Yasangi Raitu Bharosa funds| రైతు భరోసాకు లైన్ క్లియర్..ఎన్నికల నియమావళి ఎత్తివేత

2026 మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ల రెండో సాధారణ ఎన్నికల సమయంలో అమలులోకి వచ్చిన ఆదర్శ ప్రవర్తనా నియమావళి ఎత్తివేసినట్లుగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో రైతులకు యాసంగి రైతు భరోసా నిధులను ఖాతాలలో జమ చేసేందుకు మార్గం సుగమమైంది.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Feb 17, 2026, 5:35 pm IST
Read Time: 3 mins
Yasangi Raitu Bharosa funds| రైతు భరోసాకు లైన్ క్లియర్..ఎన్నికల నియమావళి ఎత్తివేత

విధాత, హైదరాబాద్ : తెలంగాణలోని 116మున్సిపాల్టీలు, 7 కార్పోరేషన్ల ఎన్నికల నిర్వహణలో భాగంగా 2026 మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ల రెండో సాధారణ ఎన్నికల సమయంలో అమలులోకి వచ్చిన ఆదర్శ ప్రవర్తనా నియమావళి ఎత్తివేసినట్లుగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 27జనవరి 1న ఎన్నికల నోటిఫికేషన్ జారీ నుంచి ఫిబ్రవరి 17వ తేదీ వరకు అమలులో ఉన్న ఎన్నికల ప్రవర్తన నియమావళి ఎత్తివేసినట్లుగా అధికారిక ఉత్తర్వలలో పేర్కొంది.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల సందర్బంగా విధించిన ఎన్నికల ప్రవర్తన నియమావళి ఎత్తివేసిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా ఎన్నికల తర్వాత రైతులకు యాసంగి రైతు భరోసా నిధులను ఖాతాలలో జమ చేసేందుకు మార్గం సుగమమైంది. ఇప్పటికే ఖరీఫ్ సన్న ధాన్యంపై రూ.514.36 కోట్లు బోనస్ పెండింగ్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. రేపోమాపో రైతు భరోసా నిధులు కూడా ప్రభుత్వం వేస్తుందని తెలుస్తుంది. ఖరీఫ్, యాసంగి సీజన్‌లలో రెండు విడతల్లో ఎకరాకు రూ.6వేల చొప్పున రూ.12వేలను రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది.

రాష్ట్రంలో ఖరీఫ్‌ సీజన్‌లో 69,39,548 మంది రైతులకు ఎకరానికి రూ.6వేల చొప్పున రూ.8,744.13 కోట్లు రైతు భరోసా కింద ఇచ్చారు. దాదాపు 1,45,73,000 ఎకరాలకు నిధులు అందించారు. ఈ యాసంగిలోనూ గత ఖరీఫ్ లో ఇచ్చిన మేరకు కోతలు లేకుండా రైతు భరోసా వేస్తామని ప్రభుత్వం ఇటీవల స్పష్టత ఇచ్చింది. రైతు భరోసా కోసం ప్రభుత్వం రూ.9వేల కోట్ల నిధుల సమీకరణతో సిద్దమైంది. మున్సిపల్ ఎన్నికల కోడ్ పూర్తిని వెంటనే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని సీఎం రేవంత్ ఆర్దిక శాఖ అధికారులకు తాజాగా నిర్దేశించారు.