Maduro Captured | వెనెజులాపై అమెరికా దురాక్రమణ.. అధ్యక్షుడు మదురో అపహరణ
వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం అదుపులోకి తీసుకుందని అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. కరాకస్‌లో భారీ పేలుళ్లు జరిగాయి.
Maduro Captured | అమెరికా సామ్రాజ్యవాదం మళ్లీ జడలు విప్పింది. కొంతకాలంగా వెనెజులాపై దాడికి సంకేతాలు ఇచ్చిన అమెరికా.. ఏకంగా రాజధానిపై దాడి చేయడమే కాకుండా.. దేశాధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను అదుపులోకి తీసుకుని, దేశం దాటించింది. వారిని అమెరికాకు తరలిస్తున్నట్టు ట్రంప్ తన సామాజిక మాధ్యమం ఖాతాలో వెల్లడించారు. డ్రగ్స్ కార్యకలాపాలకు వెనెజులా కేంద్రంగా మారిందని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణా పేరిట కొంతకాలంగా వెనెజులాను అమెరికా లక్ష్యంగా చేసుకుంది. తూర్పు పసిఫిక్ ప్రాంతంలో పెద్ద ఎత్తున బలగాలను, నౌకా దళాలను మోహరించింది. డ్రగ్స్ తరలిస్తున్నారంటూ పడవలు, జలాంతర్గాములపై దాడులు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో నేరుగా దేశంపై దాడికి దిగింది. వెనెజులా రాజధాని కారకాస్‌లో ఏడు చోట్ల భారీ పేలుళ్లు జరిగాయి. బాంబులతో అమెరికా సైన్యం విరుచుకు పడింది. ఈ సందర్భంగా వెనుజులా అధ్యక్షుడిని తమ సైన్యం అదుపులోకి తీసుకొని దేశం నుంచి తరలించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అయితే.. ఈ దాడులకు ముందు కాంగ్రెస్‌ను ట్రంప్ సంప్రదించారా? ఈ దాడులకు చట్టబద్ధత ఉన్నదా? అన్న విషయం తెలియాల్సి ఉన్నది.
సరిగ్గా 36 ఏళ్ల క్రితం.. 1990లో పనామాను అమెరికా దురాక్రమించింది. ఆ సమయంలో కూడా ఇలానే మిలిటరీ చర్యకు పాల్పడి.. ఆ దేశ అధ్యక్షుడు మాన్యుయేల్ ఆంటోనియో నోరియేగాను లొంగదీసుకొని బందీగా చేసుకున్నారు. మళ్లీ ఆ దృశ్యాన్ని వెనెజులా అధ్యక్షుడిని బందీగా చేసుకోవడం కళ్ల ముందు నిలిపింది.
న్యూయార్క్‌లో విచారణ అనంతరం మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌పై అభియోగాలు నమోదు అవుతాయని అమెరికా అటార్నీ జనరల్ పామ్ బోండీ చెప్పారు. అమెరికా గడ్డపై, అమెరికా కోర్టుల్లో అమెరికా న్యాయ వ్యవస్థ పూర్తి ఆగ్రహాన్ని మదురో దంపతులు ఎదుర్కొంటారని బోండీ తన సామాజిక మాధ్యమ ఖాతాలో రాసుకున్నారు. మదురోపై 2020లో నార్కో టెర్రరిజం కుట్ర అభియోగాలను అమెరికా మోపింది.
మదురో దంపతులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారనే విషయంలో స్పష్టత లేదు. వెనెజులా చట్టం ప్రకారం.. దేశ ఉపాధ్యక్షుడు డెల్సీ రోడ్రిగ్వెజ్ అధ్యక్ష స్థానం చేపట్టనున్నారు. వారి జాడ తెలియడం లేదని, వారు ప్రాణాలతోనే ఉన్నారనే సాక్ష్యాలను విడుదల చేయాలని రోడ్రిగ్వెజ్ డిమాండ్ చేశారు.
శనివారం తెల్లవారుజామున వెనెజులా రాజధానిపై దాడులు జరుగుతున్న సందర్భంలో అమెరికా దురాక్రమణను ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. పౌరులపై, మిలిటరీ స్థావరాలపై అమెరికా సేనలు దాడులు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. వీటిని సామ్రాజ్యవాద దాడులుగా అభివర్ణించిన వెనెజులా.. వీటికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపైకి రావాలని పిలుపునిచ్చింది. ఈ మొత్తం దాడులు 30 నిమిషాల్లోపే ముగిశాయి. మరణాలు, క్షతగాత్రుల వివరాలు వెల్లడికాలేదు.
ఇవి కూడా చదవండి :
Hardik Pandya| హర్ధీక్ పాండ్య విధ్వంసక శతకం
Vandemataram | వందేమాతరం వివాదం.. దాని పూర్వాపరాలు.. లోతైన విశ్లేషణ
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram