• Telugu News
  • /Telangana

15 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అదనపు పని వేళలు.. ఈ నెల12 నుంచి అమలులోకి

తెలంగాణ రాష్ట్రంలో భూముల విలువల క్రమబద్ధీకరణతో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రద్దీ పెరిగింది. దీంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు చంపాపేట్, సరూర్‌నగర్, వనస్థలిపురం, గండిపేట్ తదితర 15 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో మే 12 నుంచి పనివేళలను పొడిగించారు. స్లాట్ బుకింగ్‌లు కూడా పెంచారు.

Reported by: Jagan Mohan Talluri | తెలంగాణ‌ | May 09, 2026, 8:55 pm IST
Read Time: 3 mins
15 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అదనపు పని వేళలు.. ఈ నెల12 నుంచి అమలులోకి

హైలైట్స్:

  • మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడి

విధాత, హైదరాబాద్:
రాష్ట్రంలో కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లకు భారీగా డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కొన్ని ప్రాంతాల్లో వాస్తవ ధరలతో పోలిస్తే భారీగా హెచ్చుతగ్గులున్న భూముల ధరలను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంతో రద్దీ పెరిగిందన్నారు. రద్దీ అధికంగా ఉన్న చంపాపేట్, సరూర్‌నగర్, వనస్థలిపురం, గండిపేట్, మహేశ్వరం, ఫరూఖ్‌నగర్, షాద్‌నగర్, రంగారెడ్డి రూరల్, ఎల్‌బీనగర్, శేరిలింగంపల్లి, సంగారెడ్డి, ఘట్‌కేసర్, నల్గొండ ఆర్.ఓ, పటాన్‌చెరు, కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ నెల 12వ తేదీ నుంచి పనివేళలను ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ పదిహేను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో అవసరమైతే మరింత సమయాన్ని పెంచడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొంగులేటి తెలిపారు. అదేవిధంగా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని స్లాట్ బుకింగ్‌ల సంఖ్యను కూడా పెంచారన్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా రిజిస్ట్రేషన్ల రద్దీ పెరిగిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను గుర్తించి, అవసరానికి అనుగుణంగా అదనపు సమయాన్ని పెంచాలని సూచించారు. అలాగే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ జరిగే మండల తహసీల్దార్ కార్యాలయాలను కూడా సమన్వయం చేసుకోవాలని మంత్రి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు.