DJ Sound Pollution | వినాయక నవరాత్రుల్లో  చెలరేగిపోయిన డీజే టిల్లు!

భయంకర శబ్దాలను వినిపిచే డీజే సౌండ్‌ సిస్టమ్స్‌పై తెలంగాణలో నిబంధనలు ఉన్నాయి. కానీ.. ఇటీవలి గణపతి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా ఈ నిబంధనలు గాలికి కొట్టుకుపోయాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

DJ Sound Pollution | వినాయక నవరాత్రుల్లో  చెలరేగిపోయిన డీజే టిల్లు!

హైదరాబాద్, సెప్టెంబర్‌ 12 (విధాత):

DJ Sound Pollution | ప్రతి ఏడాది తరహాలోనే ఈ సంవత్సరం కూడా వినాయక మండపాల వద్ద డీజే శబ్ధాల మోత ఆగలేదు. దాదాపు అన్ని మండపాల వద్ద ఇదే పరిస్థితి కన్పించిందని ప్రజలు వాపోతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, బ్లడ్ ప్రెషర్ ఉన్నవారు నరకయాతన అనుభవించారు. గణేష్ నవరాత్రుల సందర్భంగా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే సౌండ్ సిస్టమ్ అనుమతించాలని హైకోర్టు సూచించినప్పటికీ ఎక్కడా పాటించిన దాఖలాలు లేవని పరిశీలకులు అంటున్నారు. ఎప్పటిలాగే ఈసారి కూడా డీజే శబ్ధాలతో దడ పుట్టించారు. పోలీసులు కూడా చూసీచూడనట్లు వ్యవహరించారని బాధితులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. శబ్ధాలతో అవస్థలు పడుతున్నామని ఫిర్యాదు చేసిన తరువాత మొక్కుబడిగా వచ్చి మండపాల నిర్వహాకులు చెప్పి వెళ్లిపోవడం మినహా ఏమీ చర్యలు తీసుకోలేదంటున్నారు. ఏ ఒక్క మండపం వద్ద శబ్ధాల తీవ్రతను రికార్డు చేసే డెసిబుల్స్ పరికరాలను ఏర్పాటు చేయలేదు. పోలీసు స్టేషన్లలో కూడా హెల్ప్ డెస్కులను ఏర్పాటు చేయలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. విచ్చలవిడిగా మండపాల వద్ద టపాకాయలు, మందుగుండు వినియోగించారు.

హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు

  • వినాయక నవరాత్రులు, పండుగల పేరుతో ఎవరినీ ఇబ్బందులకు గురి చేయరాదని హైకోర్టు గతంలోనే స్పష్టం చేసింది.
  • డీజే శబ్దాలపై నిషేధంపై హైకోర్టు ఆదేశాలు ఉన్నా పోలీసులు అమలు చేయడం లేదంటూ కోర్టు ధిక్కరణ పిటీషన్ దాఖలు అయింది.
  • దీనిపై హైకోర్టు జస్టిస్ ఎన్.వి.శ్రవణ్ కుమార్ ధర్మాసనం ఈ ఏడాది ఆగస్టు నెల చివరి వారంలో ప్రభుత్వానికి, పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
  • సౌండ్ సిస్టమ్ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 వరకు మాత్రమే అనుమతించాలని, గుండెలదిరే శబ్ధాలపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖకు స్పష్టం చేశారు.
  • గణేష్ ఉత్సవాలు కొనసాగే 11 రోజులు ఫిర్యాదు చేసేందుకు వీలుగా ప్రతి పోలీసు స్టేషన్ లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
  • స్థానిక సంస్థలు గుర్తించిన కమ్యూనిటీ మైదానాలు, ఖాళీ స్థలాల్లో విగ్రహాలు ఏర్పాటు చేయాలని తన తీర్పులో పేర్కొన్నారు.

