విధాత, హైదరాబాద్ : తెలంగాణ విద్యారంగంలో మైలురాయిగా ప్రభుత్వం భావిస్తున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆరుట్లలో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. సీఎంతో పాటుమంత్రి శ్రీధర్ బాబు, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. స్కూల్‌లోని డిజిటల్ క్లాస్‌రూమ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, డైనింగ్ హాల్‌ను రేవంత్ రెడ్డి పరిశీలించారు. విద్యా వసతులపై విద్యార్థులు, టీచర్లు, స్కూల్ కమిటీ సభ్యులతో మాట్లాడారు. విద్యార్థులతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే క్యాంపస్‌లో ఇంగ్లీష్ మీడియం విద్య
రేవంత్ రెడ్డి తన డ్రీమ్ ప్రాజెక్టుగా భావిస్తున్న ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ ను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మింప చేశారు. పేద విద్యార్థులకు కార్పోరేట్ స్థాయిలో నాణ్యమైన విద్యను చేరువ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను నిర్మింపచేస్తుంది. తెలంగాణ పబ్లిక్ స్కూల్ లో నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే క్యాంపస్‌లో ఇంగ్లీష్ మీడియం విద్య అందుతుంది. గాలి, వెలుతురు వచ్చే విశాలమైన గదులు, డిజిటల్ బోర్డులు, అత్యాధునిక ల్యాబ్స్, జిమ్ వంటి సదుపాయాలు ఈ స్కూల్ భవనంలో ఉన్నాయి. క్రికెట్, ఫుట్‌బాల్, వాలీబాల్, టెన్నిస్, కబడ్డీ వంటి ఆటల కోసం ప్రత్యేక కోచ్‌లను నియమించారు. విద్యార్థుల కోసం ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ అందిస్తారు. ఇంటి నుంచి స్కూలుకు రావడానికి 5 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆరుట్ల స్కూల్లో 1,814 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో ప్రీ-ప్రైమరీలో150, ప్రైమరీలో 600, హైస్కూల్లో 800, ఇంటర్మీడియట్‌లో 264 మంది చదువుతున్నారు. ప్రైవేట్ స్కూళ్ల నుంచి వలసలు పెరగడంతో ‘నో అడ్మిషన్’ బోర్డు పెట్టాల్సిన పరిస్థితి రావడం విశేషం.
పైలట్ ప్రాజెక్టుగా నాలుగు తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ప్రారంభం
పైలట్ ప్రాజెక్టుగా ఆరుట్ల, మంచాల, వంగూరు, పోల్కంపల్లిలో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ప్రారంభించనుండగా.. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా 100 టీపీఎస్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ నిర్మిస్తున్నామని, ఆరుట్ల టీపీఎస్ ను రూ.15కోట్లతో నిర్మించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. టీపీఎస్ లో అప్పుడే నో ఆడ్మీషన్ల బోర్డు పెట్టాల్సి రావడం ఈ పాఠశాలలకు క్రేజ్ కు నిదర్శనం అన్నారు. తెలంగాణ భవిష్యత్తు పునర్ నిర్మాణం తరగతి గదిలోనే ఉందని విశ్వసిస్తున్నామని, విద్యపై ఖర్చు భవిష్యత్తు పెట్టుబడిగా భావిస్తాం అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. టీపీఎస్ లలో చదువతో పాటు క్రీడలలో కూడా రాణించే వసతులు ఉంటాయన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 100స్కూళ్లను ఏర్పాటు చేస్తాం అని పునరుద్ఘాటించారు.
తెలంగాణ విద్యార్థులు ఒలంపిక్స్ స్థాయికి ఎదిగేందుకు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పునాదులు వేస్తాయి అన్నారు. మెస్సీ వంటి ప్రఖ్యాత ఆటగాడిని రప్పించి విద్యార్థులలో స్పూర్తి నింపే ప్రయత్నం చేశాం అన్నారు. ప్రభుత్వం పాఠశాలలో చదివి ఐఏఎస్, ఐపీఎస్, నాయకులు కావాలని, చదువు ఒకటే కాదు స్కిల్ కూడా ఉండాలన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో విద్య కమిషన్ ఏర్పాటు చేశాం అన్నారు.