విద్యార్థులపై కేసులు పెట్టొద్దు..దీక్ష విరమిస్తా : వాంగ్ చుక్

నీట్ (NEET) పేపర్ లీకేజీ అక్రమాలపై నిరాహార దీక్షలో ఉన్న ప్రముఖ పర్యావరణ వేత్త, సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ తాజాగా కేంద్రానికి లేఖ రాశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని కేంద్రం హామీ ఇస్తే.. నిరాహార దీక్ష విరమిస్తానని అందులో పేర్కొన్నారు.

Reported by: Y.V. Narsimha Reddy | జాతీయం | Jul 22, 2026, 6:44 pm IST
Read Time: 4 mins
విద్యార్థులపై కేసులు పెట్టొద్దు..దీక్ష విరమిస్తా : వాంగ్ చుక్

విధాత : నీట్ (NEET) పేపర్ లీకేజీ అక్రమాలపై నిరాహార దీక్షలో ఉన్న ప్రముఖ పర్యావరణ వేత్త, సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) తాజాగా కేంద్రానికి లేఖ రాశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని కేంద్రం హామీ ఇస్తే.. నిరాహార దీక్ష విరమిస్తానని అందులో పేర్కొన్నారు. విద్యార్థులపై కేంద్రం ఎలాంటి కేసులు పెట్టొద్దన్నారు. పేపర్ లీకేజీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తగిన పరిహారం అందించాలని కోరారు. అలాంటి హామీ ఇస్తే ప్రభుత్వంతో చర్చలు జరపాలని విద్యార్థులకు చెబుతానన్నారు. లేదంటే దీక్ష కొనసాగుతుందని వాంగుచుక్‌ తెలిపారు.

ఆస్పత్రిలో తనను పరామర్శించి దీక్ష విరమించాలని కోరినకేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లకు లేఖ రాశారు. విద్యాశాఖ మంత్రి రాజీనామాతో సహా జవాబుదారీతనంపై పార్లమెంట్‌లో అర్థవంతమైన చర్చ జరపడాన్ని కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని మంత్రులు హామీ ఇచ్చారని వాంగ్‌చుక్ పేర్కొన్నారు.

కేంద్ర మంత్రులు ఆసుపత్రికి వచ్చి నన్ను పరామర్శించి, దీక్ష విరమించాలని కోరినందుకు ధన్యవాదాలు. పేపర్‌ లీక్‌ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు అవసరమైన పరిహారం ఇవ్వడం, విద్యాశాఖ మంత్రి రాజీనామా అంశాన్ని పరిశీలించడంతో పాటు పార్లమెంటులో దీనిపై చర్చ జరపాలన్న విజ్ఞప్తికి మీరు సానుకూలంగా స్పందించారు. మీ తర్వాత.. దీక్ష విరమించాలని కోరుతూ వివిధ పార్టీలకు చెందిన 65 మంది ఎంపీలు నాకు లేఖ రాశారు. వారితో నేను ఏకీభవించాను’’ అని వాంగ్‌చుక్‌ పేర్కొన్నారు.

ఇక జూలై 20న జరిగిన ‘సంసద్ చలో’ మార్చ్ చాలా ప్రశాంతంగా జరిగిందని, పోలీసులు బలప్రయోగం చేసినప్పటికీ విద్యార్థులు ఎంతో సహనంతో వ్యవహరించారని వాంగ్‌చుక్ గుర్తుచేశారు. ఈ ఉద్యమంలో పాల్గొన్న యువ నిరసనకారులపై ఎటువంటి కేసులు, వేధింపులు లేదా ప్రతీకార చర్యలు ఉండవని ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ కావాలని డిమాండ్ చేశారు.