హైలైట్స్:
- టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం ముగింపు
- గూగుల్ ప్లే స్టోర్‌లో మళ్లీ యాప్
- యాపిల్ యాప్‌స్టోర్‌లో మాత్రం లేదు
- జూన్ 30 వరకు ఎడిట్ ఫీచర్ ఆంక్షలు
న్యూఢిల్లీ: నీట్ పరీక్షల నేపథ్యంలో వివాదాల్లో చిక్కుకున్న మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ నేడు మళ్లీ గూగుల్ ప్లే స్టోర్‌లో ప్రత్యక్షమైంది. కేంద్ర ప్రభుత్వం విధించిన తాత్కాలిక నిషేధం జూన్ 22 అర్ధరాత్రితో ముగియడంతో మంగళవారం ఉదయం నుంచి గూగుల్ ఆండ్రాయిడ్ యూజర్లకు టెలిగ్రామ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
అయితే యాపిల్ యాప్ స్టోర్‌లో ఇంకా టెలిగ్రామ్ అందుబాటులోకి రాలేదు. దీనిపై యాపిల్ నుంచి ఎటువంటి అధికారిక సమాచారం కూడా లేదు.
నీట్ పరీక్ష వివాదంతో నిషేధం
నీట్ పరీక్షలకు సంబంధించిన నకిలీ ప్రశ్నపత్రాలు, తప్పుదారి పట్టించే సమాచారం, మోసపూరిత కార్యకలాపాలు టెలిగ్రామ్ ద్వారా వ్యాపిస్తున్నాయన్న ఆందోళనల నేపథ్యంలో కేంద్రం ఈ తాత్కాలిక చర్య తీసుకుంది.
జూన్ 3న కేంద్ర ప్రభుత్వ అధికారులు టెలిగ్రామ్ ప్రతినిధులతో సమావేశమై ఈ అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం. ఆ తర్వాత టెలిగ్రామ్ యాప్‌తో పాటు దాని వెబ్ వెర్షన్, సంబంధిత లింకులపై జూన్ 22 వరకు తాత్కాలికంగా ఆంక్షలు విధించారు.
జూన్ 30 వరకు మరో నిబంధన

తాత్కాలిక నిషేధం ముగియడంతో గూగుల్ ప్లే స్టోర్‌లో మళ్లీ కనిపించిన టెలిగ్రామ్ యాప్
టెలిగ్రామ్ పూర్తిగా తిరిగి అందుబాటులోకి వస్తున్నప్పటికీ, మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌పై మాత్రం జూన్ 30 వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి. పరీక్షల సమయంలో తప్పుడు సమాచారం మార్పులు, పాత మెసేజ్‌ల ఎడిటింగ్ ద్వారా గందరగోళం సృష్టించే అవకాశం ఉందన్న కారణంతో ఈ షరతు విధించినట్లు తెలుస్తోంది.
జూన్ 21న నీట్ రీ-ఎగ్జామ్ నిర్వహించగా, ఇప్పటివరకు పెద్ద ఎత్తున మోసపూరిత ఘటనలు నమోదుకాలేదని వర్గాలు చెబుతున్నాయి.
టెలిగ్రామ్ నిషేధం వెనుక కుట్ర : సీఈఓ దురోవ్
టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ దురోవ్ భారత ఐటీ మంత్రిత్వ శాఖ చర్యపై తీవ్రంగా స్పందించారు. కొందరు యూజర్లు లీకైన పరీక్ష ప్రశ్నలను పంచుకున్నారన్న కారణంతో మొత్తం టెలిగ్రామ్‌ను నిషేధించడం సరైన చర్య కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ నిషేధం వెనుక వ్యాపార పోటీదారుల(వాట్సప్) ఒత్తిడి ఉండొచ్చని కూడా దురోవ్ ఆరోపించారు.రిలయెన్స్‌లో మెటాకు పాక్షిక వాటా ఉందని, తద్వారా తమ యాప్‌కు మేలు చేసేందుకే ఈ కుట్ర జరిగిఉండవచ్చని ఆయన అనుమానం వెలిబుచ్చారు. అయితే ప్రభుత్వం మాత్రం పరీక్షల సమగ్రతను కాపాడేందుకే ఈ తాత్కాలిక నిర్ణయం తీసుకున్నట్లు వర్గాలు చెబుతున్నాయి.