Gold | పాత సిమ్‌కార్డుల నుంచి రూ.27 ల‌క్ష‌ల విలువైన బంగారాన్ని వెలికితీశాడు

చైనా (China)లోని గ్వాంగ్‌డాంగ్ (Guangdong) ప్రాంతానికి చెందిన క్వియావో (Qiao) అనే వ్య‌క్తి ఈవేస్ట్‌, పాత సిమ్‌కార్డుల నుంచి 200 గ్రాముల బంగారాన్ని బ‌య‌ట‌కు తీశాడు (Gold From old SIM cards). మార్కెట్‌లో దాని విలువ సుమారు రూ.27 ల‌క్ష‌ల వ‌ర‌కూ ఉంటుంద‌ని అంచ‌నా.

Gold | పాత సిమ్‌కార్డుల నుంచి రూ.27 ల‌క్ష‌ల విలువైన బంగారాన్ని వెలికితీశాడు

Gold | ప్ర‌స్తుతం బంగారం (Gold) రేట్లు భ‌గ‌భ‌గ మండుతున్నాయి. నాలుగేళ్ల క్రితం రూ.50 వేలుగా ఉన్న తులం బంగారం.. ఇప్పుడు రూ.ల‌క్ష‌న్న‌ర దాటింది. ప‌సిడి ధ‌ర‌లు రోజురోజుకూ రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. ఈ క్ర‌మంలో దాన్ని కొనాలంటేనే జ‌నాలు జంకుతున్నారు. సామాన్యులే కాదు ఉన్నోళ్లు కూడా బంగారం మాటెత్తుతే అమ్మో బంగార‌మా అనే ప‌రిస్థితి నెల‌కొంది. ఈ ఎల్లో మెట‌ల్ సామాన్యుల‌కు అంద‌ని ద్రాక్ష పండులా మారింది. అయితే, చైనా (China)లో ఓ వ్య‌క్తి ఈ వేస్ట్ నుంచి బంగారాన్ని తీసి అంద‌రినీ (Gold From old SIM cards) ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాడు.

చైనాలోని గ్వాంగ్‌డాంగ్ (Guangdong) ప్రాంతానికి చెందిన క్వియావో (Qiao) అనే వ్యక్తి చెత్తను సేకరించి అమ్ముతుంటాడు. నిత్యం ట‌న్నుల కొద్దీ వేస్ట్‌ను సేక‌రించి విక్ర‌యిస్తూ జీవ‌నం సాగిస్తుంటాడు. ఈ క్ర‌మంలో అత‌డికి ఎల‌క్ట్రానిక్ వేస్ట్‌లో బంగారం ఉంటుంద‌ని తెలిసింది. ఇంకేముందు ఈ విష‌యం తెలిసిన‌ప్ప‌టి నుంచి తాను సేక‌రించిన వేస్ట్ నుంచి పాత సిమ్ కార్డులు, ఎల‌క్ట్రానిక్ చిప్‌ల‌ను సేక‌రించడం మొద‌లు పెట్టాడు. అలా కొద్ది రోజుల్లోనే భారీ మొత్తంలో ఈవేస్ట్‌ను సేక‌రించాడు. ఆ త‌ర్వాత ఆ వేస్ట్ నుంచి భారీ స్థాయిలో బంగారాన్ని వెలికితీశాడు. ఈ ప్రక్రియలో అత‌డు ప్రమాదకరమైన రసాయనాలను ఉపయోగించాడు.

ఇలా ఆ వేస్ట్ నుంచి ఏకంగా 200 గ్రాముల బంగారాన్ని బ‌య‌ట‌కు తీశాడు. మార్కెట్‌లో దాని విలువ సుమారు రూ.27 ల‌క్ష‌ల వ‌ర‌కూ ఉంటుంద‌ని అంచ‌నా. ఈ ప్ర‌క్రియ‌కు సంబంధించిన వీడియోని కూడా క్వియావో సోష‌ల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. వేస్ట్ నుంచి బంగారాన్ని తీసే ప్ర‌క్రియ చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని.. ఎవ‌రూ ఇలాంటి ప్ర‌యోగాలు చేయొద్ద‌ని కూడా హెచ్చ‌రించాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్ అవుతోంది.

చైనాలో ఇలా బంగారం శుద్ధి చేయడంపై కఠినమైన నిబంధనలు ఉన్నాయి. అనుమతి లేకుండా ఇలా చేస్తే ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటుంది. జరిమానాలు, జైలు శిక్ష పడతాయి. అయితే, తనకు అధికారికంగా లైసెన్స్ ఉందని కియావో పేర్కొన్నాడు. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత, చైనాలో పాత సిమ్ కార్డులు, గోల్డ్-రిఫైనింగ్ కిట్‌లకు ఆన్‌లైన్‌లో డిమాండ్ అమాంతం పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి :

Bill Gates Amaravati visit| ఏపీలో సచివాలయంలో చంద్రబాబుతో బిల్ గేట్స్ భేటీ
Thorrur chairperson election| తొర్రూర్ లో చైర్ పర్సన్ ఎన్నిక టెన్షన్…ఎర్రబెల్లి పీఏపై దాడి