IND vs PAK T20 CWC Match | భారత్–పాక్ టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌కు గ్రీన్ సిగ్నల్

టీ20 ప్రపంచకప్‌–2026లో ఫిబ్రవరి 15న జరగనున్న భారత్–పాకిస్థాన్ హై వోల్టేజ్ మ్యాచ్‌పై నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. ICC చర్చల తర్వాత PCB యూ టర్న్ తీసుకోవడంతో టోర్నమెంట్​కే హైలైట్​ అయిన మ్యాచ్​ నిర్వహణకు మార్గం సుగమమైంది. అధికార ప్రకటన కాసేపట్లో వెలువడే అవకాశముంది.

  • By: ADHARVA |    sports |    Published on : Feb 09, 2026 10:58 PM IST
IND vs PAK T20 CWC Match | భారత్–పాక్ టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌కు గ్రీన్ సిగ్నల్

India vs Pakistan T20 World Cup 2026 Match Confirmed After PCB U-Turn

భారత్–పాక్ మ్యాచ్‌కు గ్రీన్ సిగ్నల్

టీ20 ప్రపంచకప్‌–2026లో ఫిబ్రవరి 15న జరగాల్సిన భారత్–పాకిస్థాన్ మ్యాచ్‌పై ఉన్న అనిశ్చితి తొలిగిపోయింది. PCB యూ టర్న్ తీసుకోవడంతో ఈ హై ఓల్టేజ్ మ్యాచ్​పై  అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది.

  • పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ‘యూ టర్న్’
  • లాహోర్​లో ఐసీసీ–పీసీబి–బీసీబి చర్చలు
  • ప్రధాని అనుమతి తర్వాత అధికార ప్రకటన
  • పాక్​ డిమాండ్లకు నో చెప్పిన ఐసీసీ

విధాత క్రీడా విభాగం | హైదరాబాద్​:

IND vs PAK T20 CWC Match | టీ20 ప్రపంచకప్‌–2026లో ఇప్పటివరకు సందిగ్ధంలో ఉన్న భారత్–పాకిస్థాన్ కీలక మ్యాచ్‌కు మార్గం సుగమమైంది. ఫిబ్రవరి 15న జరగాల్సిన ఈ గ్రూప్–ఏ మ్యాచ్‌ను బహిష్కరిస్తామని గతంలో ప్రకటించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) తాజాగా వెనక్కి తగ్గినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీంతో భారత్​– పాకిస్థాన్ మధ్య మరోసారి హై వోల్టేజ్ పోరు ఖాయమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బంగ్లాదేశ్‌ను ప్రపంచకప్‌ నుంచి తప్పించడాన్ని నిరసిస్తూ పాకిస్థాన్ తొలుత ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని నిర్ణయించింది. అయితే తాజాగా జరిగిన చర్చల అనంతరం ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.

లాహోర్‌లో కీలక సమావేశం.. మారిన సమీకరణాలు

India vs Pakistan T20 match action scene with packed stadium and fans

ఈ పరిణామాల వెనుక లాహోర్‌లో జరిగిన కీలక సమావేశమే ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఆదివారం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఉపాధ్యక్షుడు ఇమ్రాన్ ఖవాజా, PCB చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం సమావేశమయ్యారు. ఈ చర్చల్లో భారత్–పాక్ మ్యాచ్ బహిష్కరణ అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. రెండు దేశాల మధ్య వివాదాన్ని పరస్పర సంప్రదింపులతో పరిష్కరించుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు పాక్ మీడియా వెల్లడించింది.

అయితే, ఇప్పటివరకు PCB అధికారిక ప్రకటన చేయలేదు. ఈ విషయంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో సంప్రదించిన తర్వాతే తుది నిర్ణయం వెల్లడిస్తామని మొహ్సిన్ నఖ్వీ స్పష్టం చేశారు.

PCB డిమాండ్లకు ICC నో.. ఎందుకిలా?

ఈ సమావేశంలో PCB మూడు కీలక డిమాండ్లను ICC ముందుంచింది.

అవి—

  • భారత్–పాక్ ద్వైపాక్షిక సిరీస్ పునఃప్రారంభం
  • భారత్–పాక్–బంగ్లాదేశ్ త్రైపాక్షిక సిరీస్ నిర్వహణ
  • 2026లో బంగ్లాదేశ్ పర్యటనకు భారత్ హామీ

అయితే వీటిలో కొన్ని డిమాండ్లను ICC తిరస్కరించినట్లు సమాచారం. ముఖ్యంగా ద్వైపాక్షిక సిరీస్ అంశంపై తక్షణ నిర్ణయం తీసుకోవడానికి ICC సిద్ధంగా లేదని తెలుస్తోంది. అది పూర్తిగా భారత క్రికెట్​ నియంత్రణ మండలి నిర్ణయం మీద ఆధారపడిఉంటుందని, తామేం చేయలేమని ఐసీసీ తెలిపినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో పాకిస్థాన్​ బోర్డు తొలుత తీవ్ర వైఖరితో వ్యవహరించినప్పటికీ, అంతర్జాతీయ ఒత్తిళ్లు, టోర్నమెంట్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వెనక్కి తగ్గినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

బంగ్లాదేశ్ వివాదమే అసలు కారణం

India vs Pakistan T20 match moment featuring Abhishek Sharma and Haris Rauf during T20 World Cup

ఈ మొత్తం వివాదానికి మూలం బంగ్లాదేశ్ వ్యవహారమే. తమ మ్యాచ్‌లను భారత్ వెలుపల నిర్వహించాలని బంగ్లాదేశ్ కోరగా, ఐసీసీ అందుకు అంగీకరించలేదు. దీంతో బంగ్లాదేశ్‌ టోర్నమెంట్ నుంచి వైదొలగగా, స్కాట్లాండ్‌ను బంగ్లా స్థానంలో టోర్నీకి ఐసీసీ అనుమతించింది.

ఈ పరిణామాన్ని నిరసిస్తూ పాకిస్థాన్ “బంగ్లాదేశ్‌కు మద్దతుగా” భారత్‌తో మ్యాచ్ ఆడబోమని ప్రకటించింది. అప్పట్లో పాక్ ప్రభుత్వ అధికారిక ఎక్స్ ఖాతా నుంచే ఈ బహిష్కరణపై ప్రకటన రావడం సంచలనం సృష్టించింది. సాధారణంగా క్రికెట్​ బోర్డు నుండి రావాల్సిన ప్రకటన ప్రభుత్వం నుండి రావడాన్ని అంతర్జాతీయ క్రికెట్​ వర్గాలు తీవ్రంగా ఆక్షేపించాయి.

మొహ్సిన్ నఖ్వీ వ్యాఖ్యలు ఏమంటున్నాయి?

ఈ అంశంపై పీసీబి చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ తాజాగా మీడియాతో మాట్లాడుతూ, బంగ్లాదేశ్ తమ సోదర దేశమనీ, వారి అభిప్రాయాన్ని విస్మరించలేమనీ, . ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నందున సరైన సమయం వచ్చినప్పుడు పూర్తి వివరాలు వెల్లడిస్తామని వ్యాఖ్యానించారు. దీంతో PCB ఇప్పటికే యూ టర్న్ తీసుకున్నప్పటికీ, అధికారికంగా ప్రకటించకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తోందని తెలుస్తోంది. ఈ రాత్రికే నఖ్వీ ప్రధానిని కలిసి విషయం వివరించే అవకాశం ఉంది.

అభిమానులకు శుభవార్త

భారత్–పాక్ మ్యాచ్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తారు. టీవీ రేటింగ్స్, స్టేడియం టికెట్లు, స్పాన్సర్ ఆదాయం అన్నింటికీ ఈ మ్యాచ్ కీలకం. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ రద్దైతే టోర్నమెంట్‌ ఆదాయం మీద దెబ్బ పడే పరిస్థితి ఉండేది. ఇప్పుడు మళ్లీ మ్యాచ్ జరగనుందన్న వార్త అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది.

ఫిబ్రవరి 15న ‘క్రికెట్ యుద్ధం’?

అన్ని చర్చలు సానుకూలంగా ముగిసాయి కనుక, ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్–పాక్ మ్యాచ్ జరగనుంది. కేవలం అధికార ప్రకటన మాత్రమే మిగిలింది. ఈ మ్యాచ్ గ్రూప్ దశలోనే కీలక మలుపు కావొచ్చు.

ప్రపంచకప్‌లో రెండు జట్ల మధ్య పోరు అంటే కేవలం ఆట మాత్రమే కాదు… అది భావోద్వేగం, ప్రతిష్ఠ, చరిత్ర కలబోత. అందుకే ఈ మ్యాచ్‌ గురించి ప్రపంచ క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా వేచిచూస్తున్నారు.