విధాత, హైదరాబాద్ : అద్దె ఇల్లు చూడటానికి వెళ్లి పెంపుడు కుక్క దాడిలో తీవ్రంగా గాయపడిన భార్యభర్తల వీడియో వైరల్ గా మారింది. పాటియాలాలోని ఘుమాన్ నగర్‌లో ప్రాపర్టీ డీలర్‌తో కలిసి అద్దె ఇల్లు చూడటానికి వెళ్లిన అంకిత్ సభర్వాల్, అతని భార్య షిఫాలీ అనే దంపతులపై ఒక పిట్ బుల్ తీవ్రంగా దాడి చేసింది. గేటు తెరుచుకోగానే ఆ కుక్క ఒక్కసారిగా బయటకు దూకి, నిమిషం పాటు ఆగకుండా వారిపై దాడి చేసి..పలుమార్లు కరిచింది. ఇరుగుపొరుగు వారు కర్రలతో జోక్యం చేసుకునేలోపే ఈ దాడి జరిగింది.
కుక్క దాడిలో షిఫాలీకి చేతులు, కాళ్లకు తీవ్రమైన గాయాలవ్వడంతో ప్లాస్టిక్ సర్జరీ అవసరమైంది. కాగా అంకిత్ కూడా ఈ దాడిలో తప్పించుకోలేకపోయాడు.ఆయన తన భార్యను కాపాడటానికి ప్రయత్నిస్తున్నప్పుడు, కుక్క తన కాళ్లు, వెన్నుపూసపై తీవ్ర గాయాలు చేసింది. ఒక మహిళ ఒక కర్రతో బయటకు వచ్చి కుక్కను అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నం విఫలమైంది. కొంత సేపటికి మరికొంత మంది కర్రలు పట్టుకొని వచ్చి, కుక్కతో తీవ్రమైన పోరాటం చేసి, గాయపడిన దంపతులను కాపాడటానికి ప్రయత్నించారు. అప్పటికే షిఫాలీ, అంకిత్ లు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఇద్దరూ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ఈ అకారణ దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వైరల్ అవుతోంది.
పంజాబ్‌లో పిట్ బుల్స్ కుక్కల దాడులు తరచూ వెలుగుచూస్తున్నాయి. ఇటీవల గురుదాస్‌పూర్‌లో మరో పిట్‌బుల్ ఏకంగా 15 కిలోమీటర్ల పరిధిలోని 5 గ్రామాల్లో తిరుగుతూ.. మార్గమధ్యంలో 12 మందిపై దాడి చేసింది. టాంగో షా గ్రామంలో ఇద్దరు కార్మికులపై, అలాగే ఇంటి బయట కూర్చున్న 60 ఏళ్ల దిలీప్ కుమార్ అనే వృద్ధుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.
పిట్ బుల్స్ వంటి క్రూరమైన జాతులపై పటియాలా మున్సిపల్ కార్పొరేషన్ నిషేధం విధించినప్పటికి..యజమానులు ఆ జాతి కుక్కలను పెంచడం ఈ ఘటనతో బయటపడింది. దీంతో యజమానిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రమాదకరమైన పిట్‌బుల్ టెర్రియర్స్, అమెరికన్ బుల్‌డాగ్స్, రాట్‌వీలర్ తదితర 23 జాతుల కుక్కల పెంపకం, విక్రయాలను కేంద్ర పశుసంవర్ధక శాఖ గతంలోనే నిషేధించింది. అయినప్పటికి క్షేత్ర స్థాయిలో సదరు ఆదేశాలు అమలు, పర్యవేక్షణ కొరవడింది. దూకుడు స్వభావం గల కుక్కల పెంపకంపై నిషేధం కోసం మరింత కఠినమైన నిబంధనలు అమలు చేసేందుకు చర్చలు జరుపుతామని నగర మేయర్ ప్రకటించారు.
⚠️ DISTURBING VISUALS
Husband and wife out house-hunting in Patiala mauled by a pit bull after it slipped out of the very property they had come to see in Ghuman Nagar
Even the owner and neighbours appeared helpless trying to stop the attack
They’ve suffered multiple bite… pic.twitter.com/4epQfJgs72
— Nabila Jamal (@nabilajamal_) August 12, 2026