అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంతో పశ్చిమాసియాలో యుద్ద ఉద్రిక్తతలు తగ్గడం బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తుంది. పసిడి ధరలలో అస్థిరత కొనసాగుతుంది. బుధవారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 10 తగ్గి రూ. 1,51,360వద్ద నిలిచింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 10తగ్గి రూ. 1,38,740 వద్ద కొనసాగుతుంది. కిలో వెండి ధర సైతం రూ. 100 తగ్గి రూ. 2,74,900కు చేరింది.
శుభకార్యాలతో పెరుగనున్న కొనుగోలు
శుభాకార్యాల సీజన్ కావడంతో దేశీయంగా బంగారం, వెండి కొనుగోలు ఊపందుకోవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా కూడా భౌగోళిక, ఆర్థిక పరిస్థితులు, ఫెడరల్ వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, డాలర్ విలువ వంటి పరిస్థితులు పసిడి ధరలకు మద్దతుగా కనిపిస్తున్నాయి. దీంతో ప్రస్తుత ధరల వద్ద బంగారం కొనుగోలుకు పెట్టుబడిదారుల ఆసక్తి చూపవచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. పసిడి ధరలు ప్రస్తుతం ప్రస్తుతానికి అస్థిరంగా కొనసాగుతున్నప్పటికి దీర్ఘకాలంలో పెరుగవచ్చని అంచనా వేస్తున్నారు.
తగ్గని పసిడి కొనుగోలు
పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బంగారం కొనుగోలు తగ్గించాలని ప్రధాని చెప్పినప్పటికి ప్రజలు మాత్రం కొనుగోలు తగ్గించలేదనడానికి వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాలు నిదర్శనంగా నిలిచాయి. మే నెలలో భారతదేశపు బంగారు దిగుమతులు గతేడాదితో పోలిస్తే 34 శాతం మేర భారీగా పెరిగి 3.41 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అయితే వెండి దిగుమతులలో మాత్రం ఈ ఏడాది మే నాటికి ఏకంగా 86.65 శాతం తగ్గి కేవలం 75.57 మిలియన్ డాలర్లకు పడిపోయాయి.
విలువైన లోహాల ధరల్లో వచ్చిన మార్పులతో పాటు కేంద్ర ప్రభుత్వం మే 13 నుండి వీటిపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుండి 15 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయం ఈ పరిణామాలకు దారితీసింది. మే నెలలో బంగారం దిగుమతుల ప్రవాహం పెరగడం దేశ వాణిజ్య సమతుల్యతను దెబ్బతీసింది, ఫలితంగా ఎగుమతులు, దిగుమతుల మధ్య ఉండే వ్యత్యాసమైన ‘వాణిజ్య లోటు’ 28.21 బిలియన్ డాలర్లకు పెరిగింది.