సంగారెడ్డి జిల్లాలో భారీ భూ కుంభకోణం..
కబ్టా చేసేందుకు రియల్టర్ల స్కెచ్.. అడ్డుకుంటున్న అధికార పార్టీ సర్పంచ్ సమగ్ర దర్యాప్తు డిమాండ్ చేస్తున్న వైనం.. బెదిరింపులతో.. ప్రాణ రక్షణ కోసం మీడియాను ఆశ్రయించిన బాధితుడు.. విధాత, మెదక్ ఉమ్మడి జిల్లా బ్యూరో: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారం గ్రామ పంచాయతీ పరిధిలో భారీ భూ కుంభకోణం జరుగుతోంది. సర్వే నంబర్ 201లోని మొత్తం 588 ఎకరాలలో 315 ఎకరాలు పట్టా భూమి ఉంది. ఈ భూమిపై భూమి హక్కులకు సంబంధించి కొన్నిఉంటే, ఫేక్ […]

- కబ్టా చేసేందుకు రియల్టర్ల స్కెచ్..
- అడ్డుకుంటున్న అధికార పార్టీ సర్పంచ్
- సమగ్ర దర్యాప్తు డిమాండ్ చేస్తున్న వైనం..
- బెదిరింపులతో.. ప్రాణ రక్షణ కోసం మీడియాను ఆశ్రయించిన బాధితుడు..
విధాత, మెదక్ ఉమ్మడి జిల్లా బ్యూరో: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారం గ్రామ పంచాయతీ పరిధిలో భారీ భూ కుంభకోణం జరుగుతోంది. సర్వే నంబర్ 201లోని మొత్తం 588 ఎకరాలలో 315 ఎకరాలు పట్టా భూమి ఉంది. ఈ భూమిపై భూమి హక్కులకు సంబంధించి కొన్నిఉంటే, ఫేక్ రిజిస్ట్రేషన్లు, డబుల్ రిజిస్ట్రేషన్లు, గిఫ్ట్ డీడ్ లు పొజిషన్లకు సంబంధించి అనేక కేసులు హైకోర్టులో పెండిగ్ లో ఉన్నాయి.
మరో 273 ఎకరాల భూమిలో కొన్ని ఎకరాలు ప్రభుత్వ అసైండ్ ల్యాండ్ కాగా, కొన్ని ఎకరాలు ఎక్స్ సర్వీస్ మెన్లకు, పేద రైతులకు, ట్రివియాడ్, డంపింగ్ యార్డ్ లకు కేటాయించడం జరిగింది. దాదాపు 117 మంది రైతులకు ఒక్కో ఎకరా చొప్పున ఆసైండ్ ల్యాండ్ కేటాయించడం జరిగింది. పాత పాసుబుక్‌లు ఉన్నా.. ధరణి ఆన్ లైన్ ఎంట్రీ కాకపోవడం వల్ల కొత్తగా హక్కులకు సంబంధించి ధరణి పోర్టల్‌లో లేటెస్ట్ సర్టిఫికేట్లు రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు 2007 సంవత్సరంలో 613 ప్లాట్లలో లేవుట్ చేసి ఇందిరమ్మ కాలనీ పేరిట ఒక్కొక్కరికీ 60 గజాల చొప్పున 300 మంది పేదలకు ప్లాట్లు అందజేశారు. మిగిలిన 913 ప్లాట్ల పై ఎవరికీ స్పష్టత లేదు. ఎవరెవరికీ ఏ ప్రాతిపదికన కేటాయిస్తున్నారో కూడా సంబంధిత అధికారులకు కూడా తెలియకపోవడం విడ్డూరం. ఈ లుకలుకలు, అస్పష్టత, అవకతవకలను తొలగించేందుకు.. స్పష్టత తీసుకొచ్చేందుకు సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా దరఖాస్తు పెట్టుకున్నా ఎలాంటి ప్రయోజనం లేదని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కబ్జా చేసేందుకు పథకం
దీనిని ఆసరాగా చేసుకుని.. కొంతమంది భూకబ్జాదారులు.. పెట్టుబడిదారులు మొత్తం 588 ఎకరాల ప్రభుత్వ భూమిని రైతులకు, పేదలకు, ఎక్స్ సర్వీస్‌మెన్లకు కేటాయించిన వ్యవసాయ భూమిని, ప్లాట్లను అన్యాక్రాంతం చేసేందుకు భారీ పథకం వేశారు. దీంతో స్థానిక రెవెన్యూ అధికారులు, పంచాయతీ అధికారులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన స్థానిక లీడర్లతో కుమ్మక్కై అన్ని రకాల సహాయ సహకారాలు పొందుతూ కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు.
