ఈ-రిక్షా డ్రైవర్లకు కేంద్రం భారీ ఊరట..చైనా యాప్ లపై వేటు!

దేశ రాజధాని న్యూఢీల్లీలో ఈ-రిక్షా డ్రైవర్లను, డీలర్లను తిప్పలు పెడుతున్న చైనా యాప్ లపై కేంద్రం వేటువేసింది. స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి ఈ-రిక్షాలను షట్‌డౌన్‌ చేస్తున్న వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మార్గమధ్యంలో ఆటోల నిలిపివేతకు కారణమవుతున్న మూడు చైనా యాప్‌లను గుర్తించి..వాటిని యాపిల్‌ యాప్‌ స్టోర్‌, గూగుల్ ప్లేస్టోర్‌ నుంచి తొలగింపునకు ఆదేశాలు ఇచ్చింది.

Reported by: Y.V. Narsimha Reddy | జాతీయం | Jul 03, 2026, 3:55 pm IST
Read Time: 3 mins
ఈ-రిక్షా డ్రైవర్లకు కేంద్రం భారీ ఊరట..చైనా యాప్ లపై వేటు!

న్యూఢిల్లీ : దేశ రాజధాని న్యూఢీల్లీలో ఈ-రిక్షా డ్రైవర్లను, డీలర్లను  తిప్పలు పెడుతున్న చైనా యాప్ లపై కేంద్రం వేటువేసింది. స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి ఈ-రిక్షాలను షట్‌డౌన్‌ చేస్తున్న వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మార్గమధ్యంలో ఆటోల నిలిపివేతకు కారణమవుతున్న మూడు చైనా యాప్‌లను గుర్తించి..వాటిని యాపిల్‌ యాప్‌ స్టోర్‌, గూగుల్ ప్లేస్టోర్‌ నుంచి తొలగింపునకు ఆదేశాలు ఇచ్చింది. ఈ -రిక్షాలను నడిరోడ్డుపై షట్‌డౌన్‌ చేస్తున్నట్లు వీడియోలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ యాప్స్‌ను తొలగించింది.

ఈ-రిక్షాల బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ (BMS)లోని వోల్టేజ్, ఉష్ణోగ్రత, కరెంట్ వంటి వివరాలను తెలుసుకోవడానికి BAT-BMS వంటి చైనీస్ మొబైల్ యాప్‌ను ఉపయోగిస్తారు. దీనికి ఎలాంటి పాస్‌వర్డ్‌, సెక్యూరిటీ అథంటికేషన్ లేకపోవడం వల్ల బ్లూటూత్ రేంజ్‌లో ఉన్న వారు ఎవరైనా సరే ఆపరేట్ చేయొచ్చు. కేవలం ఒక్క ట్యాప్‌తో వాహనానికి పవర్ సప్లయ్‌ కాకుండా నిలిపివేయవచ్చు. దీంతో రోడ్డుపై వెళ్తున్న ఈ-రిక్షాలను యాప్ ద్వారా రిమోట్‌గా ఆఫ్ చేస్తూ డ్రైవర్లను ఇబ్బందులు పెడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. తమ స్మార్ట్‌ఫోన్‌ ద్వారా ఆపరేట్‌ చేస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. Lossigy, Epoch Li-ion అనే మరో రెండు బ్యాటరీ మేనేజ్‌మెంట్ యాప్‌లో కూడా ఇలాంటి లోపమే ఉన్నట్లు తేలింది. ఈ తరహా యాప్స్‌ను నిషేధించాలంటూ బీజేపీ నేత తజిందర్ బగ్గా ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మూడు యాప్స్‌ను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.