రిజిస్ట్రేషన్లకు కొత్త రూల్‌.. సర్వే మ్యాపు ఉంటేనే ఇకపై రిజిస్ట్రేషన్.. భూ సమస్యలకు చెక్‌

తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లకు కొత్త నిబంధనలు వర్తించనున్నాయి. ఇప్పటి వరకూ పట్టాదార్‌ పాస్‌బుక్‌ ఆధారంగా రిజిస్ట్రేషన్స్‌ చేస్తున్నారు. ఇకపై సర్వే చేయించి, సరిహద్దులు స్పష్టంగా గుర్తించి, సర్వే పటం జోడిస్తేనే రిజిస్ట్రేషన్లు ఉంటాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ప్రకటించారు. ఈ విధానంతో భూ తగాదాలు ఉండబోవని అన్నారు. ఇప్పటికే ఈ మేరకు ఐదు జిల్లాల్లో పైలట్‌ ప్రాజెక్ట్‌ అమలవుతున్నది.

  • By: TAAZ |    telangana |    Published on : Apr 18, 2026 8:13 PM IST
రిజిస్ట్రేషన్లకు కొత్త రూల్‌.. సర్వే మ్యాపు ఉంటేనే ఇకపై రిజిస్ట్రేషన్.. భూ సమస్యలకు చెక్‌

వార్త సారాంశం.. పాయింట్లవారీగా..

కొత్త విధానం ఏమిటి?
సర్వే తప్పనిసరి
హద్దులు నిర్ణయం
మ్యాప్ తయారీ
ఆ తరువాతే రిజిస్ట్రేషన్

ఎందుకు మార్పు?
పాస్‌బుక్ ఆధారంగా రిజిస్ట్రేషన్స్‌తో వివాదాలు..
సర్వే లేకపోవడం వల్ల గొడవలు
ఫలితంగా పెరుగుతున్న కోర్టు కేసులు

కొత్త విధానంతో ప్రయోజనాలు
భూమి హద్దులపై క్లారిటీ
డబుల్ రిజిస్ట్రేషన్లకు చెక్
కోర్టు కేసులు తగ్గింపు
బ్యాంక్ లోన్స్‌లో పారదర్శకత

పైలట్‌ ప్రాజెక్ట్‌ ఎక్కడ?
అమనగల్లు
అశ్వారావుపేట
కూసుమంచి
వట్పల్లి
కోస్గి

విధాత, హైదరాబాద్:

రాష్ట్రంలో ఇక నుంచి వివాదాలు లేకుండా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ జరగనున్నది. విక్రయదారుడు, కొనుగోలుదారుడు భూములకు సర్వే నిర్వహించి, ఆ తరువాత హద్దులు నిర్ణయించి, మ్యాపులు సిద్ధం చేసిన తరువాతే మండల తహశీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ తంతు జరుగుతుంది. ఈ నెల 20వ తేదీన పాలేరు నియోజకవర్గంలో ‘సర్వే అనంతరం సిద్ధం చేసిన మ్యాప్‌తో రిజిస్ట్రేషన్’ విధానం ప్రారంభం అవుతుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ విధానం మూలంగా భూమి సరిహద్దులపై క్రయ విక్రయదారులకు స్పష్టత ఉండడమే కాకుండా భవిష్యత్తులో భూ తగాదాలు తలెత్తవని ఆయన వివరించారు. ప్రతి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ దరఖాస్తుకు సబ్ డివిజన్ సర్వే పటం తప్పనిసరిగా జోడిస్తారని, దీనివల్ల అనేక పంచాయతీలకు ఫుల్‌స్టాప్‌ పడుతుందని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయ భూమి యజమాని అందచేసిన పట్టాదార్ పాస్ పుస్తకం ప్రకారంగా తహశీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ జరుగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. కొనుగోలుదారుడు తన పట్టాదార్ పాస్ పుస్తకం అందచేయడం, దానిలో నుంచి విక్రయించే భూమి వివరాలను తొలగించి, కొనుగోలుదారుడి పాస్ పుస్తకంలో ఎంట్రీ చేయడం జరుగుతున్నదని అన్నారు. ఈ విధానంలో సర్వే నిర్వహించడం, మ్యాప్ రూపొందించడం, దాన్ని జత చేయడం జరగడం లేదని అన్నారు. దీని వల్ల గ్రామాలలో పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కొనుగోలుదారుడు మండల తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి విలువైన సమయంతో కోల్పోవడంతో పాటు ఒత్తిడికి గురవుతున్నారన్నారు. కోర్టులలో వ్యాజ్యాలు పెరుగుతున్నాయన్నారు.

