సుందరం ఉప్పల్ చెరువు..బస్టాండ్ అధ్వాన్నం!!

హైడ్రా చేపట్టిన పునరుద్ధరణ కార్యక్రమంతో ఉప్పల్ నల్లచెరువు సుందర రూపం సంతరించుకోగా...అదే చెరువు గట్టుపై ఓ వైపుగా హైదరాబాద్ -వరంగల్ హైవే వెంట నూతనంగా ఏర్పాటు చేసిన బస్టాండ్ మాత్రం అధ్వాన్నంగా మారింది. తాజా వర్షాలతో బస్టాండ్ ప్రాంగణం అంతా వరద, బురద మయంగా మారింది.

Reported by: Y.V. Narsimha Reddy | హైదరాబాద్​ | Aug 08, 2026, 12:37 pm IST
Read Time: 4 mins
సుందరం ఉప్పల్ చెరువు..బస్టాండ్ అధ్వాన్నం!!

హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ నల్ల చెరువుకు హైడ్రా కోట్లాది రూపాయల ఖర్చుతో సుందర రూపం తెచ్చింది. 10 ఎకరాలకుపైగా ఆక్రమణలు, భారీ మొత్తంలో చేరిన ప్లాస్టిక్‌ వ్యర్థాలను, పూడికను తొలగించిన హైడ్రా చెరువును 70 ఎకరాలకు విస్తరించింది. రూ.20 కోట్ల వ్యయంతో సమగ్రంగా అభివృద్ధి చేస్తోంది. వరద నీరు ఎప్పటికప్పుడు దిగువక పారేల కాలువలు నిర్మించింది.ఫలితంగా ఈ ఏడాది చెరువు ఎగువన ఉన్న ప్రాంతాలు నీట మునగకుండా వర్షపు నీరు నేరుగా చెరువులోకి చేరింది.

నీటి నిల్వకే పరిమితం కాకుండా, ప్రజలకు విశ్రాంతి, ఆరోగ్యం, వినోదం కల్పించేలా చెరువు చుట్టూ వాకింగ్‌ ట్రాక్, పటిష్టమైన మెయిన్‌ బండ్, పిల్లల కోసం ప్లే ఏరియా, ఓపెన్‌ జిమ్‌ వంటి సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై స్థానికులు, చెరువు సమీప కాలనీల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.ఇదంతా నాణేనికి ఒక భాగం.

ఉప్పల్ బస్టాండ్  అధ్వాన్నం..

హైడ్రా చేపట్టిన పునరుద్ధరణ కార్యక్రమంతో ఉప్పల్ నల్లచెరువు సుందర రూపం సంతరించుకోగా…అదే చెరువు గట్టుపై ఓ వైపుగా హైదరాబాద్ -వరంగల్ హైవే వెంట నూతనంగా ఏర్పాటు చేసిన బస్టాండ్ మాత్రం అధ్వాన్నంగా మారింది. జిల్లాలకు వెళ్లే బస్సు ప్రయాణికుల కోసం ఇక్కడ బస్టాండ్ ను ఏర్పాటు చేయడం బాగానే ఉన్నా..అక్కడ ప్రయాణికులకు కనీస వసతుల కల్పనలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. ముఖ్యంగా తాజా వర్షాలకు బస్టాండ్ చిన్నపాటి చెరువునే తలపిస్తుంది. బస్టాండ్ ప్రాంగణం అంతా జలమయం..బురదమయం కాగా ప్రయాణికులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు.

తాము వెళ్లాల్సిన బస్సులు రాగానే వాటిలో ఎక్కేందుకు ప్రయాణికులు బ్యాగ్ లు, పిల్లలతో వరద, బురద నీటిలో పరుగులు పెడుతూ బస్టాండ్ దుస్థితిపై తిట్లదండకం చదువుకుంటున్నారు.  కోట్లు ఖర్చు పెట్టి చెరువును సుందరీకరించిన ప్రభుత్వం..ప్రజలు వినియోగించే బస్టాండ్ మాత్రం చెరువుగా మారిపోతున్నా పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని ప్రయాణికులు విమర్శిస్తున్నారు.