జాతీయ గీతం వందేమాతరంపై కేంద్రం ప్రవేశ పెట్టిన సవరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. మూజువాణి ఓటుతో సభ్యులు బిల్లును ఆమోదించారు. ఇప్పటికే ఈ బిల్లు రాజ్యసభలో కూడా ఆమోదం పొందింది. వందేమాతర గేయాన్ని అవమానించినా, ఆలపిస్తుండగా ఆటంకం కలిగించినా నేరంగా పరిగణించేందుకే కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చింది. వందేమాతరం బిల్లులో భాగంగా ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్-1971లో సవరణలు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది.
ప్రస్తుతం జాతీయ గీతమైన జనగణమనకు ఉన్న చట్టపరమైన రక్షణను వందేమాతరానికీ వర్తింపజేయడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత ఇది చట్టంగా మారనుంది. ఈ బిల్లుపై ఓటింగ్ ముగిసిన తర్వాత స్పీకర్ ఓం బిర్లా లోక్ సభను రేపటికి వాయిదా వేశారు. మరోవైపు లోక్ సభలో ఆమోదం పొందిన యాంటీ పేపర్ లీక్ బిల్లుపై రాజ్యసభలో చర్చ కొనసాగుతుంది. ఏడు గంటల చర్చ ముగిశాక ఓటింగ్ జరుగనుంది.