వినాయక మండపాల్లో డీజే జోరు

నవరాత్రులు నిర్వహించిన ప్రతి మండపం వద్ద డీజే బాక్సులను ఏర్పాటు చేసి, రాత్రి 10 గంటల నుంచి తెల్లవారు జాము వరకు మోత మోగించారు. ముసలివాళ్ళు అయితే గుండె బిగపట్టుకుని గడిపారు. ఈ శబ్ధాల రొద వినలేక పలువురు డయల్ 100, సంబంధిత పోలీసు స్టేషన్లకు ఫోన్లు చేశారు. పోలీసు స్టేషన్ కు ఫోన్ చేస్తే, 100 ఫోన్ చేయమని పోలీసులు సూచించారని, 100కు కాల్ చేసి చెబితే సంబంధిత పోలీసు స్టేషన్ కు సమాచారం ఇస్తామని చెప్పి ముగించేవారని పలువురు చెబుతున్నారు. చెవులు పగిలిపోయేలా వచ్చే మ్యూజిక్ ను తట్టుకోలేక కొందరు ప్రతి రోజు డయల్ 100 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. పోలీసులు మండపాల వద్దకు వచ్చి నిర్వాహకులతో మాట్లాడి వెళ్లిపోయేవారు. వారు వెళ్లిన మరుక్షణం మళ్లీ డీజే శబ్ధాల దరువు ఆగలేదని ఫిర్యాదుదారులు వాపోతున్నారు. మండపాల వద్ద భక్తి పాటల కన్నా సినిమా పాటలు వేసి డిస్కో డ్యాన్స్ లు చేశారు. ఓ రాములమ్మ, కైకే పాన్ పాన్ బన్ రస్ వాలా, చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే వంటి సినిమా పాటలు వేసుకుని వినాయక విగ్రహాల ముందు డ్యాన్స్ చేశారు. ఎక్కడా సాంస్కతిక వైభవం మచ్చుకు కూడా కన్పించడం లేదన్న అభిప్రాయాలను భక్తులు వ్యక్తం చేస్తున్నారు. మద్యాన్ని తాగి డ్యాన్స్ లు చేశారనేది బహిరంగ విషయమే. నిమజ్జనం రోజు అయితే బహిరంగంగానే నిర్వాహకులు మద్యం సేవించి ఊరేగింపులో డ్యాన్స్ లు చేశారని మహిళలు మండిపడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 3.3 లక్షల వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు.

డీజే సౌండ్స్ తో నరకయాతన

  • పరిమితికి మించిన శబ్ధాల కారణంగా బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదముందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
  • భారీ శబ్ధాలతో బీపీ పెరిగి గుండె లయ తప్పుతుందని అంటున్నారు.
  • ఈ ఏడాది ఏపీ లో ఒకరు, తెలంగాణ లో మరొకరు ఊరేగింపులో డ్యాన్స్ చేస్తునే కుప్పకూలారని పేర్కొన్నారు.
  • నిర్మల్ జిల్లా భైంసా లో ఊరేగింపు వేడుకల్లో పాల్గొన్న ఆరుగురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై కళ్ళు తిరగడం, వాంతులు చేసుకోవడంతో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు.
  • 85 డెసిబిల్స్ మించే శబ్ధాలను చెవి ఎట్టి పరిస్థితుల్లో భరించదు.
  • డీజేలతో 100 డెసిబిల్స్ కు మించి శబ్ధం తీవ్రత ఉంటుంది.
  • వృద్ధులు, గర్భిణీలు, బ్లడ్ ప్రెషర్, గుండె వ్యాధిగ్రస్తులు, చిన్నారులు రాత్రి సమయంలో నిద్రాభంగానికి లోనవుతారాని వైద్యులు వివరించారు.