తమ ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన విధానం మూలంగా భూ వివాదాలు ఇక ఉండవని, డబుల్ రిజిస్ట్రేషన్లు కూడా అరికట్టవచ్చని మంత్రి పొంగులేటి వివరించారు. కర్నాటక రాష్ట్రంలో 2008 నుంచి దీన్ని అమలు చేస్తున్నారని, ఈ విధానం సత్ఫలితాలు ఇచ్చిందన్నారు. రిజిస్ట్రేషన్ సమయంలోనే సర్వే నిర్వహించడం మూలంగా యజమాని భూమి హద్దులు, కొనుగోలుదారుడి భూమి హద్దులు తేలిపోతాయన్నారు. ఎవరికి వారిగా సర్వేయర్ హద్ధులు నిర్ణయించి మ్యాపులను తయారు చేసి మండల తహశీల్దార్ కార్యాలయంలో సమర్పిస్తారన్నారు. మ్యుటేషన్‌కు కూడా ఇదే విధానం అమలు చేస్తామన్నారు. బ్యాంకులలో అప్పుల కోసం తమ భూములను తనఖా పెట్టేవారికి సర్వే మ్యాపులను తప్పనిసరి చేస్తామన్నారు. దీంతో బ్యాంకులు ఇచ్చే రుణాలకు కచ్చితత్వం ఉంటుందని, గతంలో మాదిరి పట్టాదార్ పాస్ పుస్తకాలు అందచేసి రుణాలు తీసుకోవడం సాధ్యం కాదన్నారు. ఇలాంటి కేసులలో బ్యాంకులకు నిరర్థక ఆస్తులు (ఎన్.పీ.ఏ) సమస్య ఉండదని మంత్రి పొంగులేటి భరోసా ఇచ్చారు.

ఇప్పటికే ఐదు జిల్లాల్లో పైలట్‌ ప్రాజెక్టు ప్రారంభం

వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌కు సర్వే తో పాటు మ్యాపులు జతచేయడం తప్పనిసరి చేస్తూ రెవెన్యూ శాఖ నిబంధన తీసుకువచ్చింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా ఐదు జిల్లాల్లో పైలట్ ప్రక్రియను ప్రారంభించారు.

  • రంగారెడ్డి జిల్లా అమనగల్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు పేట, ఖమ్మం జిల్లా కూసుమంచి, సంగారెడ్డి జిల్లా వట్పల్లి, నారాయణపేట జిల్ల కోస్గి మండలాల్లోని తహశీల్దార్ కార్యాలయాల్లో అమలు జరుగుతోంది.
  • రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ ప్రారంభానికి ముందుగానే యజమాని భూమిని సర్వేయర్లు సర్వే చేస్తున్నారు.
  • విక్రయదారుడి నించి దరఖాస్తు అందగానే మండల సర్వేయర్ రైతుకు సంబంధించిన సరిహద్దు లో ఉన్న పొరుగు రైతులు లేదా యజమానులకు నోటీసులు జారీ చేస్తారు.
  • వారం రోజుల తరువాత క్రయ విక్రయదారులు, సరిహద్దు రైతుల సమక్షంలో సర్వే నిర్వహించి యజమానికి, కొనుగోలుదారుడికి వేర్వేరుగా మ్యాపులు రూపొందిస్తారు.
  • ఈ మ్యాపులను సర్వేయర్ భూ భారతి ఆపరేటర్ కు ఆన్ లైన్ లో పంపిస్తే, అక్కడి నుంచి తహశీల్దార్ కు చేరుతుంది.
  • ఈ సర్వే మ్యాపులను పరిశీలించి తహశీల్దార్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

అంతరిక్షం నుంచి వెలిగిపోతూ కనిపించిన యూపీ-బీహార్.. నాసా మ్యాప్ వైరల్
మహిళ బిల్లు ముసుగులో బీజేపీ కుట్ర రాజకీయం : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ సర్కారు కుల సర్వేలో ‘విశ్వకర్మ’ల విచిత్ర పరిస్థితి