ్డి మీడియాకు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేకంగా అదనపు బలగాలను మోహరింప చేశామని వివరించారు.
విధాత, హైదరాబాద్:
రాష్ట్రంలో 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు బుధవారం పోలింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర డీజీపీ బీ శివధర్‌రెడ్డి చెప్పారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల బందోబస్తుకు తీసుకున్న చర్యలను వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8,203 పోలింగ్ కేంద్రాల్లో పకడ్బందీ భద్రత కల్పించామని తెలిపారు. ఇందులో 1,302 కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా, 1,926 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించామని, ఈ కేంద్రాల్లో అదనపు బలగాలను మోహరించామని డీజీపీ తెలిపారు. పారదర్శకత కోసం అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ 100 శాతం వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్రం వెలుపల కూడా నిఘా కెమెరాల ద్వారా పర్యవేక్షణకు ఏర్పాట్లు చేశామన్నారు. శాంతిభద్రతలను పరిరక్షించేందుకు దాదాపు 3 వేల మంది అదనపు బలగాలను రంగంలోకి దించామని డీజీపీ చెప్పారు. ఇందులో టీజీఎస్పీతో పాటు అటవీ, ఎక్సైజ్, సీఐడీ, లీగల్ మెట్రాలజీ విభాగాల సిబ్బంది కూడా ఉన్నారని ఆయన వివరించారు. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచే ప్రచారం ముగిసి, సైలెంట్ పీరియడ్ అమల్లోకి వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం విజిబుల్ పోలీసింగ్‌ను పెంచి గస్తీని ముమ్మరం చేసినట్లు డీజీపీ శివధర్‌రెడ్డి చెప్పారు.
గత నెల 27వ తేదీన ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన దగ్గర నుంచీ పోలీసులు రికార్డు స్థాయిలో తనిఖీలు నిర్వహించారని డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు. ఈ తనిఖీల్లో మొత్తం రూ. 3.09 కోట్ల విలువైన నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇందులో రూ. 1.29 కోట్ల నగదు, రూ. 1.21 కోట్ల విలువైన మద్యం, రూ. 15.7 లక్షల విలువైన మాదకద్రవ్యాలు, రూ. 28.69 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు ఉన్నాయని డీజీపీ వివరించారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు పొరుగు రాష్ట్రాల సరిహద్దుల్లో 20 చెక్ పోస్టులను, జిల్లాల సరిహద్దుల్లో 55 చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని, అక్కడ నిరంతరం నిఘా ఉంచుతున్నామని వివరించారు.
మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు సాగుతున్నాయని డీజీపీ వెల్లడించారు. ఈ ప్రాంతాల్లో 181 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 167 స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ విధుల్లో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1,183 లైసెన్స్డ్ ఆయుధాలను ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా డిపాజిట్ చేయించామని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న 4,318 మందిని బైండోవర్ చేశామని చెప్పారు. వివిధ కేసుల్లో పెండింగ్‌లో ఉన్న 398 నాన్ బెయిలబుల్ వారెంట్లను అమలు చేశామని వివరించారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి ఇప్పటివరకు 142 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయని తెలిపారు. ఎన్నికల నిర్వహణ విషయంలో క్షేత్రస్థాయి అధికారులకు ఇప్పటికే పూర్తిస్థాయిలో శిక్షణ అందించామని చెప్ఇపారు. ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు లొంగ వద్దని కోరారు. భయం లేకుండా తమ రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో లా అండ్ ఆర్డర్ అదనపు డీజీపీ మహేష్ భగవత్ తదితరులు పాల్గొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram