Hyderabad Living Cost | హైదరాబాద్‌లో సౌకర్యంగా బతకాలంటే… జీతం ఎంతుండాలి?

హైదరాబాద్‌ ఒకప్పటిలా లేదు.. హైదరాబాద్‌కు పొట్టచేతపట్టుకునో, ఐటీ కంపెనీ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ పట్టుకొనో వచ్చేవారి సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. జీవన వ్యయాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జీవించాలంటే నెలకు ఎంత జీతం అవసరం అనే విషయలో నెట్టింట ఆసక్తికర చర్చ సాగింది. ఆ వివరాలు ఇవే...

  • By: TAAZ |    hyderabad |    Published on : Feb 07, 2026 8:36 PM IST
Hyderabad Living Cost | హైదరాబాద్‌లో సౌకర్యంగా బతకాలంటే… జీతం ఎంతుండాలి?

విధాత, హైదరాబాద్:
Hyderabad Living Cost | హైదరాబాద్ లాంటి నగరంలో జీవించడానికి సగటు వేతన జీవి నిత్యం వెచ్చించాల్సిన డబ్బులు చూస్తే ఎవరికైనా ఠారెత్తపోతుంది. నిజానికి భారత దేశంలో ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో జీవన వ్యయం చాలా తక్కువగా ఉంటుంది. ఐటీ, ఐటీ అనుబంధ సంస్థల పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉండటంతో పలు రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు ఉపాధి కోసం అనేక మంది వస్తుంటారు. ఇక హైదరాబాద్‌ వెళితే ఏదో ఒక పనిచేసుకుని బతకొచ్చని వచ్చే బడుగుజీవులు ప్రతి రంగంలో కనిస్తుంటారు.

కానీ.. గడచిన ఐదారు సంవత్సరాలతో పోల్చితే హైదరాబాద్‌లో ఈ మధ్య జీవన వ్యయం పెరిగింది. ఒక మధ్య తరగతి కుటుంబం లేదా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి హైదరాబాద్‌లో జీవించాలంటే నెలకు ఎంత ఆదాయం సంపాదించాలి? ఎంత వ్యయం అవుతుందనేది సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తున్నది.

హైదరాబాద్‌లో ఉదయం లేవగానే పాల ప్యాకెట్ కొనుక్కోవడం నుంచి ఆ రోజు ప్రారంభం అవుతుంది. పాలతో చాయ్ లేదా కాఫీ తయారు చేసుకుని తమ రోజువారీ పనులు మొదలు పెడతారు. ఇంటిలో తయారు అయిన తరువాత ఆఫీసుకు తన వ్యక్తిగత వాహనంలో బయలు దేరడం, ఆఫీసులో లేదా హోటల్ లో మధ్యాహ్నం బయట భోజనం చేయడం, సాయంత్రం లైట్ గా స్నాక్స్.. ఎవరైనా స్నేహితులు కలిస్తే హోటల్‌లో డిన్నర్ చేస్తారు. తిరిగి అక్కడి నుంచి ఇంటికి చేరుకుంటారు. వీకెండ్‌లో కుటుంబంతో కలిసి షాపింగ్ మాల్ లేదా సినిమాలకు వెళ్తుంటారు. విసుగు అనిపిస్తే నగరం నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్లి పర్యాటక ప్రాంతాలను చుట్టేసి వస్తారు. ఇలాంటి ఖర్చులతో ప్రతి కుటుంబం ప్రతి నెలా ఎంత మొత్తం వెచ్చించాలనేది సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

