Municipal Elections | ముగిసిన మున్సి‘పోల్స్‌’ ప్రచారం.. బరిలో 12,930 మంది అభ్యర్థులు

మున్సిపల్‌ ఎన్నికలకు ప్రచార పర్వం ముగిసింది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు 11న పోలింగ్ నిర్వహించి.. 13న కౌంటింగ్ చేపట్టనున్నారు.

  • By: TAAZ |    telangana |    Published on : Feb 09, 2026 9:49 PM IST
Municipal Elections | ముగిసిన మున్సి‘పోల్స్‌’ ప్రచారం.. బరిలో 12,930 మంది అభ్యర్థులు
  • 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు 11న పోలింగ్, 13న కౌంటింగ్

విధాత, హైదరాబాద్:
Municipal Elections | రాష్ట్రంలో గత వారం రోజులుగా హోరెత్తిన మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం 5 గంటలతో తెరపడింది. పోలింగ్‌కు ముందు 48 గంటల నిశ్శబ్దకాలం అమల్లోకి వచ్చింది. సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ ప్రచారాలపై కూడా ఆంక్షలు విధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే రెండు సంవత్సరాల జైలు లేదా జరిమానా ఉన్నందున రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నిబంధనలు పాటించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఈ నెల 11వ తేదీన 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ నిర్వహించనున్నారు. 13వ తేదీన ఓట్ల లెక్కింపు ఉండనున్నది. పలు పార్టీలకు చెందిన 12,930 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ 8,203 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొనడంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న వెంటనే ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. ఆయన రాకకు ముందే మాజీ సీఎం కేసీఆర్, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ రావులను ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారించడంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. రాష్ట్ర మంత్రులకు ప్రచార బాధ్యతలు అప్పగించి, తమ పరిధిలో ఏ ఒక్క మున్సిపాలిటీ కూడా ఓడిపోకుండా గట్టిగా ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సన్న బియ్యం, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైతు రుణ మాఫీ వంటి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. సర్పంచి ఎన్నికల్లో గెలిచిన విధంగా మున్సిపాలిటీలో అత్యధిక సీట్లను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ శ్రేణులకు ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. గత వారం రోజులుగా ఆయన సుడిగాలి పర్యటనలు చేస్తూ అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీలను ఘాటుగా విమర్శించారు. గల్లీ ఎన్నికలకు ప్రధాని నరేంద్ర మోదీకి ఏం సంబంధం అని, మోదీ వచ్చి మోరీ సాఫ్ చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మున్సిపాలిటీలలో పెత్తనం చేసింది తప్ప డెవలప్ మెంట్ చేయలేదన్నారు. ఇవాళ సమస్యలకు ప్రధాన కారణం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు కాదా అని అడిగారు. ఈ ఎన్నికల ఫలితాలు రేవంత్ రెడ్డి కి సవాల్ గా మారడంతో ఆయన ఒక అడుగు ముందుకు వేసి కేసీఆర్ కుటుంబాన్ని నల్లగొండ జిల్లాలో పరుష పదాలతో విమర్శలు గుప్పించారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ ఫలితాల్లో ఏమాత్రం తేడా వచ్చినా కాంగ్రెస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైందనే సంకేతాలతో ప్రతిపక్షాల్లో జోరు పెంచే ప్రమాదముంది. అత్యధిక స్థానాలు దక్కించుకోనట్లయితే స్వంత పార్టీలోనే విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు రేవంత్ రెడ్డి ముందున్నాయనే చర్చ జరుగుతోంది.

మాజీ సీఎం కేసీఆర్, రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావులు ఫోన్ ట్యాపింగ్ విచారణకు హాజరు కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక్కసారిగా నిరాశ ఆవహించిందంటున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న తరుణంలో సిట్ నోటీసులు పార్టీ శ్రేణుల్లో కలకలకం రేపాయి. మాజీ ఎమ్మెల్సీ దేవనపల్లి కవిత ఆరోపణలతో పార్టీలో అంతర్గత చర్చ జరుగుతోంది. గజ్వేల్, సిద్ధిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో ఓటర్లు నిలదీయం బీఆర్ఎస్ నేతలకు ఏమాత్రం మింగుడుపడడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందిందంటూ కేటీఆర్, హరీశ్ రావులు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. తమ హయాంలో చేసిన డెవలప్ మెంట్ ను చూసి ఓటేయాలని ఓటర్లను కోరారు. రెండేళ్ల తరువాత రాష్ట్రంలో తాము మళ్లీ అధికారంలోకి వస్తామని కేటీఆర్ చెబుతుండడంతో శ్రేణుల్లో జోష్ నింపింది.

సర్పంచి ఎన్నికల్లో చతికిల బడిన బీజేపీ ఇంకా కోలుకున్నట్లు లేదు. అర్బన్ ఓటర్లలో పట్టు పెంచుకునే ప్రయత్నం చేసినట్లుగా కన్పించడం లేదు. రాష్ట్ర నాయకుల మధ్య సమన్వయ లేమి, ఎవరికి వారుగా ప్రచారం చేసుకుంటుండడం మైనస్ గా మారింది. ఎనిమిది ఎంపీలు ఉన్నా ఆ స్థాయిలో ప్రచారం చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. కాళేశ్వరం కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలని ఆరు నెలల క్రితమే తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించినా ఇంత వరకు కేంద్రం ఆమోదించకపోవడం మైనస్ గా మారింది. ఫార్ములా ఈ రేసు కేసులో కేంద్రంలోని డీఓపిటీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ విచారణకు అనుమతించకపోవడం బీజేపీ నేతలను ఇరుకున పెడుతోంది. ఎన్నడూ లేని విధంగా ఎంఐఎం పార్టీ రాష్ట్రంలో 282 మున్సిపల్ డివిజన్లలో పోటీకి అభ్యర్థులను బరిలో దింపింది. ముస్లిం ఓటు బ్యాంకు ఉన్న డివిజన్లలోనే గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నది. అదిలాబాద్, నిర్మల్, సంగారెడ్డి, జగిత్యాల, బోధన్, కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, నారాయణపేట్ మున్సిపాల్టీలలో పాగా వేసే లక్ష్యంగా ప్రచారం సాగించింది. మాజీ ఎమ్మెల్సీ దేవనపల్లి కవిత సింహం గుర్తుతో 288 డివిజన్లలో తన అభ్యర్థులను బరిలో నిలిపింది. వీరి పోటీ మూలంగా బీఆర్ఎస్ నష్టపోతుందా, కాంగ్రెస్ నష్టం వాటిల్లుతుందా అనేది కౌంటింగ్ రోజున స్పష్టత రానున్నది.