సీఎంపై సీనియర్ మంత్రుల గుర్రు!

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన విషయంలో సీనియర్ మంత్రులమని పదే పదే చెప్పుకునేవారు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరి, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారమన్‌ను సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం కలిశారు

సీఎంపై సీనియర్ మంత్రుల గుర్రు!

హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విధాత): సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన విషయంలో సీనియర్ మంత్రులమని పదే పదే చెప్పుకునేవారు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరి, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారమన్‌ను సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం కలిశారు. రీజిన‌ల్ రింగు రోడ్డు, తదితర రోడ్ల అభివృద్ధికి అలాగే ప‌నుల ప్రారంభానికి ఆర్థిక‌, క్యాబినెట్ అనుమ‌తులు ఇప్పించాల‌ని, యంగ్ ఇండియా స్కూళ్లు, ఇత‌ర విద్యా సంస్థ‌ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే, సంబంధిత శాఖల మంత్రులు అయిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పైకి చూడడానికి మా సీఎం రేవంత్ రెడ్డి అని మాట్లాడుతున్నా.. లోపల మాత్రం జీర్ణించుకోలేకపోతున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చర్చించుకుంటున్నట్లు సమాచారం. ఇక భట్టి విక్రమార్క విషయానికి వస్తే.. పార్టీలో చూసినా, మంత్రి పదవుల అంశంలో చూసిన సీఎం రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ అనుభవం ఉన్నప్పటికీ ఆయన బేఖాతరు చేయడం లేదని అలకబూనినట్లు తెలుస్తోంది. అయితే సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ఒంటరిగా కేంద్ర మంత్రులను కలవడం తప్పేమీ కాదని కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కాగా, మంత్రులు ఉండగా సీఎం ఒక్కడే కలవడం వెనక మతలబు ఏంటని, మంత్రులకు కనీస గౌరవం కూడా ఇవ్వకుండా రేవంత్ రెడ్డి మరో కేసీఆర్‌లా వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉంటే మరో వైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సీఎంపై ఇప్పటికే ఎంతగానో అసతృప్తితో రగిలిపోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాంగ్రెస్ కోఠరీలో ఇంత కోల్డ్ వార్ జరుగుతున్నా బయటికి చూడడానికి మాత్రం మేమంతా ఒకటే.. మాకు మాకు మధ్య ఎలాంటి విభేదాలు లేవంటూ కలరింగ్ ఇస్తున్నారని ప్రతిపక్షనేతలు ఎద్దేవా చేస్తున్నారు.