విధాత, హైదరాబాద్ : నీట్, సీబీఎస్‌ఈ పరీక్షల్లో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ‘కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ)’ ఆధ్వర్యంలో యువకులు, విద్యార్థులు ఆదివారం హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కాక్రోచ్ ధర్నా నిర్వహించారు. పేపర్ లీకులకు బాధ్యత తీసుకొని కేంద్ర మంత్రి ధర్మేంద ప్రధాన్ రాజీనామా చేయాలంటూ నినాదాలతో హోరెత్తించారు. కాక్రోచ్ మాస్కులు ధరించి, చేతుల్లో పుస్తకాలు, జాతీయ జెండాలతో యువత నిరసన చేపట్టారు.

ధర్నాలో ప్రొఫెసర్ నాగేశ్వర్‌ రావు మాట్లాడుతూ..దేశంలో గత కొన్ని నెలలుగా పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజ్‌ వ్యవహారం నడుస్తోందనిఆరోపించారు. గతంలో రైల్ యాక్సిడెంట్ అయితే రైల్వేశాఖ మంత్రిగా ఉన్న లాల్ బహుదూర్ శాస్త్రి రాజీనామా చేశారని గుర్తు చేశారు. మరి అలాంటప్పుడు పేపర్ లీకేజ్‌ వ్యవహారం నడుస్తున్నప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయట్లేదని ప్రశ్నించారు. సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్, సీజేపీ స్పోక్ పర్సన్ విజేత దహియలు ధర్నాలో మాట్లాడారు. పేపర్ల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేసేదాక తమ ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.