మహారాష్ట్రలో నిషేధించిన డీజేలు తెలంగాణలోకి

వినాయక చవితిని ఘనంగా జరిపే రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంటుంది. కానీ.. మహారాష్ట్ర ప్రభుత్వం వినాయక మండపాల వద్ద డీజేల వినియోగాన్ని, ఊరేగింపులో వాడకాన్ని పూర్తిగి నిషేధించింది. ముంబై మహా నగరంలో నిషేధం కట్టుదిట్టంగా అమలు చేయడంతో, అక్కడి వారు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించారు. మహారాష్ట్రలో ఎక్కువగా నకిలీ డిజే సిస్టమ్ లను ఎక్కువగా వినియోగించారు. వీటిని వినియోగం మూలంగా మనుషుల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా, ఏకాగ్రత పూర్తిగా నశిస్తుంది. వీరంతా తెలంగాణలో నవరాత్రులలో వీటిని ఏర్పాటు చేసి, రెండు చేతులా సంపాదించుకుని వెళ్లిపోతున్నారు.

వేలం వెర్రిగా లడ్డూల వేలం పాట, పట్టింపు లేని ఐటీ శాఖ

పలు మండపాల వద్ద నిర్వాహకులు లడ్డూల వేలం పాట చేపట్టారు. నగరంలో అత్యధికంగా గండిపేట మండలం సన్ సిటీ లో రిచ్ మండ్ విల్లాస్ లో లడ్డూను రూ.2.32 కోట్ల కు వేలం వేశారు. నాలెడ్జీ సిటీ మై హోం భుజా లో రూ.51 లక్షలు, బాలాపూర్ లడ్డూ రూ.35 లక్షలు వెచ్చించి లడ్డూ కొనుగోలు చేశారు. గత పది సంవత్సరాలుగా ఈ వేలం వెర్రి కొనసాగుతున్నది. అయితే ఇప్పటి వరకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేయడం కాని కేసులు నమోదు చేయడం కాని చేయలేదంటున్నారు. వ్యక్తులు కొనుగోలు చేస్తున్నారా, సమూహంగా ఏర్పడి కొనుగోలు చేస్తున్నారా అనేది విచారణ చేస్తే కాని తెలియదు. ఈ వేలం వెర్రిని నిలువరించేందుకు ఆదాయపు పన్ను అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.

గ్రేటర్ లో ఒక్క కేసు నమోదు కాలేదు

  • మండపాల వద్ధ శబ్ధాల తీవ్రతపై, రాత్రి 10 గంటల నుంచి తెల్లవారు జాము వరకు మోత పై గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక్క పోలీసు కేసు కూడా నమోదు కాలేదని సమాచారం.
  • అయితే పెద్ద సంఖ్యలో డయల్ 100 కు బాధితులు ఫోన్లు చేసి ఫిర్యాదు చేశారు.
  • స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీల సూచనల మేరకు పోలీసులు కూడా చూసీ చూడనట్లు వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి.
  • 11 రోజుల పాటూ విగ్రహాల ముందు కార్యక్రమాలు నిర్వహించిన వారు తమ వంతుగా పోలీసు స్టేషన్లలో రూ.5వేల నుంచి రూ.25వేల వరకు ముట్టచెప్పుకున్నట్లు తెలిసింది.
  • ఇలా చెల్లించిన మండపాల పట్ల పోలీసులు కొంత మెతకగా ఉన్నారని, ఏ విధమైన చర్య తీసుకోలేదని అంటున్నారు.
  • హైకోర్టు ఆదేశాల ప్రకారం కేసులు నమోదు చేయాల్సిన పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారనే విమర్శలు ఎక్కువగా విన్పిస్తున్నాయి.

అనుమతి ఇచ్చే ముందే అఫిడవిట్ లు తీసుకోవాలి

ప్రతి వినాయక మండపం ముందు నిర్వాహకుల పేర్లు, మొబైల్ నెంబర్లతో బోర్డులు పెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా అనుమతులు ఇచ్చే ముందు పోలీసులు నిర్వాహకుల నుంచి అఫిడవిట్ లు తీసుకోవాలని, దాంతో పాటు ఆధార్, పాన్ వివరాలు కూడా తీసుకోవాలని కోరుతున్నారు. ఇలా చేయడం మూలంగా నిర్వాహకుల్లో భయం ఉంటుందని, డీజేలను ఏర్పాటు చేయడానికి వెనకంజ వేస్తారని అంటున్నారు.