ఒక లీటర్ పెట్రోల్ టూ వీలర్‌లో పోయించుకుంటే రూ.110 లు చెల్లించాల్సి ఉంటుంది. ఫోర్ వీలర్ వాహనం అయితే ఐదారు లీటర్ల వరకు నింపుకోవాల్సి ఉంటుంది. ఒక మధ్య తరగతి జీవి లేదా ఉద్యోగి ఒక లీటర్ పెట్రోల్ కు రూ.110, లీటర్ పాల ప్యాకెట్ కు రూ.70, పిల్లల స్కూలు లేదా కాలేజీ ఫీజులు, స్కూలు బస్ కోసం రూ.10 వేలు అవసరమవుతున్నాయని నెటిజన్లు లెక్కలు కడుతున్నారు. ఇక ఎల్పీజీ సిలిండర్‌కు రూ.900, ప్రతి నెలా ఇంటర్ నెట్ రూ.800, విద్యుత్ బిల్లులు రూ.2,500, నిత్యావసర సరకులు రూ.10వేలు, టూవీలర్ ఈఎంఐ రూ.3వేలు, కారు ఈఎంఐ రూ.15వేలు, హౌస్ కీపింగ్‌కు రూ.3వేల నుంచి రూ.6వేల వరకు, కాఫీలు, టీ ఖర్చులు రూ.300, హోటల్ భోజనం రూ.150, డ్రెస్సులు, ఇతరత్రా ఖర్చులు నెలకు రూ.5వేలు వెచ్చించాల్సి వస్తున్నదని అంటున్నారు.

ఇవి కాకుండా ఫంక్షన్లు, పర్యాటక ప్రాంతాల సందర్శన, దైవ దర్శనాలు, వ్యక్తిగత ఆరోగ్యం, వైద్య ఖర్చులు అదనంగా ఉంటాయి. వైద్యుల వద్దకు వెళ్లినప్పుడు ఎలాంటి పరీక్షలు లేకుండా మందులు మాత్రమే రాస్తే ఖర్చు పెద్దగా ఉండదు. పరీక్షలు చేయించుకోవాలని సిఫారసు చేస్తే ఖర్చులు పేలిపోతాయి.

బంధువులు, స్నేహితుల ఫంక్షన్లకు వెళ్లడం ప్రతి ఇంట్లోనూ సర్వ సాధారణం. దగ్గరి ప్రాంతాలు అయితే తక్కువతో సరిపోతుంది. అదే దూర ప్రాంతాలు అయితే కాస్త ఎక్కువగానే జేబు నుంచి విదిలించుకోవాల్సి ఉంటుంది.

ఇక ఇంటి అద్దెల విషయానికి వస్తే అన్ని వసతులు ఉన్నా కాలనీలు, అపార్ట్‌మెంట్లలో నివాసం ఉండాలంటే ప్రతి నెలా రూ.35వేలు అద్దె కోసమే కేటాయించాల్సి వస్తున్నది. దిగువ మధ్య తరగతి కాలనీలు అయితే రూ.25వేల వరకు అద్దెలు ఉంటున్నాయి. ల్యాప్ టాప్ లు, మొబైల్ ఫోన్లు, రిస్ట్ వాచ్ లు, లెదర్ గూడ్స్ కొనుగోళ్ళు కూడా ఉంటాయి.

ఇలా ఏ రకంగా చూసినా హైదరాబాద్ వంటి నగరంలో సగటు జీవి వేతనం రూ.60వేల వరకు ఉంటే పొదుపుగా బతకాల్సి ఉంటుంది. అన్నీ లెక్కలు వేసుకుని ఆ ప్రకారంగా నెలవారీ ఖర్చులను సర్ధుబాటు చేసుకోవాలి. రూ.1 లక్ష వరకు వేతనం వస్తే ఏ ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగిపోతుందని నెట్టింట చర్చలు సాగుతున్నాయి.

అనుకోకుండా ఏమైనా ఖర్చులు వచ్చినా, అనారోగ్యం బారిన పడినా పెద్దగా ఇబ్బందులు లేకుండా జీవించవచ్చు. ఇందులో కొంత మొత్తాన్ని పొదుపు కూడా చేసుకోవచ్చు అన్న మాట. ఏది ఏమైనా 60వేల నుంచి లక్ష లోపు ఆదాయం లేదా వేతనం ఉంటేనే హైదరాబాద్‌లో మెరుగైన జీవితానికి అవకాశాలు ఉంటాయనేది నెట్టింట చర్చల సారాంశం.