విధాత, హైదరాబాద్ : హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు కొత్తగా HMDA 3 కి.మీ నాలుగు లైన్ల ఎలివేటెడ్ కారిడార్‌ను ప్లాన్ చేసింది. జీవీకే వన్ మాల్ నుంచి మెహిదీపట్నం PPNR ఎక్స్‌ప్రెస్ హైవే వరకు, మాసబ్ ట్యాంక్ మీదుగా ఈ హైవే నిర్మించబోతున్నారు. 3 అప్ ర్యాంపులు, 2 డౌన్ ర్యాంపులతో నిర్మించనున్నారు. దీంతో పాటు మాసబ్‌ట్యాంక్ జంక్షన్లో ఫ్ల్లైఓవర్ ఏర్పాటు చేసినా ట్రాఫిక్ రద్దీ తగ్గని నేపథ్యంలో ఓ అండర్‌పాస్ నాలుగు లేన్లతో నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం కన్సల్టెన్సీ ద్వారా బంజారాహిల్స్ నుంచి మెహిదీపట్నం వరకు ట్రాఫిక్ సర్వేతో పాటు భౌగోళిక సర్వేలను చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టు డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను త్వరలోనే కన్సల్టెన్సీ ద్వారా రూపకల్పన చేసి ప్రభుత్వానికి అందజేసే అవకాశాలున్నాయి. ప్రభుత్వం ఆమోదిస్తే రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలని హెచ్ఎండీఏ అధికారులు భావిస్తున్నారు.
కారిడార్ నిర్మాణ ప్రతిపాదనలు
శంషాబాద్‌లోని అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు చేరేందుకు వైఎస్ హయాంలో పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వేకు ప్రత్యామ్నాయంగా కొత్త ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని తలపెట్టారు. ఈ కారిడార్ పూర్తయితే పంజాగుట్ట, బంజారాహిల్స్ నుంచి ఎయిర్‌పోర్టుకు ట్రాఫిక్ ఫ్రీ జర్నీ సాధ్యమవుతుంది. త్వరలో ప్రభుత్వానికి డీపీఆర్ సమర్పించి 2 ఏళ్లలో ఈ నాలుగు లైన్ల ఎలివేటెడ్ కారిడార్‌ను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1లోని జీవీకే వన్ నుంచి ఎలివేటెడ్ కారిడార్‌ను నాలుగు లైన్లతో మెహిదీపట్నంలోని సరోజినిదేవి కంటి ఆస్పత్రి వరకు గల పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వేకు అనుసంధానిస్తారు. జీవీకే వన్ నుంచి పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే వరకు.. ఐదు ర్యాంపులు రానుండగా అన్నీ రెండు లేన్లతో డిజైన్ చేస్తున్నారు. తాజ్‌డెక్కన్ వైపు నుంచి, మాసబ్‌ట్యాంకు నుంచి, మెహిదీపట్నం వద్ద అప్ ర్యాంప్‌ను నిర్మించనున్నారు. ఆసిఫ్ నగర్ రోడ్డు, బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12 వద్ద డౌన్ ర్యాంపులు నిర్మించనున్నారు. కారిడార్ నిర్మాణంతో జీవీకే వన్ నుంచి మాసబ్‌ట్యాంకు, ఎన్ఎండీసీ, పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ మీదుగా ఆరాంఘర్ వరకు సులువుగా చేరుకోవడంతో పాటు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లవచ్చు.
మాసబ్‌ట్యాంక్ వద్ద అండర్‌పాస్‌కు ప్లాన్
మాసబ్‌ట్యాంక్ వద్ద బంజారాహిల్స్ నుంచి విజయ్‌నగర్ కాలనీ వైపు వెళ్లే వాహనదారులకు నాలుగు లేన్లతో అండర్‌పాస్ ను నిర్మించడానికి ప్రతిపాదన చేశారు. అలాగే జంక్షన్లో పాదచారుల కోసం ప్రత్యేకంగా అండర్‌పాస్ ఉండేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇవి పూర్తయితే జంక్షన్ పూర్తిగా మారిపోనుంది. సిగ్నల్, యూటర్న్ లేకుండా వాహనదారులు ప్రయాణం చేయడానికి హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో డిజైన్ చేస్తున్నారు. ఇందుకోసం ఓ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో ట్రాఫిక్‌పై సర్వే చేస్తున్నారు.