Surya Backs Abhishek | అభిషేక్ ఫామ్‌పై చింత అవసరం లేదు: అది తుపాను ముందు ప్రశాంతత – సూర్యకుమార్

అభిషేక్ శర్మ ఫామ్‌పై వస్తున్న విమర్శలకు సూర్యకుమార్ యాదవ్ ఘాటు సమాధానం ఇచ్చాడు. “గత సంవత్సరం అతడే మమ్మల్ని కవర్ చేశాడు” అంటూ పూర్తి మద్దతు ప్రకటించిన సూర్య, తిలక్ వర్మ పాత్ర, సంజూ సామ్సన్ ఎంపిక, వరల్డ్ కప్ ఒత్తిడిపై కూడా స్పష్టత ఇచ్చాడు.

  • By: ADHARVA |    sports |    Published on : Feb 22, 2026 1:37 PM IST
Surya Backs Abhishek | అభిషేక్ ఫామ్‌పై చింత అవసరం లేదు: అది తుపాను ముందు ప్రశాంతత – సూర్యకుమార్

Suryakumar Backs Abhishek Sharma: “Last Year He Covered for Us, Now We Cover for Him”

🔥 నేడే సూపర్ 8లో భారత్ – దక్షిణాఫ్రికా హై వోల్టేజ్ పోరు

 

  • అభిషేక్​ ఆడకపోతే భయపడాల్సింది ప్రత్యర్థులు
  • గతేడాది అతనే మమ్మల్ని కాపాడాడు
  • తిలక్​వర్మకు 3వ స్థానంలో బాధ్యత అప్పగించాం
  • అమెరికా మ్యాచ్​ మాకు మేలుకొలుపు

విధాత క్రీడా విభాగం 22 ఫిబ్రవరి 2026 హైదరాబాద్​:

Surya Backs Abhishek | భారత్ జట్టు యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్‌పై వస్తున్న విమర్శలకు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్​ స్పష్టమైన సమాధానం ఇచ్చాడు. “అభిషేక్ ఫామ్ గురించి ఎందుకు అంతగా ఆందోళన పడుతున్నారు?” అంటూ నవ్వుతూ స్పందించిన సూర్య, జట్టు అతడిపై పూర్తి విశ్వాసం ఉంచిందని తెలిపాడు.

“గత సంవత్సరం అతడే మమ్మల్ని కవర్ చేశాడు. ఇప్పుడు అతడికి అవసరం వస్తే మేము అతడిని కవర్ చేస్తాం,” అని సూర్య చెప్పిన మాటలు జట్టు​ ఐకమత్యాన్ని ప్రస్ఫుటించాయి.

అభిషేక్‌పై పూర్తి నమ్మకం : కెప్టెన్​ సూర్య నాయకత్వ పరిణితి

Abhishek Sharma playing an attacking shot during T20 World Cup match for Team India

ఈ టోర్నమెంట్‌లో ఇంకా పరుగులు చేయలేకపోయిన అభిషేక్ శర్మ (Abhishek Sharma) గురించి ప్రశ్నించగా, సూర్య చమత్కారంగా స్పందించాడు. “అతడు ఇంకా పరుగులు చేయలేదంటే, ప్రత్యర్థి జట్లే భయపడాలి. ఒకసారి తను మొదలుపెడితే ఏమవుతుందో అందరికీ తెలుసు” అన్నాడు.

క్రికెట్ మొత్తం జట్టు ఆడే ఆట అని, ఒక్కోసారి డక్స్ రావడం సహజమని స్పష్టం చేశాడు. “అతడు తన శైలిలోనే ఆడాలని జట్టంతా కోరుకుంటోంది. ఫలితం బావుంటే మా ఎవరి అవసరం ఉండదు. రాకపోతే మేమంతా ఎలాగూ ఉన్నాం కదా.” అంటూ యువ ఆటగాడికి పూర్తి మద్దతు తెలిపాడు.

సంజూ, తిలక్‌లపై స్పష్టత

అభిషేక్ స్థానంలో సంజూ శాంసన్​ను తీసుకుంటారా? అనే ప్రశ్నకు సూర్య కాస్త ఆశ్చర్యపోయినట్టు నటిస్తూ స్పందించాడు. “అంటే తిలక్ స్థానంలోనా?” అని హాస్యంగా అంటూ మూడోస్థానంలో ఆడుతున్న తిలక్​ వర్మ(Tilak Varma) పాత్రను కూడా వివరించాడు. పవర్‌ప్లేలో ఒక వికెటే పడితే అతడు తనదైన ఆట ఆడొచ్చు. కానీ రెండు వికెట్లు పడితే బాధ్యతగా ఇన్నింగ్స్‌ను నిలబెట్టాలని జట్టు మేనేజ్‌మెంట్ చెప్పిందని తెలిపాడు. “10వ ఓవర్​ దాటితే మాకు మంచి ఫైర్​ పవర్​ ఉంది. తిలక్​ ఇప్పటి వరకు భారత్‌కు మూడోస్థానంలో బాగా ఆడాడు. అతడిపై ఎలాంటి ఆందోళన లేదు,” అని విశ్వాసం వ్యక్తం చేసాడు. జట్టులోని బ్యాటర్లందరూ ఏ స్థానంలోనైనా రాణించగలరు కాబట్టి, వారి స్థానాలపై ఆలోచన ఉండదని ధీమా వ్యక్తం చేస్తూ, అప్పటికప్పుడు పరిస్థితులను బట్టి క్రీజ్​లోని ఎవరెళ్లాలో నిర్ణయించబడుతుందని పేర్కొన్నాడు.

ఒత్తిడి సహజం – గత విజయాలు చరిత్ర

Abhishek Sharma interacting with coach Gautam Gambhir during Team India training session at T20 World Cup

స్వదేశంలో జరుగుతున్న టి20 ప్రపంచ కప్​(ICC T20 World Cup)లో ఒత్తిడి సహజమని సూర్య ఒప్పుకున్నాడు. హోటళ్లలో కలిసే ప్రతి ఒక్కరూ కప్ తప్పకుండా గెలవాలని చెబుతారని, మనవాళ్లందరికీ  ఆశలుంటాయని అన్నాడు. అమెరికాతో జరిగిన మ్యాచ్ తమకు మేల్కొలుపు అని, అప్పటి నుంచి ఒక్కో మ్యాచ్‌పై దృష్టి పెడుతున్నామని తెలిపాడు. “గత విజయాలు చరిత్ర. మనం ఎప్పుడూ వర్తమానంలోనే ఉండాలి,” అంటూ జట్టు ఆలోచనను వివరించాడు.

అభిషేక్ ఫామ్, ఎడమచేతి బ్యాటర్ల సంఖ్య, ఆఫ్‌స్పిన్నర్ల సవాలు — ఇవన్నీ ఉన్నా జట్టు దృక్పథం స్పష్టంగా ఉందని సూర్యకుమార్ చెప్పిన మాటల్లో నమ్మకం స్పష్టంగా కనిపించింది. అభిషేక్​ను వెనకేసుకొచ్చిన తీరు సూర్యలోని అసలైన నాయకత్వ లక్షణాలను ప్రతిబింబించింది.