Reflective Tapes | ఇకనుండి తెలంగాణలో వాహనాలపై రిఫ్లెక్టివ్‌ టేపులు తప్పనిసరి

తెలంగాణ ప్రభుత్వం రాత్రి పూట జరిగే ప్రమాదాల నివారణకు వాహనాలపై రిఫ్లెక్టివ్‌ టేపులు, రియర్‌ మార్కింగ్‌ ప్లేట్లు తప్పనిసరి చేసింది. QR కోడ్‌ ద్వారా వాటి నాణ్యతా ధృవీకరణ తప్పనిసరి.

Reflective Tapes | ఇకనుండి తెలంగాణలో వాహనాలపై రిఫ్లెక్టివ్‌ టేపులు తప్పనిసరి

హైదరాబాద్‌:
Reflective Tapes | రాత్రి వేళ రోడ్లపై జరిగే ప్రమాదాలను తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. రవాణా, రోడ్లు & భవనాల శాఖ నూతన మార్గదర్శకాలు జారీ చేస్తూ, ఇకపై అన్ని వాహనాలకు ధృవీకరించిన రిఫ్లెక్టివ్‌ టేపులు, రియర్‌ మార్కింగ్‌ ప్లేట్లు తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా రాత్రిపూట పార్క్‌ చేసి ఉంచిన భారీ వాహనాలు లేదా నెమ్మదిగా వెళ్లే లారీలు స్పష్టంగా కనిపించకపోవడం వల్లే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.

ఏ వాహనాలకు తప్పనిసరి?

తాజా మార్గదర్శకాల ప్రకారం రెండు చక్రాల వాహనాలు, మూడు చక్రాల వాహనాలు (ఈ-రిక్షాలు సహా), సరకు రవాణా వాహనాలు, ప్యాసింజర్‌ వాహనాలు, బస్సులు, ట్రాక్టర్లు, ట్రాలర్లు, నిర్మాణ పరికరాలు, హార్వెస్టర్లు, మాడ్యూలర్‌ హైడ్రాలిక్‌ ట్రాలర్లు అన్నీ సర్టిఫైడ్‌ రిఫ్లెక్టివ్‌ టేపులు, రియర్‌ మార్కింగ్‌ ప్లేట్లు అమర్చుకోవాలి. ఇవి AIS 057, AIS 089, AIS 090 ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. వాహన యజమానులు ధృవీకరించబడిన టేపులు, మార్కింగ్​ ప్లేట్లను  మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది.

రిఫ్లెక్టివ్‌ టేపులు, రియర్‌ మార్కింగ్‌ ప్లేట్లు అంటే ఏమిటి?

వాహనాలు రాత్రివేళల్లో స్పష్టంగా కనిపించడానికి (Visibility) రిఫ్లెక్టివ్‌ టేపులు మరియు రియర్‌ మార్కింగ్‌ ప్లేట్లు ఉపయోగిస్తారు.

  • రిఫ్లెక్టివ్‌ టేపులు:

Reflective Tape use made mandatory in Telangana

  • ఇవి ప్రత్యేక పదార్థంతో తయారు చేసిన స్టిక్కర్​ స్ట్రిప్స్‌. వెలుతురు పడినప్పుడు చాలా దూరం నుంచే ఇవి మెరుస్తుంటాయి. లారీలు, బస్సులు, ట్రాక్టర్లు, ట్రాలర్లపై , వెనుకవైపు, పక్కలకు వీటిని అతికించ​డం వలన రాత్రివేళల్లో కూడా వాహనం ఎటువైపు నుండైనా స్పష్టంగా కనిపిస్తుంది.
  • రియర్‌ మార్కింగ్‌ ప్లేట్లు:

  • ఇవి ఎరుపు, పసుపు రంగులతో ఉన్న కాంతి పరావర్తన ప్లేట్లు.  ఇవి కూడా రిఫ్లెక్టివ్​ టేపుల వంటివే కానీ, ప్లాస్టిక్​ లేదా లోహంతో తయారుచేస్తారు కాబట్టి మన్నిక ఎక్కువ. వీటిని వాహనం వెనుక భాగంలో అమర్చుతారు. వాహనం నెమ్మదిగా వెళ్తున్నా లేదా రోడ్డుపై పార్క్‌ చేసి ఉన్నా, వెనుక నుంచి వచ్చే వాహనాలకు ముందుగానే వాటి ఉనికి తెలిసిపోతుంది. తద్వారా వెనుక వచ్చే వాహనాలు జాగ్రత్త పడతాయి.

ఈ భద్రతా పరికరాల వలన రాత్రిపూట జరిగే ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

QR కోడ్‌ ద్వారా ధృవీకరణ

నకిలీ లేదా నాసిరకం టేపులు, మార్కింగ్​ ప్లేట్లు వాడకుండా, QR ఆధారిత మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (MIS) ద్వారా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే రిజిస్ట్రేషన్‌, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లభిస్తుంది. సెంట్రల్‌ మోటార్‌ వెహికల్‌ రూల్స్‌ (CMVR) నిబంధనలు పాటించే ఒరిజినల్‌ ఎక్విప్‌మెంట్‌ మాన్యుఫాక్చరర్స్‌ (OEMs) మాత్రమే రోడ్డు రవాణ శాఖలో నమోదవుతారు. నిబంధనలు పాటించని తయరీదారులు లేదా నకిలీ ఉత్పత్తులు సరఫరా చేసినవారి బ్యాంక్‌ గ్యారంటీలు రద్దు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలతో రాత్రిపూట రహదారులపై వాహనాలు స్పష్టంగా కనబడటం వల్ల, ముఖ్యంగా హైవేల్లో జరిగే ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని అధికారులు ఆశిస్తున్నారు. రిఫ్లెక్టివ్‌ టేపులు, మార్కింగ్‌ ప్లేట్ల అమలు తప్పనిసరిగా జరిగేలా ట్రాన్స్‌పోర్ట్‌ శాఖ కఠిన చర్యలు తీసుకోనుంది.