మార్కెట్ విలువ రూ.1500 కోట్ల పైనే..
దర్జాగా ప్రభుత్వ భూములలో లే అవుట్లు వేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ మొత్తం భూమి మార్కెట్ విలువ రూ.1500 కోట్ల పైనే ఉంటుంది. గ్రీన్ లేక్ ప్రాపర్టీ డెవలపర్స్ పేరిట 10 ఎకరాలు లే అవుట్ వేసి.. ప్లాట్లు విక్రయించి, ఎర్రగడ్డలో ఉన్న అనైక ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే ప్రైవేట్ కంపెనీకి వందల ఎకరాలు దారాదత్తం చేసి.. తద్వారా కోట్ల రూపాయలను దండుకునేందుకు భారీ ప్లాన్ వేశారు. మరో అక్రమం.. 1979 ఫేక్ ఎక్స్ సర్వీస్‌మెన్ సర్టిఫికేట్‌ను సృష్టించి ఉద్దెల అన్నపూర్ణ పేరుతో 8 ఎకరాలు 1995 సంవత్సరంలో అమ్మినట్లు రిజిస్ట్రేషన్ చూపించి సుమారు 50 కోట్ల రూపాయల భూమిని కాజేశారు.
వార్డు మెంబర్లు అక్రమంగా.. అనధికారికంగా లే అవుట్లకు అనుమతులు ఇచ్చి.. ఫోర్జరీ సంతకాలు చేసి, వారి కుటుంబీకుల పేరిట చెక్కులు దర్జాగా తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా బినామీల ముసుగులో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నారు. వీటన్నింటి పై దర్యాప్తు చేయాలని అర్జీలు పెట్టుకుంటే తూతూ మంత్రంగా ఆడిట్ రిపోర్టు నిబంధనలు తుంగలో తొక్కి రెండు రోజుల్లో తనిఖీ చేసి క్లీన్ చిట్ ఇచ్చారు. అంతేకాదు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికే అధికారులు చెక్ పవర్‌ను కట్టబెడుతున్నారు.
భూ అక్రమాలపై హైకోర్టుకు వెళ్తాను..
ఈ అక్రమాలపై ప్రశ్నించినందుకు మాపైనే కేసులు బనాయిస్తున్నారు. 2020 సంవత్సరం జూన్ 29న అక్రమ లే అవుట్లు, నిర్మాణాలపై గుమ్మడిదల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. క్రైం నంబర్ 80 2020 ఎఫ్ఎస్ఐఆర్ నమోదయినా చర్యలు తీసుకోలేదు. లోకాయుక్తలో ఫిర్యాదు చేయగా.. ఆర్డర్స్ చేశారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. త్వరలో భూ అక్రమాల పై హైకోర్టులో పిల్ వేస్తాను.
అంతు చూస్తామని బెదిరిస్తున్నారు: సర్పంచ్
రైతుల, పేదల పక్షాన పోరాటం చేస్తున్నందుకు నన్ను టార్గెట్ చేసి సస్పెండ్ చేశారు. కేసులు ఉపసంహరించుకొని వారితో చేతులు కలపాలని.. నువ్వు ఒక్కడివి ఏం చేస్తావ్.. కాంప్రమైజ్ అయిపో అని బెదిరిస్తున్నారు. నేను ఒప్పుకోకపోవడంతో నీ అంతు చేస్తాం అని బెదిరిస్తున్నారు.
అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామంటున్నారు. మా కుటుంబమంతా భయాందోళనలో ఉన్నాం. ప్రాణ భయంతో ఈ రోజు మీడియా సమక్షంలో తెలియజేస్తున్నాను. నాకు నా కుటుంబానికి ఎలాంటి హాని జరిగినా.. అక్కడ పెట్టుబడిపెట్టిన రియల్టర్లు, స్థానిక రెవెన్యూ అధికారులు, స్థానిక రాజకీయ నాయకులే బాధ్యత వహించాలి.
భూ ఆక్రమాల పై ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకొని స్వతంత్ర దర్యాప్తు జరిపించాలి. ఆరోపణలు ఎదుర్కొంటున్న రెవెన్యూ, గ్రామ పంచాయతీ అధికారులు, స్థానిక రాజకీయ నాయకులపై కఠిన చర్యలు. తీసుకోవాలని కోరుతున్నాను. రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందించి.. భూ అక్రమార్కుల పై చర్యలు తీసుకొని నాకు నా కుటుంబానికి రక్షణ కల్పించాలని సర్పంచ్ వేడుకుంటున్నాను.